నిజాయితీ

Print Friendly, PDF & Email
నిజాయితీ

రాము పాలు అమ్ముకొని జీవనం చేసేవాడు. అతడు చాలా నిజాయితీపరుడని పేరుపొందాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు సూర్యుడు. రెండవ వాడి పేరు చంద్రుడు. “పరులనెప్పుడు మోసం చెయ్యకు, నీతిలేనివాడు కోతికంటే హీనుడు. జీవితంలో నీతి వల్లనే నిజమైన ఆనందాన్ని అందుకోగలుగుతాము.” అని రాము ఎప్పుడూ పిల్లలకి చెప్తుండేవాడు.

ఒక రోజున సూర్యుడు పశువులను మేతకు తోలుకొని పోకుండా ఆటలాడుకొంటూ కాలక్షేపం చేశాడు. రాము యింటికి రాగానే అది తెలిసి సూర్యుణ్ణి తిట్టాడు. అభిమానంగల సూర్యుడు ఇంటి నుండి వెళ్ళిపోయి మరి తిరిగి రాలేదు. సూర్యుడు జ్ఞాపకానికి వచ్చినపుడల్లా రాముకు చాలా విచారంకలిగేది.

తాను చనిపోతాడనగా కొన్ని రోజుల ముందు రాము చంద్రుణ్ణి పిలిచి “చూడు నాయనా, నీ సోదరుడు ఎక్కడన్నా కనిస్తాడేమో ప్రయత్నించు. అతని నుదుటిమీద ఒక పెద్ద నల్లటి మచ్చ వుంటుంది, అది గుర్తుంచుకో. మనకున్న పది గేదెలలో అతని వాటా క్రింద అయిదు గేదెలు అతనికి ఇవ్వు” అని చెప్పాడు.
కొంతకాలానికి రాము మరణించాడు. తండ్రి కోరిక తీర్చడానికి చంద్రుడు ఆ పరిసర ప్రాంతాలలో జరిగే ప్రతి తీర్థానికి వెళ్ళి సూర్యుడి కోసం వెతికేవాడు. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఒక రోజున పశువులను తోలుకొని తిరిగి యింటికి వస్తున్న చంద్రుడు చెట్టుక్రింద కూర్చొనివున్న ఒక వ్యక్తిని చూశాడు.

అతన్ని సమీపించి పరిశీలిస్తే, అతని నుదుటి మీద ఒక పెద్ద నల్లటి మచ్చ కనిపించింది. అతనే తన సోదరుడైన సూర్యుడని అనుకొని ఎంతో ఆనందించాడు. కాని అతను అలా మాసిన, చిరిగిపోయిన బట్టలు కట్టుకొని వుండడంచూసి చాలా బాధపడ్డాడు. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. “అన్నా! నీకెందుకీ కష్టాలు? ఇంటికి వచ్చేయి. నాన్నగారు మనకి పది గేదెలనిచ్చారు. అయిదింటిని నీవు తీసుకో, పాలు పెరుగు అమ్ముకొంటూ ఆనందంగా జీవిద్దాం” అని చెప్పాడు. సూర్యుడు చంద్రునితో ఇంటికి వెళ్ళాడు. కానీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. వారిద్దరూ కలసి భోజనం చేసిన తరువాత ఒక చాప పరుచుకొని పడుకున్నారు. కబుర్లు చెప్పుకొంటూ నిద్రపోయారు. మరునాటి ఉదయం చంద్రుడు నిద్రలేచేసరికి సూర్యుడు ప్రక్కమీద కనుపించలేదు. అటూ ఇటూ వెతికాడు. ఎక్కడా కనుపించలేదు. సూర్యుడు తన వాటా ఐదు గేదెలతో సహా చెప్పకుండా వెళ్ళిపోయాడు. సూర్యుడు ఎందుకు అలా చెప్పకుండా వెళ్ళిపోయాడో చంద్రానికి అర్థంకాలేదు . అతనికి అనుమానం కూడావేసింది. అసలు తనని ఎవరో మోసంచేసి ఆ గేదెల్ని పట్టుకొని పోయారేమో అని అనిపించింది. అట్లా ఆలోచిస్తూ “నాన్నగారి ఆజ్ఞ ప్రకారం మాట తప్పకుండా నేను చెయ్యవలసింది నేను చేశాను. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నేను చేసింది ఆ భగవంతునికి తెలుసు. నాకంతే చాలు. నేను విచారించవలసిన అవసరంలేదు” అంటూ తనకి తాను సమాధానం చెప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. అందంగా అలంకరింపబడిన రెండెడ్లబండి ఒకటి హఠాత్తుగా వచ్చి చంద్రుడి ఇంటి ముందు ఆగింది.

చంద్రుడు తొంగిచూస్తుండగా ఒక వ్యక్తి బండిదిగి అతని వైపే నడిచి వస్తుండటం కనిపించింది. అతని నొసటిమీద కూడ ఒక పెద్ద నల్లటి మచ్చ కనిపించింది. అతని వాలకం చూస్తుంటే చాలా ధనవంతుడులా కనబడుతున్నాడు. చక్కటి దుస్తులు ధరించాడు. నవ్వుతూ అతన్ని సమీపిస్తూనే “సోదరా! నన్ను గుర్తు పట్టలేదా?” అన్నాడు. చంద్రుడు బిత్తరపోతూ నేను “నిన్ను గుర్తుపట్టాను. కానీ నేనొక పెద్ద పొరపాటు చేశాను. రెండు వారాల క్రితం నీలాగే వున్న ఒకతను వస్తే నీవే అనుకొని, నీ వాటా ఐదు గేదెలు అతనికి యిచ్చేశాను. నేను చేసిన తప్పుకి నిన్ను బాధ పెట్టను. నాకున్న అయిదు గేదెలను నీవు తీసుకో”అని అన్నాడు. సూర్యుడు ఆప్యాయతతో చంద్రుణ్ణి కావలించుకొని “కంగారు పడకు. నీవేమీ తప్పు చేయలేదు. అప్పుడు వచ్చింది కూడా నేనే, నీ నిజాయితీని పరీక్షిద్దామని అలా బీదవాని లాగా వేషం వేసుకుని వచ్చాను. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా వుంది. నీవు ఈ విషయంలో నాన్నగారిని మరిపిస్తున్నావు. ఆయన మనకు నేర్పిన నిజాయితీని నేను మర్చిపోకుండా ఆచరిస్తూ పట్నంలో పళ్లు-కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. నా నిజాయితీ వల్ల నేను వ్యాపారంలో చాలా లాభాలు పొందాను. నేను ఇప్పుడు పెద్ద ధనవంతుణ్ణి. నాకు పట్నంలో పెద్ద యిల్లు వుంది. అంతేకాక ఒక ఎడ్లబండి, మరొక మంచి తోట వున్నాయి. నేను ముఖ్యంగా ఎందుకొచ్చానో తెలుసా? నిన్ను పట్నం తీసుకొని వెళ్దామని. అక్కడ బజారులో నీకొక చిన్న గది కొన్నాను. నీవు అందులో పాలు, మిఠాయి వ్యాపారం పెడుదువుగాని, ఇద్దరం హాయిగా జీవించవచ్చు” అన్నాడు.

ఒకరి నొకరు అప్యాయతతో కావలించుకొన్నారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని, ఇంట్లోవున్న తండ్రిగారి చిత్ర పటంముందు నిలిచి “నాన్నా! నిజాయితీగా జీవించడం మాకు నేర్పావు. అది నీవద్ద నుండి నేర్చుకొన్న మేమెంతో అదృష్టవంతులం. ఎంత డబ్బుపెట్టి కొందామన్నా దొరకని శాంతిని ,ఆనందాన్ని నీవల్లనే మేము పొందగలిగాము” అని ఆయనకు నమస్కరించి కృతజ్ఞతలర్పించారు.

ప్రశ్నలు :
  1. నిజాయితీగా జీవించినందుకు చంద్రుడికందిన ప్రతిఫలము ఏమిటి?
  2. నీతిని పాటించడంచేత సూర్యుడు ఏ విధమైన అభివృద్ధి సాధించాడు?
  3. తండ్రి దగ్గరనుండి వారిరువురు నేర్చుకొన్నదేమిటి? తండ్రికెందుకు ఋణపడి వున్నారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *