సీతాపహరణం
సీతాపహరణం
వెంటనే శూర్పణఖ తన సోదరుడు రావణుని రక్షణ కోరడానికి లంకకు వెళ్ళింది. శూర్పణఖ విషాదకరమైన స్థితిని చూసిన రావణుడు కోపోద్రిక్తుడయ్యేడు. శూర్పణఖ రాముడు, లక్ష్మణుడు, సీత ఏ అంగరక్షకులు లేకుండా పంచవటిలో నివసిస్తున్నారని చెప్పింది. సీత ఈ భూమండలంలోనే అత్యంత సౌందర్యరాశి అయిన స్త్రీ అని చెప్పింది. రావణుడు సీతను అపహరించడానికి ఒక పథకాన్ని రచించాడు.
రావణుడు మారీచుని దగ్గరకు వెళ్ళేడు. తాను ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపంలోకి మారగల శక్తి మారీచునికుంది. బంగారు లేడి రూపం ధరించి రాముణ్ణి ఆకర్షించి దూరంగా అడవిలోకి తీసుకుపోయి తనకి సహాయం చెయ్యమని రావణుడు మారీచుణ్ణి అడిగేడు. రామునికి దూరంగా ఉండమని రావణునికి నచ్చజెప్పడానికి మారీచుడు ప్రయత్నించాడు. కాని తన పథకానికి ఒప్పుకోకపోతే అతనిని చంపుతానని రావణుడు బెదిరించాడు. రాముని చేతుల్లోనే మరణించడాన్ని ఎంచుకున్న మారీచుడు, సీతాపహరణానికి సహాయం చేస్తానని ఒప్పుకున్నాడు.
మారీచుడు బంగారు లేడిగా మారువేషం ధరించి పర్ణశాల వైపు వెళ్ళగానే, సీత దాన్ని స్వంతం చేసుకోవాలన్న తన కోరికను వ్యక్తపరిచింది. రాముడు పర్ణశాలను రక్షిస్తూ ఉండమని లక్ష్మణునికి చెప్పి బంగారు లేడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: వ్యతిరేక గుణాలు, లక్షణాలన్నీ చాలా ఆకర్షణీయంగా, ప్రలోభ పెట్టేలా ఉంటాయి. కానీ ఒకమారు ఆ ఆకర్షణలకు లోబడితే, వాటి గుప్పెట్లోనుంచి బయటపడడం వాస్తవంగా పోరాటమే అవుతుంది. రామునితో ఉండడానికి తన సంతోషాన్నీ, సిరి సంపదల్నీ, ప్రాపంచిక సుఖాల్నీ త్యాగం చేసి, బంగారు లేడి చేత ఆకర్షితురాలైన సీతకు దుఃఖకారకమైన క్షణం ఎదురైంది. తన త్యాగం బంగారులేడి పై ఆకర్షణగా ఏ క్షణంలో మారిపోయిందో ఆ క్షణంలో ఆమెకు రాముడు దూరమైపోయేడు.
స్వామి అమృతవాక్కులు: ఈ ప్రపంచంలో మన చుట్టూ కనిపించిన వాటిని పొంది, అనందించాలనుకుంటే, భగవంతుని గురించి ఆలోచించకపోతే, దివ్యత్వపు ఉనికినే మరచిపోతే మనం సంతోషంగా ఉండనేలేము.
గ్రహించి, అలవరుచుకోవలసిన విలువలు: మెరిసేదంతా బంగారం కాదు, కనిపించేవి భ్రాంతి కారకాలు కావచ్చు. కోరికలకి స్వీయనియంత్రణ పాటించండి. లేకపోతే అది మన వినాశనానికి దారి తీస్తుంది. దానినే స్వామి సున్నితంగా ఇలా చెప్పారు “కాముడు ఉన్నచోట రాముడు ఉండడు”
ఎంతో అన్వేషణ తర్వాత లేడి వైపు రాముడు బాణం విడిచి పెట్టగానే మారీచుడు భూమి మీద పడి మరణించేడు. కాని మరణించేముందు రాముని కంఠాన్ని అనుకరిస్తూ “హా సీతా! హా లక్ష్మణా!” అని ఆర్తనాదం చేసేడు. ఆ కంఠస్వరం వినగానే సీత రామునికి సహాయంగా వెళ్ళమని. లక్ష్మణుని కోరింది. అతడు రాముని ఆజ్ఞ తిరస్కరించడం ఇష్టపడక రామునికేమీ కాదని చెప్పేడు. లక్ష్మణుడు సీతను తన తల్లిగా భావించేడు అందుచేత ఆమె మాటను కాదనలేకపోయాడు. పర్ణశాల చుట్టూ నాలుగు గీతలు గీసి, ఆ గీతలు దాటి వెళ్ళవద్దని సీతను ప్రార్థించేడు. లక్ష్మణుడు వెళ్ళిన వెంటనే, సన్యాసి వేషం ధరించి తన రూపం మార్చుకున్న రావణుడు పర్ణశాలను సమీపించి భిక్ష అడిగేడు. లక్ష్మణుడు గీసిన గీతలను అతడు దాటలేపోయాడు అందుచేత తాను ఆకలితో ఉన్నాను కాబట్టి తన వద్దకు వచ్చి భిక్ష వెయ్యమని అడిగేడు. సీత, గీతను దాటిన మరుక్షణంలో రావణుడు బలవంతంగా సీతను తన రథం ఎక్కించేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, కొన్ని పనులు చెయ్యవద్దంటే లేక పాఠశాలలో లేక ఇంట్లోనే ఉండమని ఆజ్ఞాపిస్తే, మనం మన్నించాలి. ఎందుచేతనంటే ఏ క్రమశిక్షణ మనపై విధించినా అది మనమంచికే మనం నియమనిబంధనలను ఉల్లంఘిస్తే అది ఆపత్కరమైన ఫలితాలకి దారితీయవచ్చు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: 3-D’s ప్రాముఖ్యత: విద్యుక్త ధర్మం, భక్తి, క్రమశిక్షణ. మన క్రమశిక్షణ సంతృప్తికరంగా లేకపోతే, మిగిలినవి రెండూ అంత ఉపయుక్తంగా ఉండవు అంటారు స్వామి.
పక్షిరాజైన జటాయువు రావణుడు సీతను అపహరించుకొనిపోవడం చూశాడు. రావణుడు జటాయువు రెక్కలను ఖండించి సీతను తీసుకుపోయే వరకూ జటాయువు రావణునితో యుద్ధం చేశాడు. జటాయువు దుఃఖించేడు. రాముణ్ణి కలిసే వరకూ మరణించడానికి అంగీకరించలేదు. అతడు ఈ సంఘటన రామునికి వివరించి చెప్పాలనుకున్నాడు. అందుచేత ప్రార్ధిస్తూ రాముని కోసం వేచి ఉన్నాడు. బంగారు లేడిని చంపిన తరువాత రాముడు పర్ణశాలకు తిరిగి వచ్చేడు. సీత అక్కడ లేకపోవడం చూశాడు. రాముడు, లక్ష్మణుడు సీతాన్వేషణకై బయలుదేరారు. దారిలో వారు జటాయువును కలుసుకున్నారు. జటాయువు జరిగిన కథంతా రాముడికి చెప్పేడు. అప్పుడు జటాయువు రాముని నుండి గంగను స్వీకరించి, తుదిశ్వాస విడిచాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: జటాయువు నిజాయితీపరుడు, ధర్మమూర్తి, సీతను రక్షించడానికి దుర్మార్గుడైన రావణునితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ధర్మబద్ధమైన పనులు చేయడానికి ప్రేమ, నిజాయితీలు ఎలా అలవరుచుకోవాలో గురువులు వివరించాలి.
జటాయువు వృద్ధుడు, అయినా శక్తివంతుడైన రావణుని ఒంటరిగా ఎదుర్కొన్నాడు. బాలలు ధైర్యంగా వేటికీ భయపడకుండా ఉండడం నేర్చుకోవాలి.
ఎ) జీవితంలో ఎటువంటి సవాలునైనా స్వీకరించండి. మీ సామర్థ్యం మేరకు విజయం సాధించండి.
బి) బలహీనులకు చేదోడుగా ఉండండి (ఎవరైనా చుట్టూ ఉన్నవారితో జగడాలాడుతూంటే నిశ్శబ్ద ప్రేక్షకులుగా ఉండకండి).
గురువులు ప్రత్యేకంగా బోధించవలసినవి: ధర్మంకోసం పోరాట మంటే ధర్మం వైపు ఉండడం. పక్షపాతం, అన్యాయం ప్రవర్తన చూస్తే (అది జగడమే కావలసిన అవసరంలేదు) వారి తల్లిదండ్రులు, పెద్దలకు చెప్పాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: మీ పనులలో ధర్మబద్ధంగా ఉండండి. మీ లక్ష్యాలకు బద్ధులై ఉండండి. జీవితం ఒక సవాలు, ఎదుర్కోండి. హీరోలుగా ఉండండి, జీరోలు కాదు. నిజాయితీ, ధర్మబద్ధంగా చేసేవనులు భగవంతుణ్ణి ఎంతగానో సంతృప్తిపరుస్తాయి.