విభీషణ శరణాగతి

Print Friendly, PDF & Email
విభీషణ శరణాగతి

Vibhishna Surrenders Rama

రావణుడి మనస్సు మార్చడానికి విభీషణుడు మరొక ప్రయత్నం చేశాడు. సభా మందిరంలో రావణుని పాదాలపై బడి ప్రార్ధించాడు. “అన్నా! గాలి ఎటు వీస్తున్నదో గమనించండి ! దాన వంశ నాశనానికి మీరు కారకులు కావద్దు! నా మనవి ఆలకించండి.” అన్నాడు.

రావణుని కోపం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనకు నమస్కరించిన విభీషణుని హృదయంపై పాదము మోపి ఒక్క తోపు తోశాడు. సభలోని మంత్రులు, సేనానులు రావణుని ఈ చర్యకు అభినందన సూచకంగా జయజయ ధ్వానాలు చేశారు.

విభీషణుడు ఈ అవమానం భరించలేక పోయాడు. మారు మాట్లాడక తన సన్నిహిత మిత్రులు నలుగురితో కలిసి సభను విడిచి వెళ్ళిపోయాడు. తనకు లంకలో స్థానం లేదని, తనకు సరియైన స్థానం రాముని పాదాల వద్దనే అని నిశ్చయించు కున్నాడు. తన మిత్రులతో ఆకసంలోకి ఎగిసి వానర సైన్యం ఉన్న చోటికి చేరుకున్నాడు.

ఆకాశంలో ఎగిరి వస్తున్న రాక్షసా కారులను చూచి శత్రువులుగా భావించి కొందరు చంప బోయారు. విభీషణుడు బిగ్గరగా “అయ్యా! మేము రాముణ్ణి శరణాగతి కోరుటకు వచ్చాము. మేము శతృవులము కాము” అన్నాడు. ఈ విధంగా చెబుతూ వారు వానర సేన మధ్యలో దిగారు. వానరులు వారిని రాముని వద్దకు చేర్చారు. విభీషణుడు రాముని పాదాలపై వ్రాలి “రామచంద్రా! నీ శరణుగోరి వచ్చాము. రక్షించు ప్రభూ!” అని వినమ్రంగా నిలబడ్డాడు. రాముడు అతనిని లేవదీసి తన పక్కన కూర్చోవడానికి ఆసనం ఇచ్చాడు.

అప్పుడు రాముడు సుగ్రీవుని చూచి “మిత్రమా! విభీషణుడు మన శత్రువు, రావణుని సోదరుడు.నా శరణు గోరి వచ్చాడు. ఇతనిని మన పక్షంలో చేర్చుకోవడం నీకు అభ్యంతరమా!’’ అన్నాడు.

సుగ్రీవుడు “రామచంద్రా ! ఇవన్నీ రాక్షస మాయలు. ఇతనిని నమ్మరాదు‌. మన గుట్టు తెలుసుకోడానికి రావణుడే పంపాడని నా అభిప్రాయము. పైగా ఈనాడు అన్నను వదిలి వచ్చాడు. రేవు మనల్ని వదిలి వెళ్తాడు అనుటలో సందేహం లేదు అన్నాడు.

రాముడు లక్ష్మణుని చూచి “తమ్ముడా! నీ అభిప్రాయం చెప్పు” అన్నాడు.

లక్ష్మణుడు “అన్నా! సుగ్రీవుని అభిప్రాయం సరియేనని నాకు తోస్తున్నది” అన్నాడు. రాముడు చివరకు హనుమంతుని అభిప్రాయం అడిగగా‌, హనుమంతుడు “ప్రభూ! నేను ఎక్కువ తెలిసినవాడను కాను. కానీ లంకలో విభీషణుని ఇంటి నుండి వేదమంత్రాలు వినిపించేవి. అనేకసార్లు రావణునికి హితబోధ చేసేవాడు. ఈతడు సజ్జనుడని తోస్తున్నది. ప్రభువులు ఈతనిని చేరదీయ వచ్చు” అన్నాడు.

రాముడు మందహాసంతో సుగ్రీవుని చూచి “సుగ్రీవా! నీవు నీ అన్నను వదలి నన్ను చేరినప్పుడు నీకు వచ్చిన అనుమానమే నాకు వచ్చియంటే ఈనాడు మనిద్దరము ఈవిధంగా ఉంటామా? విభీషణుడు రావణుని వదలడానికి తగినట్టి కారణాలు ఉన్నాయి. కానీ మనల్ని వదలడానికి కారణాలు ఉండవు, ఏది ఏమయినా ఇతడు నన్ను శరణుజొచ్చాడ” అన్నాడు. శరణు జొచ్చినవానిని చేరదీయడం ఇక్ష్వాకు వంశ ధర్మం. విభీషణుడు ఇక మనకు మిత్రుడు. ఇతనిని ఇక్కడే లంకా రాజ్యానికి రాజుగా అభిషేకిస్తాను. సుగ్రీవుడికి ఇంకా అనుమానం తీరలేదు.“రామ చంద్రా ! మరొక్క సందేహము. ఒకవేళ రావణుడు వచ్చి నిన్ను శరణు జొచ్చితే అతనికి ఏ రాజ్యం ఇస్తావు ” అని అడిగాడు.

రాముడు గంభీర స్వరంతో “ఇదిగో శపథం చేస్తున్నాను వినండి! ఒకవేళ రావణుడే వచ్చి శరణుజొచ్చితే నాదైనకోసల రాజ్యాన్ని అతనికి ధారపోస్తాను” అన్నాడు.

రాముని ధర్మదీక్షకు, సత్యవ్రతానికి అందరు ఆశ్చర పడ్డారు. వానరులందరు ‘జయ! రామచంద్ర ప్రభువుకు! జయ జయ! అంటూ జయ ద్వనులు పలికారు.

ప్రశ్నలు
  1. విభీషణుడు రావణుడి రాజ్యము వదలి ఎందుకు వచ్చాడు?
  2. సుగ్రీవుని సందెహాలేవి? రాముడు ఎలా సమాధాన పరిచాడు ?
  3. విభీషణుని అంగీకరించడంలో రాముడు చూపిన విశిస్ట గుణాలేవి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: