గురుబ్రహ్మ శ్లోకము – చేయవలసినవి
ఉద్దేశము:- బ్రహ్మ, విష్ణు పరమేశ్వరులు ఆచరించే సృష్టి, స్థితి, లయలను మొదటి వర్గానికి చెందిన బాలవికాస్ విద్యార్థులు అర్థం చేసుకునేటట్లు ప్రయత్నించుట.
అవసరమైన సామాగ్రి:- మట్టి లేదా తగరపు పాత్ర, ఎరువు, రాగి, ఆవాలు మొదలైన గింజలు
పద్ధతి:-
- తరగతిలోని విద్యార్థులను ముగ్గురు లేక నలుగురు గల వర్గాలుగా విభజించండి.
- ప్రతి వర్గానికి ఒక మట్టి పాత్రను ఇచ్చి ఆ పాత్రపై వారికిచ్చిన గింజల పేరు వ్రాయమనండి.
- వారిని వారి పాత్రల ను ఎరువుతో నింపమనండి. ఆ ఎరువు పై నీళ్లు చల్లించండి.
- వారికిచ్చిన గింజల రంగు, పరిమాణము, ఆకారాలను గమనించమని చెప్పండి. ఆ గింజలు ఎలా మొలకెత్తి చిన్ని మొక్కలుగా ఎదుగుతాయో వివరించండి.
- వారికిచ్చిన గింజలను పాత్రలో నాటి, పైన నీళ్ళు చల్లమని చెప్పండి ఆ పాత్రలను కిటికీ వద్ద గానీ, ఎండ తగిలే చోట గాని ఉంచమని చెప్పండి.
- వంతులవారీగా పిల్లలను ఆ మట్టి పాత్రలను గమనిస్తూ తగినంత నీళ్లు చల్లమని హెచ్చరించండి.
- గింజలు మొక్కలు గా మారే విధానాన్ని వివరిస్తూ పాత్రలలోని కలుపుమొక్కలను తీసివేయమని చెప్పండి కొన్ని రోజులలో మొక్కలు మొలకెత్తటము పిల్లలు గమనిస్తారు.
- మొక్కలు పుట్టుట, పెరుగుట, కలుపు మొక్కలు ఏరివేయుట పై పిల్లల అభిప్రాయాలు ఒకరితో ఒకరు పంచుకొనమనండి.
సారాంశము:- ఇప్పుడు మీరు సృష్టి కారమగు బ్రహ్మ, స్థితికి విష్ణువు, లయకు ఈశ్వరుడు కారకులైనట్లు, గురువులు పిల్లల జ్ఞానం మొలకెత్తుటకు, పెరుగుటకు, అనవసరమైన లక్షణాలు త్రుంచుటకు ఎలా సహకరిస్తారో వివరించండి.