ఆడిన మాట తప్పకు
ఆడిన మాట తప్పకు
రామకృష్ణ పరమహంసకు తల్లి తండ్రులు పెట్టిన పేరు “గదాయ్”. ఇంట్లోని పెద్దవారు గదాయ్ కి ఉపనయనం చేయాలని తలపెట్టారు. అప్పుడు గదాయ్
“మొదటి భిక్ష ‘ధని’ కే చెందాలి” అన్నారు. “అలా వీల్లేదు” అన్నారు అందరు. కాని గదాయ్ పట్టిన పట్టు విడవలేదు. ఇచ్చిన మాట తప్పక పాటించాలి అన్నది అతని నియమం. అందరు అతను చెప్పిందానికి ‘సరే’ అన్నారు. విధిలేక, చివరకు అందరూ అంగీకరించాల్సి వచ్చింది.
ఆసలింతకు ‘ధని’ ఎవరు? గదాయ్ కి ఈ పట్టుదల ఏమిటి?
గదాయ్ కు తొమ్మిదవ యేట ఉపనయనం జరుపుతున్నారు అతని పెద్దన్నయ్య రామ్ కుమార్. ఉపనయన కార్యక్రమం అయిపో వచ్చింది. వారి వంశాచారం ప్రకారం మొదటి భిక్ష వటువు బ్రాహ్మణ స్త్రీ వద్ద తీసుకోవాలి. “నేను ‘ధని’ వద్దే తీసుకుంటాను” అన్నాడు గదాయ్. ‘ధని’ ఒక విశ్వ బ్రాహ్మణ స్త్రీ. గదాయ్ పుట్టినపుడు అతని తల్లికి ఎంతో సపర్య చేసింది ‘ధని’. ఆమెను గదాయ్ స్వంత తల్లిలాగే భావించి అమ్మా అని పిలుస్తున్నాడు. అతన్ని చిన్నప్పటినుంచి లాలించింది. మొదటి భిక్ష బ్రాహ్మణ స్త్రీ వద్దనే తీసుకోమని అన్న రామ్ కుమార్ ఆదేశించాడు.
కాని గదాయ్ అన్నాడు “చిన్నప్పటినుండి ‘ధని’ని నా తల్లిగా భావించాను. ‘ధని’ నా చిన్నప్పుడు ఒక కోరిక కోరింది. “నీ ఉపనయనం లో మాతృ భిక్ష ఇచ్చే అవకాశం నాకు ఇస్తావా?” అని అడిగింది. “సరే” అని అన్నాను. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాను. తప్పలేను.
అందరూ అన్నారు “ఏదో చిన్నప్పుడు తెలియని వయస్సులో అన్నావు. అదేం పట్టించుకోనవసరం లేదు”.
గదాయ్ “ఇచ్చిన మాట తప్పడం నాకు చేతకాదు. అసత్య మాడిన పాపానికి నేను ఒడిగట్టను” అని గంభీరంగా పలికాడు. ఎవరు నోరెత్తలేదు. ఎంతో ప్రేమతో, సంతోషంతో భిక్ష ఇచ్చింది ‘ధని’. గదాయ్ కి ఎంతో తృప్తి కలిగింది.
ఉపనయనం తో రఘువీర్ ను అర్చించే అర్హత వచ్చింది గదాయ్ కి. దీనికి అతను ఎంతో ఆనందించాడు. రఘువీర్ ను అర్చిస్తూ అతడు పారవశ్యంతో బాహ్య స్మృతిని కూడా కోల్పోయే వాడు. అతనికి సర్వము రఘువీరుడే.
ప్రశ్నలు:
- ‘ప్రధమ భిక్ష’ గురించి గదాయ్ ఇచ్చిన మాట ఏమిటి?
- రామ్ కుమార్ ఎందుకు అభ్యంతరం చెప్పాడు?
- గదాయ్ చెప్పిన సమాధాన మేమి?
- ఏదో చిన్నప్పుడు ఇచ్చిన మాటకదా అని గదాయ్ ఎందుకు త్రోసివేయ లేదు?
- గదాయ్ లో గల రెండు మంచి గుణాలేవి?