సీతాన్వేషణ

Print Friendly, PDF & Email
సీతాన్వేషణ

Search for Sita

వాలి వధానంతరం సుగ్రీవుడు కిష్కింధకు రాజుగా అభిషేకించబడ్డాడు. రాముడు, లక్ష్మణుడు మాత్రం ఋష్యమూకం మీదే రోజులు గడుపుతున్నారు. సుగ్రీవుడు రాజభోగాలలో మునిగిపోయాడు. తను చేసిన వాగ్దానం ప్రకారం సీతను వెదికేందుకు ఏర్పాట్లు చేస్తున్న సూచన లేవీ కనిపించడం లేదు.

హనుమంతుడు ఒకటి రెండుసార్లు సుగ్రీవుడికి వాగ్దానం గుర్తుచేశాడు. కాని సుగ్రీవుడు తాత్సారం చేశాడు.

ఒకనాడు రాముని అదేశం ప్రకారం లక్ష్మణుడు రాజమందిరం ప్రవేశించి సుగ్రీవునితో నిష్ఠూరంగా మాట్లాడాడు. సుగ్రీవుడికి మత్తు దిగివచ్చింది. రామునికి కోపం వచ్చిందని తెలియగానే భయపడ్డాడు. వెంటనే వానర సైన్యాధిపతు లందరిని సమావేశ పరచాడు.

నాలుగు దిక్కులకు వెళ్ళడానికి ప్రధాన సైన్య ప్రముఖులను ఆదేశించాడు. దక్షిణ దిశకు వెళ్ళే సైన్యానికి యువరాజు అంగదుడు అధిపతి. అతనికి సహాయం హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు మొదలైనవారు ఉన్నారు.

కొండలు, గట్టులు, గుట్టలు, అడవులు పట్టణాలు అన్ని వెతికి సీతాదేవి జాడ కనుక్కుని రావాలని సుగ్రీవుని కఠిన శాసనం అయ్యింది. నలుదిక్కులా సైన్యాలు బయలు దేరాయి.

బయలుదేరే ముందు రాముడు హనుమంతుని చేర పిలిచాడు . “హనుమా! మీరు సీత జాడ కనుక్కొనగలరని నాకు నమ్మకంగా ఉంది. ముఖ్యంగా నీ మీదే నేను ఆశలు పెట్టుకున్నాను. సీతను చూడగానే నా గుర్తుగా ఈ ఉంగరాన్ని చూపించు” అని తన అంగుళీయకాన్ని హనుమకు ఇచ్చాడు.

నెల రోజులకల్లా తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళిన సైన్యాలు తిరిగి వచ్చేశాయి. సీత జాడ ఏమీ తెలియ లేదని వారు అన్నారు. కాని దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు తిరిగి రాలేదు.

పర్వతాలు, వనాలు, ఒక్క అంగుళం నేలకూడ విడవక వెతుకుతూ వారు సముద్రతీరం చేరారు. అందరిలో నిరాశ, నిస్పృహలు చోటుచేసుకున్నాయి. అందరూ సముద్రం ఒడ్డున చతికిలబడ్డారు. అంగదుడు అందరినీ ఉద్దేశించి “సోదరులారా ఇంతవరకు ఎంతో శ్రమించి అన్వేషించాము. భూమి చివరకు వచ్చాము. మనము ఉత్తచేతులతో తిరిగి వెళ్ళేదానికన్నా అందరము కలిసి సముద్రంలో దూకి ప్రాణత్యాగం చేసుకోవటం మేలనిపిస్తుంది”అన్నాడు.

వానరులలో ఎవ్వరికీ ఏమీ మాట్లాడడానికి తోచటం లేదు. అందరు తలలు వంచి దిగులుగా కూర్చున్నారు.

పక్కనే ఉన్న ఒక కొండమీది నుండి సంపాతి అను గృధ్రరాజు ఈ వానరులను ఒక కంట కనిపెడ్తూ వాళ్ళని తన ఆహారంగా చేసుకోవటానికి తగిన అవకాశం కోసం చూస్తున్నాడు. అందుకై వాళ్ళ చేష్టలు గమనిస్తూ వాళ్ళ మాటలు వినసాగాడు. వాళ్ళ మాటల సందర్భంలో ‘జటాయువు’. అన్న మాట వినపడగానే ఆపక్షిరాజుకు ఉత్సాహం కలిగి ఆవానరులను తనవద్దకు పిలిచాడు. వానరులు “సంపాతి”తో తమకు తెలిసిన రామ కథ అంతావివరించారు. సీతను రావణుడు ఎత్తు కొనిరావడం, రావణుని జటాయువు ఎదిరించి మరణించడం, రాముని చేతిలో ఆ పక్షి రాజు అంత్యక్రియలు జరగటం వివరించారు. ఇవన్నీ విని సంపాతి కంటనీరు పెట్టాడు.

“వానరులారా! నా శక్తి మీకు తెలియదు. కానీ సూర్యుని తాపం వలన నా రెక్కలు పడిపోయాయి. రామునికి సేవ చేస్తే నా రెక్కలు వస్తాయని నాకొక వరము ఉంది. నా దృష్టి చాలా తీక్షణమైనది. సముద్రానికి ఆవల ఉన్న లంకను నేను బాగా చూడగలుగుతున్నాను.సీతామాత లంకలో కలదని తెల్పి, సీతాన్వేషణలో మీ ప్రయత్నానికి జయము కలుగుతుంది.” అని అంటుండగానే సంపాతికి రెక్కలు వచ్చాయి.వెంటనే సంపాతి ఎగిరిపోయింది.

సంపాతి వలన సీత లంకలో ఉందని ధృవపడింది. ఇంక సముద్రం దాటి లంకను చేరడం ఎలా? ఇది వానరుల సమస్య.

అంగదుడు ఒక్కొక్క వానరుణ్ణి తమ శక్తిని వివరించమన్నాడు. ఎవరి శక్తి కూడా సముద్రాన్ని లంఘించి లంక చేరడానికి చాలడం లేదు. ఇదంతా జరుగుతుంటే హనుమ మౌనంగా కూర్చున్నాడు. వృద్ధుడైన జాంబవంతుడు హనుమంతుని దగ్గర చేరి అనునయంగా “హనుమా ! ఎందుకు మౌనంగా ఉన్నావు ? నీ శక్తి నీవు చెప్పకపోయినా నాకు తెలుసు. ఈ సముద్రాన్ని దాటి లంకను చేరి సీత జాడ తెలుసుకోగల సమర్థుడివి.రామకార్య సాధకుడివి నీవే! లే! ఎందుకు ఆలసిస్తావు?” అంటూ ప్రోత్సహించాడు.

హనుమకు ఉత్సాహం వచ్చింది. లేచాడు తన శరీరం క్రమంగా పెంచాడు. అది ఆ పర్వతాన్నంతా కప్పివేసింది. “జయ జయ శ్రీ రామ” అంటూ సింహనాదం చేసి సముద్రం మీదికి ఎగిరాడు. ఆ వూపుకు పర్వతం ఒక్కసారి కంపించింది. మిగిలిన వానరు లందరు “జయ జయ రామచంద్ర ప్రభువుకు…జై, జయ హనుమాన్ కు జై” అంటూ ఆనందంతో గంతులు వేశారు.

ప్రశ్నలు:
  1. సుగ్రీవుడు సీతాన్వేషణ ఎందుకు ఆలస్యం చేశాడు?
  2. సీత లంకలో ఉన్నట్లుగా వాళ్లకు ఎలా తెలిసింది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: