పనిలో ఎక్కువ తక్కువలు లేవు

Print Friendly, PDF & Email
పనిలో ఎక్కువ తక్కువలు లేవు

ప్రతి భారతీయుడు మహాత్మాగాంధీని జాతిపిత యని పూజిస్తారు. అటులనే అమెరికన్లు అందరు ‘జార్జి వాషింగ్టన్’ ను జాతిపితగా గౌరవిస్తారు. అతడు అతి ధైర్యసాహసములు గల యుద్ధ వీరుడు. సున్నితమైన బుద్ధి, గొప్ప ఉదార స్వభావము గలవాడు.

George helps soldiers to lift the beam

అమెరికా స్వాతంత్ర్య సమరంలో జార్జి అమెరికా సైన్యానికి సర్వాధికారిగా ఉండేవాడు. యుద్ధశిబిరంలో అన్నీ చక్కగా, సరిగా వున్నాయో లేదో చూసుకుంటూ, ఒక రోజున ఆయన గుఱ్ఱం మీద వెళుతున్నాడు. ఆ శిబిరంలో ఒక మూల ఒక కట్టడం నిర్మిస్తున్నారు. అక్కడ ఒక సైన్యాధికారి(కేప్టెన్) ఆరుగురు సైనికులు చేత ఇనుప దూలాన్ని పైకి ఎత్తిస్తున్నాడు. అది ఎక్కువ బరువుగా ఉండటం చేత ఆ ఆరుగురికి ఆ దూలాన్ని పైకి ఎత్తటం చేతకాకుండా వుంది. అయినప్పటికీ ఆ సైన్యాధికారి ఆజ్ఞలను పాటించడానికి ఎంతో శ్రమ పడుతున్నారు. వారు అంత శ్రమ పడుతున్నా ఆ అధికారి అలా చూస్తూ “ఆ!ఎత్తండి, ఎత్తండి” అంటూ ఆజ్ఞలు జారీ చేస్తున్నాడే కానీ, కనీసం కొంచెం కూడా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం లేదు.

George - head of the American army

జార్జికి ఆ దృశ్యం కంటబడింది. ఆయన హృదయం ద్రవించింది. సైనికుల శ్రమ చూసి సహించలేక పోయారు. గుఱ్ఱాన్ని ఆపి ఆ అధికారితో “ఆ దూలం చాలా బరువుగా ఉంది. నీవు చెయ్యి వెయ్యకూడదా” అని అన్నారు. అది విన్న సైన్యాధికారి వెనక్కి తిరక్కుండానే సమాధానం చెప్పాడు. “అది సైనికులు చేసేవని, నీకేం కనిపించడం లేదా! నేను సైన్యాధికారిని (కెప్టెన్)” అని అన్నాడు. జార్జి వెంటనే తన గుఱ్ఱం దిగుతూ “అవునా! నాకు తెలియదు. ఏమీ అనుకోకు” అంటూనే సైనికుల వద్దకు వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి, వారికి సహాయంచేసి దూలం పైకి ఎక్కించి వచ్చి ఆ సైన్యాధికారిని పిలిచి “ఇటువంటి పనిలో నీకు జనం చాలానప్పుడు నాకు కబురుపెట్టు. నేను సంతోషంగా వచ్చి పని చేస్తాను. నేను నీ సైన్యానికంతటికీ అధికారిని” అన్నాడు.

వెంటనే ఆ సైన్యాధికారి(కేప్టెన్) గుండె ఝల్లుమన్నది. ఆ సైన్యాధికారి నోరు విప్పి ఏదో చెప్పబోయే ముందే జార్జి చటుక్కున తన గుఱ్రాన్ని అధిరోహించి అతని శిబిరం చేరారు.
పదవితో మిడిసిపడే సైన్యాధికారికి జార్జి చక్కని గుణపాఠం చెప్పాడు.

ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మానవులంతా ఒక్కటే అని మరవకూడదు. అందుచేతనే ఒకరిని ఒకరు గౌరవించుకుని, పరస్పరం ఆదరించు కోవాలి. మానవుడు తాను ఆచరించే పనుల వల్లనే ఆనందాన్ని మరియు బాధను అనుభవిస్తాడు.

ప్రశ్నలు:
  1. సైన్యాధికారి చేసిన తప్పేమిటి?
  2. జార్జి వాషింగ్టన్ చెప్పిన మాటలు వినగానే సైన్యాధికారి ఎందుకు దిగ్భ్రాంతి చెందాడు?
  3. నీవే ఆ సైన్యాధికారి ఉన్న స్థితిలో ఉంటే ఏమి చేస్తావు?
  4. మానవుని ఉచ్ఛస్థితికి కొనిపోవు లక్షణములు, అధోగతికి చేర్చు లక్షణాలను వివరింపుము?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: