జీవితయాత్రలో చివరి ఘట్టము
జీవితయాత్రలో చివరి ఘట్టము
స్వామి బేలూరు మఠములో ఉన్నప్పుడు కెప్టెన్ సేవియర్ అక్టోబరు 28వ తేదీన మరణించినట్లు వార్త తెలిసెను. వెంటనే శ్రీమతి సీనియర్ను ఓదార్చుటకై స్వామి మాయావతికేగెను. అక్కడ ఒక పక్షము రోజులుండెను. అద్వేతాశ్రమ పరిసరములందున్న హిమాలయ సౌందర్యము స్వామికి ఆహ్లాదము కలిగించెను.
ఆ తరువాత బేలూరుకు తిరిగివచ్చి, మూడువారములపాటక్కడ ఉండి, తూర్పు బెంగాలు, అస్సాము ప్రాంతములకు పర్యటనకెగెను. అచ్చటి పుణ్యక్షేత్రములను దర్శింపవలెనని వివేకానందుని తల్లి అతని వెంట వెళ్ళెను. స్వామి ఈ విషయమును గూర్చి శ్రీమతి బలక్క వ్రాసిన రేఖలో ఇట్లు పేర్కొనెను. “హిందూ వితంతువునకు సామాన్యముగా తీర్థయాత్రలు చేయవలెనని బలమైన కొరిక యుండును. అట్లే ఆమెయు (నా తల్లి యు) కోరినది. నేను పుట్టి మా వారికి దుఃఖమునే ఎక్కువ కలిగించినాను; అందువలన నా తల్లి కోరిక ఒకదానిని తీర్చి తృప్తిని కలిగింప యత్నించుచున్నాను.”
అచ్చటినుండి తిరిగివచ్చిన తరువాత స్వామి మఠము నందే కొంత విశ్రాంతిగా జీవితము గడిపినారు. ఒక్కొక్కసారి మఠపు మైదాన ప్రాంతములందు తిరుగుచుండెడివాడు; ఒక్కొక్కసారి తెల్లని వస్త్రమును ధరించుచుండేడివారు; మరొక్కసారి వంటకాలలో వంటలను పర్యవేక్షించు చుండెడివాడు; మరొకసారి యతులలో కలిసి కూర్చుండి భక్తిగీతము ఆలపించుచుండెడివాడు. అతనివద్దకు వచ్చిన ప్రతివారికి ఆధ్యాత్మికమైన సలహాలు నిచ్చుచుండెడివాడు. అంతవరకు తన పేరుమీద నున్న బేలూరు మఠముతో సహా యావదాస్తుల హక్కులను తనతోటి సోదర శిష్యులకు తన తరువాత లభించునట్లు వీలునామాను వ్రాసి తన లౌకిక కర్తవ్యములనుండి విముక్తుడైనాడు. ఒకరోజు మఠమునందు పనిచేయు పనివాండ్ర కందరికి అన్నదానము చేయించినాడు వారటువంటి రుచికరమైన, తృప్తికరమైన మృష్టాన్న భోజన మెన్నడును చేయలేదు. వారు మిక్కిలి సంతోషించిరి. స్వామి వారితో ఇట్లనినాడు. “మీరు మానవాకారము లందున్న నారాయణులు. నేను నేడు నారాయణునికే అన్ననైవేద్యమును సమర్పించినాను, ” ఆ తరువాత తన శిష్యులతో నిట్లనెను- “భగవంతుడే వివిధరూపములలో నా యెదుట నిలచినట్లు వీరిని చూచినప్పుడు కనపడుచున్నారు. వారి నిరాడంబరత, స్వచ్ఛమైన అనురాగము నేనెక్కడ చూడలేదు. ఒక్కొక్క సారి ఈ మఠమును అమ్మి వేసి, వచ్చిన ధనమును ఇట్టి పేదసాదలకు పంచివేయవలెనని నేను తలంచుచుందును.”
స్వామి వివేకానందుని జీవితభానుడు ఆస్తాచలముపై ఒరిగినాడు, 1902 జులై 4వ తేదీన, ప్రతిరోజువలె కాక స్వామి ఉదయమే 8 గం॥ల నుండి 11 గం॥ల వరకు ధ్యానమునందు కూర్చుండెను. మధ్యాహ్నమున వాహ్యాళికి వెళ్ళివచ్చెను. సాయంకాలము తన గదిలో విక్రాంతి తీసుకొనుచు, ఒకగంట సేపు ధ్యానమునందుండెను. ఆ తరువాత ప్రశాంతముగా పండుకొనెను. కొంత సమయము గడచిన తరువాత రెండుసార్లు గాఢముగా శ్వాసను తీసికొనెను. అంతే. స్వామి దివ్యధామ మును చేరుకున్నారు. స్వామి చేయవలసిన పని పూర్తిఅయినట్లున్నది. గురుదేవులు -స్వామికి వాగ్దానము చేసినట్లు మోక్షధామమునకు ‘తాళపుచెవి’ని అందించినట్లున్నది.
ఒకసారి లండనులో ఆయన ఇట్లు చెప్పెను “ఒక్కొక్కసారి ఈ శరీరమును జీర్ణవస్త్రముగా పరిత్యజించి, ఈ ఆవరణమునుండి ఆవలకు – పోయినచో మేలని పించును. కాని, నేను నా విధిని నిర్వర్తించక తప్పదు. భగవత్తత్త్వముతో తాను భిన్నముకా దని ఈలోకము గ్రహించునంతవరకు నే నీమానవాళిని ఎల్లెడల ఉత్తేజపరచుచు ఉండవలెను.” నిజమునకు స్వామి తన భౌతికకాయమును మాత్రమే పరిత్యజించెను; అక్షయమైన ఆయన ఆత్మ ప్రపంచమును దివ్యకాంతులతో ప్రకాశింప చేయుచునే యుండును.
“అద్వైతతత్వము జీవితములో అనుభవముగా మారవలెను. ప్రతివారి జీవితములో అది కవిత్వాభివ్యక్తిగా కళకళలాడవలెను. మినుకు మిణుకు మనుచున్న యోగతత్త్వమునుండి శాస్త్రీయము, సాధనాత్మకము అయిన మానసికశాస్త్రము వెలుగొందవలయును. ఇది అంతయు బాలుడు కూడా సులభముగా గ్రహించునంతటి సులభపద్ధతిలో ప్రకటింపబడవలెను. ఇదియే నా జీవితకృషి. నే నీయత్నములో ఎంతవరకు కృతకృత్యుడనైతినో ఆభగవంతునికే తెలియును”- అని స్వామి వివేకానంద ఎల్లప్పుడు చెప్పుచుండెడివాడు.
వివేకానందుడు తన ప్రయత్నములో చాలవరకు కృతకృత్యు డైనాడు. రవీంద్రనాధటాగూరు మాటలలో- “మీరు భారత దేశమును గురించి తెలియదలచినచో వివేకానంద ప్రబోధములను అధ్యనము చేయుడు. అతనిలో సమన్వయమే కనపడునుగాని సంఘర్షణ మచ్చుకైనను కానరాదు.” మహాత్మగాంధీ మాటలు గమనింపుడు- “నే నాతని గ్రంధములను కూలంకషముగా చదివితిని. ఆ గ్రంధములను చదివిన తరువాత నాలోని దేశభక్తి వేయిరెట్లు విస్తరిల్లినది.