గురువాయూరు – దక్షిణద్వారక

Print Friendly, PDF & Email
గురువాయూరు-దక్షిణద్వారక

కృష్ణావతారంలో దేవకీవసుదేవులకు దర్శనం ఇచ్చిన విష్ణువు పూర్ణావతారమే “గురువాయురప్పన్”. గురువాయూరు క్షేత్రం మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఉంది. ఇది దక్షిణ దేశంలోని అతి పవిత్ర క్షేత్రాలలో ఒకటి.

ఈ గురువాయూరప్పన్ రూపాన్ని నారాయణుడే మొదట స్వయంగా అర్చించాడట. తర్వాత ఆయన బ్రహ్మకు ఇచ్చాడు. ఈ దేవత అనుగ్రహంవల్లనే బ్రహ్మ సృష్టి చేయగలిగాడు. ఇదే రూపాన్ని దేవకీ వసుదేవులు అర్చించారు. తర్వాత కృష్ణుడు ద్వారకకు పరిపాలకుడు అయినప్పుడు ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో ఈ రూపాన్ని ప్రతిష్టించాడు.

ద్వాపరయుగాంతంలో కృష్ణుడు ఉద్ధవునితో “నా అవతారము ఇంక సమాప్తమయింది. తిరిగి వైకుంఠం చేరుకుంటాను” అన్నాడు. ఉద్ధవునికి దుఃఖం ఆగలేదు. కలియుగంలో ఈ ప్రపంచానికి రాబోవు కష్టాలను గురించి అతను బాధపడ్డాడు. దానికి కృష్ణుడు తాను ఒక విగ్రహరూపంలో
అవతరిస్తాను. భక్తులకు ఆనందం ఇస్తాను అన్నాడు. ఆ విగ్రహాన్ని ప్రళయకాళంలో జాగ్రత్తపరచి, బృహస్పతిని సంప్రదించి ఒక పవిత్ర స్థలంలో ప్రతిష్ఠించమని చెప్పాడు.

బృహస్పతి వాయుదేవుని సహాయంతో తగిన స్థలం కోసం తిరుగుతున్నాడు. దారిలో వారికి పరుశురాముడు కనుపించి తానుగూడా నారదుని సలహా ప్రకారం అదేపని మీద తిరుగుతున్నట్లు చెప్పాడు. వారందరు కలిసి చివరికు ఒక అందమైన సరస్సుతీరం చేరుకున్నారు. ఆ సరస్సునిండా తామరపూలు ఉన్నాయి. సరస్సుకు ఒడ్డున ఉన్న శివపార్వతులు వీరికి స్వాగతం పలికారు. శివుడు “ఈ ప్రదేశం చాలా కాలం క్రిందటే ఈ పవిత్ర కార్యం కోసం నిర్దేశింపబడింది” అని చెప్పి పవిత్రజలాన్ని ఆ విగ్రహం మీద చల్లి గురు,వాయువులతో చెప్పాడు, “మీరే ఈ దేవాలయానికి ప్రతిష్ఠ చేయండి. మీరిద్దరు కలిసి ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రదేశానికి గురు- వాయూరు అని పేరు సార్థకమవుతుంది. ఈ విధంగా చెప్పి శివపార్వతులు అవతలి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఈ నాటికీ దేవాలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఈశ్వర దేవాలయం ఉంది. గురువాయూరప్పన్ విగ్రహం దివ్యత్వం మీదే ఆ క్షేత్ర మహాత్మ్యం అంతా ఆధారపడి ఉంది. కృష్ణుడు సర్వలోక మోహనాకారంతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర, గదా పద్మధారియై ఉన్నాడు. ఆయన మెడలో తులసి మాల ముత్యాల సరము అలంకారంగా ఉన్నాయి. భక్తులకోర్కెలు తీర్చు మూర్తుల గురించి ఆలోచించినపుడు వెంటనే గురు వాయూరప్పన్ మదిలోకి వస్తాడు.

కాపాడమని ప్రార్ధించిన భక్తులను ఆయన తప్పక రక్షిస్తాడని నిరూపించేందుకు ఒక సంఘటన ఉంది. పక్షవాతంతో బాధపడే రోగి ఒకడు ఎన్నో వైద్యాలు చేసి, ఫలితంలేక విరక్తి పుట్టి గురువాయూరు చేరుకున్నాడు. అదే సమయంలో కటిక దరిద్రుడొకడు ధనంకోసం ప్రార్థిస్తూ అక్కడికి వచ్చాడు. పక్షవాతరోగి నది ఒడ్డున డబ్బున్న తన సంచి ఉంచి స్నానానికి దిగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రెండవ వ్యక్తి ఆ సంచిని చూచి తీసుకొని పరుగెత్తి పోయాడు. అదిచూచి రోగి అతని వెంట పరుగెత్తాడు. తాను కదల లేని స్థితిలో ఉన్నా ఇప్పుడు పరుగెత్తే శక్తి తనకు వచ్చిందన్న విషయం కూడ అతడు కొంతవరకు గమనించ లేకపోయాడు. అప్పుడు అతనికి ఒక వాణి వినిపించింది “ఉన్న దానితో తృప్తి పడు. నీకు నీ బాధ తీరింది అతని కోరిక కూడా తీరింది” అని. ఈ విధంగా స్వార్థపరులు, దురాశాపరుల గూడా గురువాయూరప్పన్ అనుగ్రహానికి పాత్రులయ్యారు. దీనిలో ఉన్న తత్వము, లౌకిక వాంఛలకోసం ప్రార్ధించినా చివరకు వారు కోరేది భగవంతుని అనుగ్రహమేగదా!

గీతలో చెప్పినట్లు భక్తులు నాలుగు రకములు- ఆర్తుడు, అర్థార్ధి జిజ్జాసువు, జ్ఞాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: