సర్వహితకారి – సర్వేశ్వరుడు
సర్వహితకారి – సర్వేశ్వరుడు
భగవంతుడు సూర్యచంద్రులను, నక్షత్రములను ఏర్పరిచాడు. ఆయన వినోదం కోసం యీ విశాల ప్రపంచాన్ని సర్వసుందరంగా సృష్టించుకొన్నాడు. సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతుడే మనకు తల్లి, తండ్రి సర్వస్వము! మనము ఆయన బిడ్డలము.
మనము అనురాగంతోను, అత్యంత విశ్వాసంతోను ఆయనను ఆరాధిస్తే, ఆయన ప్రసన్నుడౌతాడు. మన మనస్సులలోని ఆవేదనలను అర్థం చేసుకొని మనకు కావలసినవి ప్రసాదిస్తాడు. కాని మన కోరిక నిష్కపటంగాను, న్యాయబద్ధంగాను వుండాలి. లేకపోతే మనము ఆయనకు సంతృప్తి కలిగించలేము, మనమూ ఆనందముగా వుండలేము.
మోహర్ అనే గ్రామంలో శంభుడనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ పరుడని, భక్తుడని ఆ పరిసర ప్రాంతములలో ప్రఖ్యాతిపొందాడు. అతడు రోజంతా శ్రమించి పాతచెప్పులు బాగుచేసి, క్రొత్తవి కుడుతూ, తద్వారా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు.
మోహర్ గ్రామనికి ఆ పరిసర ప్రాంతాలకు ఒక గొప్ప జమీందారుగారు ఉండేవాడు. ఒక రోజున ఆ జమీందారు గారు శంభుని గుడిసె ముందునుంచి ఒక పెద్ద గుఱ్ఱంమీద స్వారీ చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ధరించిన విలువైన దుస్తులను, ఠీవిచూస్తే ఆయన ఒక మహారాజులా వున్నాడు. శంభుడు ఆయనను చూచి, “ఒహో! మనవూరి జమీందారుగారు వెళుతున్నారు” అని తనలో తాననుకున్నాడు. “ఆయన ఇరవై గ్రామాలకి అధిపతి. బంగారపు గనినైనా కొనడానికి తగినంత ధనంవుంది. అతని జీవితమొక ఆనంద సముద్రం! కానీ నేనో! పూరిగుడిసెలో! నిరంతరం చర్మం కోసుకొంటూ, చెప్పులు కుట్టుకుంటూ నిర్భాగ్య జీవితాన్ని గడుపుతున్నాను. ఆ భగవంతునికి నా పై ఎందుకు దయలేదో? ” అని వాపోయాడు.
అలా ఆలోచిస్తున్న శంభుని కళ్ళు, గోడమీద అమర్చివుంచిన పండరీశుడైన పాండురంగ విఠల్ ఛాయాచిత్రం మీద వడ్డాయి. నిష్కపట హృదయంతో, నిర్మలచిత్తంతో ఆ ప్రభువు ముందు నిలబడి, “హే భగవాన్! నీవే నా సర్వస్వము. నా తల్లి, తండ్రి అన్నీ నీవే. అహర్నిశలు నేపడుతున్న శ్రమ నీవెరుగనిది కాదు. నాపై జాలిలేదా! నన్ను కరుణించవా? నాకొక పెద్ద ఇల్లు, మంచి పొలం, నాకు, నా భార్యాబిడ్డలకు మంచి మంచి దుస్తులు, వస్తువులు కొనుక్కొనేందుకు సరిపడిన ధనాన్ని అనుగ్రహించవా!” అని ప్రార్థించాడు.
అట్లు అడుగుతున్న శంభుణ్ణిచూసి చిత్రంలోని విఠోబా, కొంచెం నవ్వినట్లు అనిపించింది. తన ఆర్తనాదం దేవుడు విన్నాడని ఆనందించాడు శంభుడు. అంతలోనే “నన్ను చూచి అలా ఎందుకు నవ్వాడు? నేను అత్యాశతో అధికంగా అడిగానా?” అని తనలోతాను విమర్శించుకో సాగాడు.
అదే రాత్రి భగవాన్ విఠోబా జమీందారుకు కలలో కనిపించి “మోహర్ లో చెప్పులు కుట్టే శంభుడు నా భక్తుడు. నీవతనికి సహాయం చేయి. ఒక పెద్దఇల్లు కట్టి ఇవ్వు. ఒక కడవ నిండా బంగారు నాణాలు పంపు. నాలుగు ఎకరాల పొలం అతని పేర నమోదు చెయ్యి. నీకు నా అనుగ్రహం తప్పకుండా వుంటుంది” అని ఆదేశించాడు.
విఠోబా ఆజ్ఞప్రకారం ఆ జమీందారు శంభుడికి అన్నీ అమర్చాడు. శంభుడు తన అదృష్టానికి ఆశ్చర్యపడి, తన్నుతాను నమ్మలేకపోయాడు. తన కుటుంబం అంతా పొలంలో పనిచేస్తూ, నేలను దున్ని, విత్తులునాటి శ్రమించి జీవిస్తున్నారు. వారికి కావలసినవన్ని భగవంతుడు అనుగ్రహించినందుకు ఆనందిస్తున్నారు.
కాని శంభునికి క్రమేపి కష్టకాలం ఆసన్నమయింది. చుట్టాలంతా వచ్చి తన విశాలమైన క్రొత్త యింట్లో తిష్ఠవేశారు. చిన్న పెద్ద ప్రతి విషయానికి వారిలోవారు కలహించుకోవడం మొదలు పెట్టారు. ఆ బంగారపు నాణాల్ని ఇంటిలో ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు. వాటిని పొలంలో ఒకమూల దాచిపెట్టాడు. కాని దొంగలు దోచుకొంటారన్న భయం అనుక్షణం అతన్ని వెంటాడుతూంది. పంటలు సరిగా పండుతాయో లేదో అని అతనికి ఆందోశన, దానికితోడు చేనునుంచి చిట్టెడు గింజలు కూడా ఇంటికి చేరలేదు.
శంభుడికి శాంతిలేదు. ఆనందం అంతకన్నా లేదు. జీవితం దుర్భరమై, విచారగ్రస్థమై రోజురోజుకు చిక్కి శల్యమౌతున్నాడు శంభుడు. తాను చేసిన తప్పు తాను తెలుసుకున్నాడు. ఒకరోజు విఠోబా చిత్రంముందు కళ్ళనీళ్ళతో నిలబడి “హే భగవాన్! ఆ రోజున నేను భోగభాగ్యాల కోసం అర్థించినప్పుడు నీ వెందుకు నవ్వావో నాకిప్పటికి అర్థమయ్యింది. అవి నాకు సుఖసంతోషాల నందించలేదు. నిజానికి నాలోని శాంతి, సంతృప్తి, చక్కటి నిద్ర, మహదానందాన్ని మటుమాయం చేశాయి. నా అపారాధాన్ని మన్నించి, నా స్వార్థానికి, అత్యాశకు నన్ను క్షమించు. కాయకష్టంతో నీతిగా జీవించే నా పాతజీవితాన్ని నాకు ప్రసాదించు.
నాతోటి మానవులకు సేవ చేసుకుని వారి చెప్పులు కుట్టుకుని జీవించేటట్లు అనుగ్రహించు. మోడువారిన నా హృదయంలో పవిత్ర ప్రేమను, భక్తిని నింపు. నేటినుండి నా కర్తవ్యాన్ని నేను చేసి, మిగిలినవి నీ అనుగ్రహానికి వదిలేస్తున్నాను. మాకు కావలసినదేదో అక్కరలేనిది ఏదో నీకే తెలుసు. నీ పిల్లలమైన మాకు ఏది ఉచితమో దానినే అనుగ్రహించు” అని ప్రార్ధించాడు.
ప్రశ్నలు:
- మనం భగవంతుని ఎందుకు ప్రేమించాలి?
- భగవంతుడు, తాను కోరింది తనకి అనుగ్రహించినప్పటికీ శంభుడు సుఖంగా ఎందుకు జీవించలేక పోయాడు?
- భగవంతుడు నిన్ను అనుగ్రహించి నీకు ఏమి కావాలని అడిగితే నీవేమి కోరుతావు?