శ్రీరాముడు అయోధ్యను వదిలిపెడతాడు
శ్రీరాముడు అయోధ్యను వదిలిపెడతాడు
అయోధ్యా నగరమంతా విస్తారమైన శోక సముద్రంలో మునిగిపోయింది. రాముడు, సీత, లక్ష్మణుడు, సుమంత్రుడు నడుపుతున్న రథంలో అయోధ్య వదిలి పెట్టేరు. సుమంత్రుడు పదునాలుగు సంవత్సరాల వనవసానికి రాముడిని అనుసరించాలనుకున్నాడు. కాని రాముడు అంగీకరించలేదు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మీరు మంచివారైతే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమిస్తారు. ప్రేమించే మీ మంచి స్వభావాన్ని గౌరవిస్తారు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
హీరోలుగా ఉండండి, జీరోలుగా కాదు (విలువలున్న వ్యక్తి నిజమైన హీరో అని గురువులు వివరించాలి).
చివరికి వారు గంగా తీరానికి చేరుకున్నారు. కొంతమంది పడవ నడిపేవాళ్ళు రాజరథాన్ని చూసి వారి నాయకుడు గుహుని వద్దకు పరుగెత్తేరు. గుహుడు తన ప్రజల్ని సమీకరించుకుని రామునికి ఆహ్వానం పలకడానికి పండ్లు, పూలతో వచ్చి తన ఇంటినీ, సుఖంగా ఉండే సదుపాయాల్నీ సమర్పించేడు. కాని రాముడు సున్నితంగా వాటిని తిరస్కరించేడు. మరునాడు ఉదయం వారు సుమంత్రుడికి వీడ్కోలు చెప్పేరు. గుహుడు తన పడవలో వారిని గంగ దాటించేడు. వారు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు రాముడు తిరిగి తన ప్రజల వద్దకు వెళ్ళమని గుహునికి మర్యాదగా చెప్పి చివరికి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. వాల్మీకి సలహాతో సుందరమైన చిత్రకూట పర్వతాన్ని తన నివాసంగా రాముడు ఎంచుకున్నాడు. ఇక్కడ లక్ష్మణుడు సీతా రాముల సహాయంతో ఒక పర్ణశాల నిర్మించాడు. అక్కడ నివసిస్తున్న మహర్షులు, యోగులు రామ దర్శనం చేసుకోవడానికి వెళ్ళేరు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
అవతారమూర్తి అయి ఉండి కూడా రాముడే స్వయంగా పర్ణశాల నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. పనిలేకుండా గడపలేదు.
(ఇక్కడ గురువులు, స్వామి రాత్రింబగళ్ళు ఎలా పనిచేసేవారో, కేవలం మన లాభం కోసం దర్శనం ఇవ్వడం, ఉత్తరాలు తీసుకోవడం, పథకాలను పర్యవేక్షించడం మొదలైన పనులు విసుగు, విరామం లేకుండా చిరునవ్వుతో చేసేవారు వివరించాలి).
లక్ష్మణుడు, సీతలకు రామునిపై గాఢమైన ప్రేమ, ఆత్మీయత ఉండటం వలన, రాముని నుండి దూరంగా ఉండటాన్ని భరించలేక స్వచ్ఛందంగా రాజకుటుంబాలలో అలవాటైన రాజభోగాలని, పదునాలుగు సంవత్సరాలు అన్ని కష్టాలు పడుతూ వనవాసం చేయడానికి, త్యాగం చేశారు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
ముందు మన విద్యుక్త ధర్మం, కుటుంబంలో బంధుత్వానికి ప్రేమ, త్యాగం పునాదిగా ఉండి తీరాలి.