స్నేహ బంధము
స్నేహ బంధము
పర్ణశాలకు తిరిగి వచ్చిన రామలక్ష్మణులకు సీత జాడ కానరాలేదు. ఆందోళన చెందిన మనస్సులతో చుట్టు పక్కల అంతా వెతికారు. రాముడు ‘సీతా ! సీతా!’ అని బిగ్గరగా పిలిచాడు. ఆ మాటలు అరణ్యంలో ప్రతిధ్వనించాయి. కాని ఆమె జాడ లేదు. ఇద్దరూ వెతుకుతూ బయలుదేరారు. ఒక చోట పక్షిరాజు జటాయువు రక్తసిక్తంతో పడిఉన్నాడు. రామలక్ష్మణులు జటాయువును సమీపించి గాయాలు తుడిచి, ఈ పరిస్థితికి కారణమేమని అడిగారు.
జటాయువు “ఒక అబలను ఒక రాక్షసరాజు బలవంతంగా ఆకాశమార్గంలో తీసుకొని పోతూఉంటే అడ్డగించాను. అతడు నా రెక్కలు ఖండించాడు అన్నాడు. అప్పుడు రాముడు తామెవ్వరో చెప్పి బహుశా ఆమె సీత అయి ఉండవచ్చునని భావించాడు. శ్రీరామునితో ఈ విషయం చెప్పి జటాయువు ప్రాణాలు వదిలాడు. రామ లక్ష్మణులు కృతజ్ఞతగా అతని శరీరానికి అంత్యక్రియలు జరిపి
దక్షిణ దిశగా బయలుదేరి తమ అన్వేషణ తిరిగి ప్రారంభించారు.
సీతకోసం దిగులుతో తిరుగుతూ క్రమంగా వారు పంపానదీతీరం చేరుకున్నారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఋశ్యమూక పర్వతం మీద వానరరాజు సుగ్రీవుడు తన పరివారంతో నివస్తున్నాడు.
తన అన్న వాలితో తగువు పెట్టుకొని అతని చేత చావుదెబ్బలు తిని ఈ పర్వతం మీద తలదాచుకొన్నాడు. మునిశాపంవల్ల వాలి ఈ పర్వతం మీదికి రాడు అని.
ఒకనాడు సుగ్రీవుడు, అతని అనుచరులు సంభాషించుకుంటూ ఉండగా వారు దూరంగా అడవిలో తిరుగుతున్న రామలక్ష్మణులను చూచారు. సుగ్రీవుడు తన పరి వారంలో ముఖ్యుడయిన హనుమంతునితో “ హనుమా! వెళ్ళి వారెవరో తెలుసుకొని రా’’ అని పంపాడు.
హనుమంతుడు కొండ దిగి వెళ్ళి వారిని కలుసుకొని తనను పరిచయం చేసుకొని “అయ్యా! మీరెవరు? ఎందుకు? ఒంటరిగా ఈ అడవిలో తిరుగుతున్నారు ?” అని ప్రశ్నించారు. అతని వినయ ప్రవర్తనకు, మాట తీరుకు రాముడు ముగ్ధుడయినాడు. హనుమంతునియందు ఏదో తెలియని ఆత్మీయత కలిగింది. తామెవ్వరో, ఎందుకు వచ్చామో చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వారిని ఆహ్వానించాడు.
తనను సమీపించిన రామలక్ష్మణులను సుగ్రీవుడు సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చాడు. ఒకరి విషయం
మరొకరు చెప్పుకొని కొంతవరకు ఉపశమనం పొందారు. సుగ్రీవుడు “రామచంద్రా! మన మైత్రి ఏనాటికి ఇలాగే వుండాలని నా కోరిక. నా శత్రువు అయిన నాఅన్న వాలిని వధించడంలో నాకు సహాయం చేయమని అర్ధిస్తున్నాను. దీనికి ప్రతిఫలంగా సీతాదేవిని వెదికించి తెచ్చే బాధ్యత నాది” అన్నాడు. ఇద్దరు ఒకరికొకరు సహాయపడతామని ప్రమాణం చేశారు.
అప్పుడు సుగ్రీవుడు ఒక నగల మూటను చూపించాడు. అది ఒకనాడు హఠాత్తుగా ఆకాశం మీదినుంచి పడిందని, పైకి చూస్తే ఒక స్త్రీని బలవంతంగా ఎత్తుకొని పోతున్న బలవంతుడైన వ్యక్తిని చూచామని చెప్పాడు. మూటవిప్పి నగలను చూడగానే రాముడు మూర్ఛపోయాడు. నగలను చూచి గుర్తించమని లక్ష్మణుణ్ణి అడిగినప్పుడు లక్ష్మణుడు కాలి అందెలను మాత్రం గుర్తించి, అవి సీతాదేవివే అని, మిగిలిన నగల విషయ తనకు తెలియదని చెప్పాడు. తానెప్పుడు ఆమె పాదాలు మాత్రం దర్శించే వాడిని అని అన్నాడు. అతని భక్తిశ్రద్ధలకు వానరులు ఆశ్చర్యపోయారు. కొంత సేపటికి రాముడు తేరుకొని ఆ నగలు సీతవని గుర్తించాడు.
సుగ్రీవుడు వాలి పరాక్రమాన్ని వర్ణించి రాముని బలం చూస్తానన్నాడు. రాముడు ఒక అస్త్రం విడిచాడు. అది వరుసగా సప్తతాళ వృక్షాలను ఛేదించి తిరిగివచ్చి రాముని అంబులపొదిని చేరింది. అది చూచి సుగ్రీవుడు నిర్ఘాంతపోయి రాముని అభినందించాడు.
వారు అనుకున్న పథకం ప్రకారం సుగ్రీవుడు కిష్కింధకు సమీపించి వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు.వాలి ఆగ్రహించి సుగ్రీవుని ఎదుర్కొన్నాడు. ఒక చెట్టుచాటు నుంచి గమనిస్తున్న రామునికి తీవ్రంగా పోరాడుతున్న అన్నదమ్ములు ఇద్దరు ఒకేవిధంగా కనిపించడంతో. ఏమీ చేయలేక వూరుకున్నాడు. వాలి చేతిలో చావు దెబ్బలు తిని ఇక పోరాడలేక సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదికి పారిపోయి వచ్చాడు. జేవురించిన ముఖంతో నిష్టూరంగా “రామా! ఈ విధంగా మోసం చేస్తావనుకోలేదు. చేతగాకపోతే చేతగాదని చెప్పవచ్చు కదా”? అన్నాడు.
రాముడు నొచ్చుకొని “మిత్రమా ! మీ ఇద్దరూ ఒకే విధంగా ఉండటం వలన మీ ఇద్దరి మధ్య భేదం నాకు తెలియలేదు. ఈసారి నీవు మెడలో మాల వేసుకో. నిన్ను గుర్తిస్తాను. జరిగిన దానికి బాధపడవద్దు” అని ఊరడించాడు. సుగ్రీవుడు మరుసటిరోజు తిరిగి కిష్కింధకు పోయి రాజద్వారం వద్ద హుంకారము చేసి వాలిని పోరాటానికి ఆహ్వానించాడు. సుగ్రీవుని కంఠం విని వాలి భార్య తన భర్తతో “స్వామీ ! నాకేదో కీడు తోస్తున్నది. నిన్ననే చావుదెబ్బలు తిన్నవాడు మళ్ళీ ఈ రోజు వచ్చాడంటే వెనక బలమైన శక్తి ఏదో ఉండి ఉంటుంది. పైగా ఎవరో రాముడట, ధనుర్విద్యలో అసమానుడట. సుగ్రీవునితో స్నేహం కట్టాడని విన్నాను. మీరు
యుధ్ధానికి వెళ్ళవద్దు”అని ప్రార్థించింది. కాని వాలి సగర్వంగా “రాణీ! శతృవు యుద్ధానికి పిలిచినప్పుడు వెనుదీయడానికి నేను మేకపిల్ల అనుకున్నావా? వానర చక్రవర్తి వాలికి మరణభయం ఎన్నడూ లేదు” అని తారను తోసి వేసి యుద్ధానికి వచ్చాడు.
Picture
వాలి సుగ్రీవులు మహా భయంకరంగా పోరాడారు. రాముడు చెట్టు చాటు నుండి అంతా గమనిస్తున్నాడు. సుగ్రీవుడు ఇక నిలవలేడు అన్న సమయంలో గురి చూచి వాలిపై అస్త్రం వదిలాడు. ఆ అస్త్రంతో వాలి నేలగూలాడు. రాముడు వాలిని సమీపించగానే చాటునుండి చంపినందుకుఅతను రాముని నిందించాడు. కాని రాముడు తగిన వచనాలతో అతనిని శాంతపరిచాడు. శోకిస్తున్న తారను ఊరడించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజు అయినాడు. రామలక్ష్మణులు మాత్రం ఋష్యమూకం మీదనే ఉంటున్నారు.
వానర సోదరులు వాలి సుగ్రీవులు, మానవ సోదరులు రామ లక్ష్మణ భరతులను పరిశీలించినప్పుడు సోదరుల ప్రేమ విషయంలో కొన్ని పోలికలు తేడాలు అర్థం అవుతాయి. సమస్యలు,బాధలు చుట్టు ముట్టినప్పుడు రాముడు, సోదరులు విలువలతో ప్రేమతో వర్తించారు. రాజ్యాధికారం వదులుకోవాలనిరాముడు, భరతుడు పోటీ పడ్డారు. లక్ష్మణుడు రాజభోగాలు వదిలి అన్నతో అరణ్యవాసం కోరుకున్నాడు. కాని రాజ్యాధికారం కోసం వాలి సుగ్రీవులు ద్వేషించుకున్నారు. అన్న తమ్ముని శిక్షించాడు.
ప్రశ్నలు:
- వానర సుగ్రీవుల మైత్రి కి దోహదమయిన పరిస్థితులు ఏవి?
- వానర సోదరులకు, రామ సోదరులకు మధ్య నీవు గమనించిన వ్యత్యాసం ఏమి?