వివేకము లేకపోతే
వివేకము లేకపోతే
అయోధ్యా నగర రాజకుమారుడయిన దశరధుడు లోకప్రసిద్ధుడు. తాను ‘శబ్దభేది’ విద్యలో సమర్థుడనని గర్వపడుతూ వుండేవాడు. ‘శబ్దభేది’ అంటే, కేవలము శబ్దమును బట్టి బాణము గురిపెట్టి కొట్టడము. ఇది చూచి ప్రజలందరు తమను పొగడుతూ వుంటే, అతను చాలా ఆనందిస్తూ వుండేవాడు. ప్రతిరోజు సంధ్యవేళ అడవికి పోయి పొదల మాటున దాగివుండి, ఏవైనా జంతువుల అలికిడి వినవస్తుందేమోనని చూస్తూ వుండేవాడు.
ఒకనాడు దశరధుడు యధాప్రకారము పొదలమాటున పొంచి వుండగా, నది ఒడ్డున అలికిడి అయింది. చీకటిగా వుండటముచేత ఏమీ కనుపించలేదు. ఆ అలికిడి పెద్ద జంతువుది అయివుండవచ్చని నిశ్చయించు కొని సూటిగా దానివైపు బాణము వేసాడు. వెంటనే ఎవరిదో ఆర్తనాదం వినపడింది. “రక్షించండి! రక్షించండి! నన్ను ఎవరో బాణముతో కొట్టారు” అని.
ఒక్క ఉదుటున పొదల చాటునుండి బయటికి వచ్చాడు దశరధుడు. భయంతో వణికిపోయాడు. తల తిరుగుతున్నట్లనిపించింది. చేతి నుంచి ధనుస్సు క్రింద పడిపోయింది. అయ్యో! తను ఎంత పని చేశాను? జంతువుకు బదులు మనిషిని కొట్టానా? అనుకుంటూ అతను గబగబా చెరువు గట్టువైపుకు నడిచాడు. అక్కడ ఒక యువకుడు రక్తపు మడుగులో పడి వున్నాడు. అతని చేతిలో సగం నిండిన కుండ వుంది.
అతను భాధతో మూలుగుతూ దశరధుని చూచి “బాబూ మీకు నేను ఏమి అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టారు? నేను ఒక ముని కుమారుడను. నా తల్లిదండ్రులు ముసలివారు, ఆంధులు. ఇంక నేను ఏ విధంగానూ వారికి సేవ చేయలేనుకదా! మీరు ఈ దారిన వెడితే ఒక గుడిసెవద్ద నా తల్లి దండ్రులు కనుపిస్తారు. వారికి జరిగిన విషయం తెలియజేయండి. కాని ముందుగా ఈ బాణాన్ని తీయండి. అది నాకు చాలా బాధను కలిగిస్తోంది” అన్నాడు. దశరధుడు బాణాన్ని తీసివేయగానే, ముని కుమారుడు ఆఖరి శ్వాస తీసికొని, ప్రాణం వదిలాడు.
రాజకుమారుడు ఆ కుండ నిండుగా నీరు నింపుకుని, ముని దంపతులను సమీపించాడు. అలికిడి విని, ముని “నాయనా! ఇంత ఆలస్యం అయిందేం? నువ్వు చెరువును ఈదవలసి వచ్చిందా? నీకు ఏమైన ప్రమాదము సంభవించిందేమోనని మేము భయపడుతున్నాం. అదేమిటి? నువ్వు ఏమీ మాట్లాడటము లేదేమిటి?” అన్నాడు.
వణుకుతున్న స్వరంతో దశరధుడు ఇలా అన్నాడు. “స్వామీ! నేను మీ అబ్బాయిని కాను. నేను ఒక క్షత్రియుడను. ఇంతకాలము నా శబ్దభేది విద్యను చూచి గర్వపడుతూ వుండేవాడిని. ఈ రోజు నేను పొదల మాటున వుండగా చెరువు గట్టున అలికిడి అయింది. ఏనుగు అని భావించి బాణము వేసాను. కాని నేను కొట్టినది ఏనుగును కాదు, మీ అబ్బాయిని. ఈ పాపానికి నాకు పరిహారము చెప్పండి”.
ముని దంపతులు చాలా దుఃఖించారు. వారి పుత్రుడు పడివున్న ప్రదేశానికి వాళ్ళను తీసుకుని వెళ్ళమని దశరధుని కోరారు. అక్కడ ముని కుమారునికి అంత్యక్రియలు జరిపిన తర్వాత ముని దశరధునితో ఇలా అన్నాడు. “దశరథా | నీవు చేసిన తప్పువలన మాకు పుత్రశోకమ కలిగింది, ఒకనాడు నీవు కూడా ఇలాగే పుత్రశోకమును అనుభవిస్తావు”. తరువాత ముని దంపతులు కుమారునితోబాటు చితిలో పడి ప్రాణత్యాగం చేశారు. చాలాకాలం గడిచిపోయింది. దశరధుడు చక్రవర్తి అయ్యాడు. కౌసల్యను పెళ్ళాడాడు. వాళ్ళ కుమారుడే శ్రీరామచంద్రుడు. దశరధుని మూడవ భార్య అయిన కైకేయి, ఆమె చెలికత్తె మంధర, వీరిద్దరి కారణంగానే రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము చేయవలసి వచ్చింది.
ముని దంపతులు ఆనాడు దుఃఖించినట్లుగానే దశరధుడు కూడా తన కుమారుని కోసం దుఃఖించవలసి వచ్చింది. దశరధుడు ఆనాడు తన విద్యపట్ల వున్న గర్వంతో, తొందర పాటుతో చీకటిలో బాణము విడువకుండా, వెలుగు వున్నప్పుడు వేసివుంటే ఇంత అనర్ధం జరుగకపోయేది. అతనికి కీడు చేయాలన్న ఉద్దేశ్యము లేక పోయినప్పటికీ, ముందు చూపు, వివేకము లేకపోయాయి.
ప్రశ్నలు
- ‘శబ్దభేది’ అనగా నేమి?
- దశరధుడు ముని కుమారుని బాణముతో ఎందుకు కొట్టెను?
- అతడు ఈ పొరపాట్లు ఎందుకు చేశాడు?
- తన పొరపాటును ఏ విధముగా సవరించుకున్నాడు?
- దశరధుని ముని ఏమని శపించాడు?
- నీ అనుభవములో, అవివేకము వలన నీవు పొందిన అనుభవమును వ్రాయుము.