మెరిసేదంతా బంగారం కాదు
మెరిసేదంతా బంగారం కాదు
పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. వసంత కాలము ప్రవేశించింది. వృక్షాలు లేత చిగురులతో మెరిసిపోతున్నాయి. ప్రకృతి ఎంతో రమణీయంగా వుంది.
ఒకనాడు ఉదయము సీత పువ్వులు కోసుకుంటూ. వనంలో విహరిస్తుంది. హఠాత్తుగా వృక్షాలమధ్య ఏదో మెరుపు మెరిసినట్లయింది. అల్లంత దూరంలో మొక్కల మధ్య ఒక లేడి చెంగుచెంగున గంతులు వేస్తున్నది. దాని శరీరం బంగారు వర్ణంలో మెరిసిపోతున్నది. బంగారం రంగు శరీరం మీద వెండిచుక్కలు కల్గి ఉంది. కన్నులు మిరుమిట్లు గొల్పుతున్నాయి. అది కంటబడిన క్షణం నుంచి సీత హృదయం ఉప్పొంగి గంతులేస్తున్నది. ఉత్సాహంతో “ఆర్యపుత్రా! ఇటు రండి చూడండి,ఆ లేడి ఎంత అందంగా ఉందో! మనం అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు దీన్ని తప్పక తీసుకొని పోవాలి. దానిని నాకోసం పట్టుకొని రండి!’’ అని శ్రీరాముడిని ప్రాధేయపడింది. ఇదంతా వింటూ ప్రక్కనే విలబడియున్న లక్ష్మణుడు కొంతసేపు ఆలోచించి “అన్నా! ఇది నిజమైన లేడి కాదు, ఏదో ఇంద్రజాలం లాగా నాకు కనిపిస్తున్నది. మనము శూర్పణఖను అవమానించాము. దానికి కోపించి రాక్షసులు తప్పక ఏదో మాయ పన్నే వుంటారు. కాబట్టి మనం దాని జోలికి పోకుండా ఉండడం మంచిది అని నా అభి ప్రాయము” అన్నాడు. రాముడికి ఏమీ పాలు పోలేదు. ఒకవైపు సీత వేడుకోలు, మరొకవైపు లక్ష్మణుని హెచ్చరి., కొంత ఆలోచించి ఇలా అన్నాడు. “లక్ష్మణా! నీవు చెప్పింది నిజమే కావచ్చు. ఒక వేళ
రాక్షస మాయ అనుకుంటే ఈ లేడిని చంపి దాని సుందరమైన చర్మాన్ని మనం ఉంచుకోవచ్చు. మీ వదిన కోరిక కూడా నెర వేరుతుంది” అంటూ రాముడు విల్లంబులు ధరించి ఆ లేడి వెంట బడ్డాడు. వెళ్ళేముందు లక్ష్మణని పిలిచి “సోదరా! మీ వదినను జాగ్రత్తగా చూస్తూఉండు. ఎటువంటి పరిస్థితిలోనూ పర్ణశాలను వదిలి రావద్దు”అని హెచ్చరించాడు.
లక్ష్మణుడు ధనుర్బాణాలతో సీతకు కాపలాగా నిలబడ్డాడు. సీత రాముడు వెళ్ళిన దిక్కు వైపు ఎంతో ఆశతో చూస్తూంది. లేడి చాలా వేగంగా పరుగెత్తుతూ వుంది. రాముడు దాన్ని వెంబడిస్తున్నాడు. అది రామునికి దొరికినట్లే అనిపిస్తూనే దూరమవుతున్నది. ఈ విధంగా క్రమక్రమంగా రాముణ్ణి వనంలోనికి దూరదూరంగా తీసుకొని వెళ్ళింది. చాలా దూరం వెంబడించి విసిగిపోయిన శ్రీరాముడు బాణం సంధించి లేడి మీదికి వదిలాడు. బాణం దాని శరీరంలో ప్రవేశించగానే జంతు శరీరం అదృశ్యమైపోయి రాక్షస శరీరంతో మారీచుడు బయటపడ్డాడు.
శ్రీ రాముని బాణంతో కూలిపోయి మరణించే ముందు మారీచుడు హా!లక్ష్మణా! హా! సీతా! అని హృదయ విదారకంగా ఆర్తనాదం చేశాడు. ఆ ఆర్తనాదం దూరాన పర్ణశాలలో ఉన్న సీతకు వినిపించింది. భయంతో కంపిస్తూ “లక్ష్మణా! మీ అన్న ఆపదలో ఉన్నాడు. వెంటనే వెళ్ళు” అని లక్ష్మణుని తొందర పెట్టింది. కాని లక్ష్మణుడు చలించలేదు. “అమ్మా! మా అన్నకు ఎటువంటి ఆపద కలగదు. ఈ రాక్షసులు ఆయనను ఏమీ చేయలేరు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి నేను వెళ్ళలేను. అంతా రాక్షస మాయ” అన్నాడు.
కాని సీతకు సహనం నశించింది. వివేకం కోల్పోయింది.
“లక్ష్మణా! నీనైజం బయటపడింది. ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావుకదూ? నా భర్త దూరం కాగానే నాకోసం ఆశిస్తున్నావు. నీవు వెంటనే వెళ్ళకపోతే ఇక్కడే చితి ఆంటించుకొని ప్రాణ త్యాగం చేస్తాను” ఆన్నది. లక్ష్మణుడికి గత్యంతరం లేకపోయింది. సీత నిష్ఠూరపు మాటలు విని అతడు ఇంక నిలువ లేక పోయాడు. వెళ్ళేముందు ఆమెకు నమస్కరించి “తల్లీ, నేను నిన్ను వేడుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోను ఈ పర్ణశాలను విడిచిపెట్టి వెలుపలికి రావద్దు. చుట్టూ రాక్షసులు తిరుగు తున్నారు. ఆపదలో చిక్కుకుంటావు” అని వడివడిగా ఆర్త నాదం వచ్చినవైపు వెళ్ళాడు.
సీత ఒంటరి అయింది.అప్పుడు ఆమె ఆశ్రమ ద్వారంలో ఒక ఆకారాన్ని చూచింది. ఒక వ్యక్తి సాధువేషంలో అక్కడ నిలబడి ఉన్నాడు. అతడే రాక్షప చక్రవర్తి రావణుడు, ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను నిశ్చలంగా చూస్తున్నాడు. అతని చూపులకు తట్టుకోలేక ఆమె కుటీరం అంతర్భాగంలోకి వెళ్ళబోయింది. కాని అదే అదనుగా రావణుడు ఆమె చేయిపట్టి బయటికి లాగి, తన ఆకాశరధంలోకి ఎక్కించుకొని దక్షిణ దిశగా పయనం సాగించాడు.
సీత హృదయ విదారకంగా రోదించింది. ఆ రోదనకు వనాలన్ని ప్రతిధ్వనించాయి. ప్రకృతి అంతా ఏకంగా దుఃఖించిందా అన్నట్లు ఉంది.
సీత ఆర్తనాదాలు విని ఒక గృధ్రరాజు జటాయువు తటాలున పైకి ఎగిసి రావణుని ఎదుర్కొన్నాడు. “రావణా! ఇది నీకు మంచిదికాదు. మర్యాదగా ఈమెను వదిలి పెట్టు” అని హితవుచెప్పాడు. రావణుడు “ఓ ముసలి పక్షీ! నీ సలహా నాకు అవసరం లేదు” అని తిరస్కరించాడు. జటాయువు కోపించి ఒక్క దెబ్బతో రావణుని రధాన్ని ముక్కలు చేసి, శరీరంపై తీవ్రఘాతాలు కలిగించాడు. రావణుడు కోపంతో వృద్ధుడైన జటాయువు రెక్కలను ఒక్క కత్తి వేటుతో ఖండించాడు. జటాయువు అసహాయంగా నేలకూలాడు. రావణుడు సీతను అపహరించి ఆకాశమార్గంలో లంకవైపు వెళ్ళాడు.
ప్రశ్నలు:
- బంగారు లేడి సీతను ఎట్లు భ్రమింపజేసింది?
- బంగారు లేడి గురించి లక్ష్మణుడు వెలిబుచ్చిన అభిప్రాయం ఏమి?
- సీత ఏ విధంగా రాముని వియోగం అనుభవించింది?