ఏకలవ్యుడు
ఏకలవ్యుడు
ద్రోణాచార్యులవద్ద అనేక మంది రాజకుమారులు ధనుర్విద్యతోపాటు యుద్ధ విద్యలు నేర్చుకొనేవారు. వారిలో ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజ పుత్రులు పాండవులు కూడా ఉన్నారు. ద్రోణాచార్యుని ప్రతిభను గురించి వినిన ఇంకా ఎందరో ఆయనవద్ద యుద్ధ విద్య నేర్చుకోవాలని వచ్చేవారు. హిరణ్యధనుడు అనే బోయరాజు కుమారుడు ఏకలవ్యుడు. ఆచార్యుని వద్ద ఎలాగైనా విలువిద్య నేర్చుకోవాలని పట్టుబట్టి తనను శిష్యుడిగా స్వీకరించమని అర్ధించాడు.
కాని ద్రోణుడు అతనిని శిష్యునిగా అంగీకరించలేదు. “నాయనా! ఈ రాజకుమారులతో ఒక బోయవానిని చేర్చలేను” అని అన్నాడు.
ఏకలవ్యుడు భిన్నుడైనాడు. ద్రోణునివంటి ఆచార్యుని శిష్యరికము లభించలేదే అని విచారించాడు. కాని విలువిద్య నేర్చుకోవాలన్న ఆకాంక్ష అతనిలో చాలా బలంగా ఉంది. దానికి అతడు ఒక మార్గం ఎన్నుకున్నాడు. తన గూడేనికి పోయి అక్కడ ద్రోణాచార్యుని ప్రతిమ ఒకటి మట్టితో చేశాడు. ఆ ప్రతిమను ఎదురుగా ఉంచుకొని విలువిద్యలో సాధన ప్రారంభించాడు. అకుంఠిత దీక్షతో కొంతకాలానికి విలువిద్యలో ప్రవీణుడయినాడు.
ఒకనాడు ఆచార్యులవారి అనుమతితో కౌరవ పాండవులు వేటకు బయలుదేరారు. వేటాడుతూ వారు ఏకలవ్యుడు ఉండే అడవికి వచ్చారు. వారివద్ద ఉన్న వేట కుక్క ఒకటి అడవి మనిషిలా కనపడే ఏకలవ్యుని చూచి మొరగ సాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు ప్రయోగించి కుక్క నోరు కుట్టివేశాడు. అది పరుగెత్తి పాండవుల వద్దకు చేరింది.
పాండవులు కుక్క పరిస్థితి చూచి “ ఔరా ! ఈ పని చేసింది తప్పక అఖండుడైన విలు కాడై ఉండాలి” అనుకుంటూ ఆ విలుకాడికోసం వెతుకసాగారు. ఒక చోట ధనుర్విద్య సాధన చేస్తున్న ఏకలవ్యుడు కనుపించాడు. వారు అతనిని సమీపించి “నీ వెవరు ? ఈ కుక్కకు బాణాలు తగిలించింది నీవా ?” అని అడిగారు.
“అయ్యా మీరెవరో నాకు తెలియదు. నన్ను ఏకలవ్యుడంటారు. బోయరాజు హిరణ్యధన్యుడి పుత్రుణ్ణి. ఆచార్య ద్రోణుడు నా గురువుగారు” అని చెప్పాడు. ఇది విని వారు ఆశ్చర్యపోయారు. వెంటనే దగ్గరలో ఉన్న ద్రోణాచార్యుల వద్దకు పోయి ఏకలవ్యుని గూర్చి వివరించారు. ఆయన వెంటనే “ఈ ఏకలవ్యుడెవడో నాకు తెలియదు. నేను శిష్యుడిగా అతనిని ఎన్నడూ చేర్చుకోలేదు” అన్నాడు.
రాజపుత్రులందరిలో ధనుర్విద్యలో మిన్నఅయిన అర్జునుడు “స్వామి ! మీ శిష్యు లందరిలో నేనే ప్రధముణ్ణి అని ఎన్నోమార్లు అన్నారు. కాని ఈ ఏకలవ్యుడు విలు విద్యలో నన్ను మించిపోయినాడు. వచ్చి మీరే చూడండి” అని ఆచార్యుల వారిని ఏకలవ్యుని వద్దకు తీసుకొనిపోయారు.
గురువుగారిని చూచిన వెంటనే ఏకలవ్యుడు ప్రణామము చేసి, “స్వామీ! ప్రత్యక్షంగా అను గ్రహించక పోయినా, పరోక్షంగా మీ ప్రతిమ ఎదుట నేను సాధన చేశాను. అంతా తమ ఆశీర్వాదమే మీరు గురుదక్షిణ కోరి నన్ను అనుగ్రహించండి” అన్నాడు.
ద్రోణుడు ఒక్క క్షణము ఆలోచించి “అయితే నీ కుడి చేతి బొటన వ్రేలును గురుదక్షిణగా అడుగుతున్నాను” అన్నాడు. ఏకలవ్యుడు ఎట్టి సందేహము లేక తక్షణం తన కుడి చేతి బొటన వేలును కోసి ద్రోణుడి ముందు పెట్టి నమస్కచాడు.
ఇక ఏకలవ్యుడు ధనుస్సును ప్రయోగించలేదు. కాని అతని అకుంఠిత దీక్ష, గురుభక్తి ఆదర్శప్రాయాలుగా చరిత్రలో మిగిలిపోతాయి.
ప్రశ్నలు:
- ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు అంగీకరించకపోయినా అతని శిష్యుడెట్లయినాడు?
- అతడు తన గురుభక్తిని ఎట్లు నిరూపించుకొన్నాడు?