అర్జునుని ఏకాగ్రత
అర్జునుని ఏకాగ్రత
ధృతరాష్ట్ర చక్రవర్తి కుమారులు కౌరవులు. అతని తమ్ముడు పాండురాజు కుమారులు పాండవులు. కౌరవులు, పాండవులు కూడా ద్రోణాచార్యునివద్ద ఇతర విద్యలతో పాటు ధనుర్విద్య నేర్చుకునేవారు. పంచపాండవులలో మధ్యముడు అర్జునుడు. కౌరవులు వందమంది సోదరులు.
వీరందరిలో అర్జునుడు చాలా చురుకైనవాడు. విద్యలన్నిటిలో ముఖ్యంగా ధనుర్విద్యలో అతడు అందరికన్నా మిన్నగా ఉండేవాడు. ఆ విద్యలో అతడు చూపిన శ్రద్ధ, కృషి. అతనిని ద్రోణాచార్యునికి ప్రియ శిష్యునిగా చేశాయి. ధను ర్విద్యలో గురువుగారు పెట్టిన ప్రతి పరీక్షలో అర్జునుడే ప్రథముడుగా వచ్చేవాడు. ఇది కౌరవులకు సహింపరాని విషయమయింది. అది అణుచుకోలేక వారు అప్పుడప్పుడు ‘గురువు గారు అర్జునుడి ఎడ పక్షపాతం చూపుతున్నారని’ అనేవారు.
ఈ మాటలు ద్రోణుడి చెవిని పడ్డాయి. కౌరవుల మనస్సులో ఏర్పడిన ఈ అపోహ తొలగించాలని నిశ్చయించాడు. అర్జునుని కృషి, పట్టుదల, ఏకాగ్రత ఈ లక్షణాలే అతన్ని
అందరికన్నా ముందు ఉంచుతున్నాయని తన మనస్సులో ఎటువంటి పక్షపాతం లేదని నిరూపించదలుచుకున్నాడు.
ఒకనాడు కౌరవ పాండవులను పిలిచి ఒక పోటీ ఏర్పాటు చేశాడు.
“నాయనలారా చూడండి! ఆ ఎదురుగా చెట్టుకొమ్మ మీద ఉండే పావురాన్ని బాణంతో ఎవరు పడగొట్టగలరో చూస్తాను.” అందరు సరే అన్నారు.
ద్రోణుడు ఒక్కొక్కడినే పిలిచి బాణం వేయమన్నాడు. ముందు దుర్యోధనుడు వచ్చాడు.
“దుర్యోధనా! బాగా గమనించు! చెట్టు కొమ్మమీదు పావురాన్ని చూస్తున్నావా! దానిని పడగొట్టాలి.”
దుర్యోధనుడు “గురువర్యా! చూస్తున్నాను. ఆలాగే కొడతాను..” “అయితే పక్షిగాక మరేమి చూస్తున్నావు?”
“స్వామీ! నీలాకాశం, పెద్ద వృక్షము, గుబురుగా ఉన్న ఆకులు, మీరు, నా సోదరులు వీటన్నిటినీ చూస్తన్నాను.”
ద్రోణుడు “అయితే నీవు తప్పుకో ” అన్నాడు. అర్జునుడు తప్ప మిగిలిన వారందరు ఇదే జవాబు చెప్పి అనర్హులైనరు. ఆఖరున అర్జున వచ్చాడు. గురువుగారు అదే ప్రశ్న వేశారు.
“అర్జునా కొమ్మమీద పావురం కనపడ్తున్నదా?”
“కనపడుతున్నది స్వామి!”
“నీకు ఇంకా ఏవి కనపడుతున్నాయి?”
“మరేమి కనపడడం లేదు.”
“బాగా చూడు నాయనా, నీలంగా ఉండే ఆకాశము, గుబురుగా ఉన్న చెట్టు కొమ్మలు, నీ అన్నలు, తమ్ముళ్ళు కనపడడం లేదా?
“లేదు గురువర్యా!” పావురం తప్ప మరేదీ నా దృష్టిలో లేదు,”
ద్రోణుడు చాలా సంతోషించి “పోటీలో గెలుపొందిన వాడివి నీవొక్కనివే” అని అభినందించాడు.
విలువిద్యలో పోటీ అని పిలిచినా నిజంగా ద్రోణుడు పరీక్షించినది ఒక్కొక్కరి ఏకాగ్రత. తను చేయదలచిన దాని మీద ఏకాగ్రత లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు అని ద్రోణుడు చెప్పాడు. విద్యార్థికి తన లక్ష్యము తప్ప ఇటూ అటూ మరే వాటిమీదికి దృష్టి పోరాదు. ఏకాగ్రత లేనివాడి జన్మ నిరర్ధకమే.
ప్రశ్నలు:
- ద్రోణాచార్యుడు అర్జునుని తన ప్రియ శిష్యునిగా ఎందుకు భావించాడు?
- నిజంగా ద్రోణుడు పెట్టిన పరీక్ష ఏది?
[Narration: Ms. Sai Sruthi S.V., Sri Sathya Sai Balvikas Alumna]