ఓం సహనావవతు శ్లోకం – ఆక్టివిటీ
లక్ష్యం: గ్రూప్ 1 పిల్లలు – మనమందరం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉన్నామని మరియు కలసికట్టుగా పనిచేసి ఒకరి అవసరాలు ఇంకొకరు అర్థం చేసుకొని సహాయం చేస్తేనే మనం విజయం సాధించగలమని తెలుసుకోవడం.
అవసరమైన వస్తువులు: చార్ట్ పేపర్లు, కత్తెర, కలర్ పెన్సిల్స్/క్రేయాన్స్, పెన్సిల్, ఎరేజర్, ఒక కర్ర మరియు గ్లూ.
విధానము:
- పిల్లలను రెండు గ్రూపులుగా విభజించండి.
- పైన పేర్కొన్న వస్తువులను పిల్లలకు యాదృచ్ఛికంగా పంచండి. క్లాస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే, గురువులు ఎక్కువ గ్రూపులుగా విభజించవచ్చు. ఏ ఒక్క గ్రూపు కి కూడా కావలసిన అన్ని వస్తువులు అందకుండా చూడాలి. ఉదాహరణకు అబ్బాయిల గ్రూపుకు ఆరెంజ్ కలర్ పెన్సిల్, చార్ట్, కత్తెర, పెన్సిల్ ఇవ్వవచ్చు మరియు అమ్మాయిల గ్రూపుకు గ్రీన్ కలర్ పెన్సిల్, పెన్సిల్, చార్ట్, గ్లూ ఇవ్వవచ్చు.
- చార్ట్ పేపర్ మీద భారతీయ జెండాను గీయాలని, చివరకు దాన్ని కర్రకు అంటీంచాలని పిల్లలకు వివరించండి.
- మొదట తమ వద్ద లేని వస్తువుల గురించి పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. ఉదాహరణకి అబ్బాయిలు గ్రీన్ కలర్ పెన్సిల్, గ్లూ మొదలైనవి లేవని మరియు అమ్మాయిలు తమ వద్ద ఆరెంజ్ కలర్ పెన్సిల్, కత్తెర మొదలైనవి లేవని చెప్పవచ్చు. పిల్లలు ఒకరి దగ్గర వస్తువులు ఇంకొకరు వాడుకోవచ్చు కానీ గురువులు మాత్రం వాడుకోమని సలహా ఇవ్వకూడదు. వారి పక్కనే ఉండి జరుగుతున్నదంతా గమనించాలి. పిల్లలందరూ చురుగ్గా పాల్గొంటున్నారా లేదా అని చూడాలి.
- పూర్తి అయ్యాక జెండాను గురువులకు అప్పగించి జాతీయ గీతాన్ని కలసికట్టుగా పాడమని అడగండి.
చర్చించవలసిన విషయములు:
- పిల్లలను ఇతరులతో పంచుకోవడం సంతోషంగా ఉందా అని అడగండి?
- ఇతర గ్రూపుల నుండి వస్తువులు తీసుకోకుండానే వారు ఆ పనిని పూర్తి చేయగలిగారో లేదో అడిగి తెలుసుకోండి.
- కలిసికట్టుగా పని చేయడం ఎలా అనిపించిందో పిల్లలను అడిగి తెలుసుకోండి. పిల్లలు ఓర్పుతో, వేరే గ్రూపు పిల్లలు వారి వస్తువులు ఇచ్చేవరకు వేచి ఉన్నారో లేదో కనుక్కోండి.
- ఒక గ్రూపు పిల్లలు వారి జండా పూర్తి అయ్యేవరకు ఇంకో గ్రూపుని ఆపారా లేదా వారి పని సజావుగా జరగనిచ్చారా?
- వారు మర్యాదగా అడిగారా లేదా ఇతరుల నుండి డిమాండ్ చేశారా?
అర్థం చేసుకోవలసిన విషయం:
కలిసి పని చేయడం గురించి మరియు జీవితంలో విజయం సాధించడానికి ఒకరికొకరు సహాయ పడటం ఎంత ముఖ్యమో గురువు వివరించాలి. ఇదే విషయాన్ని గురువు ఇంకో విధంగా కూడా బోధించవచ్చు. ఉదాహరణకి, ఒక గ్లూస్టిక్ గురువు దగ్గరే ఉంచుకుని జెండా తయారు చేయటం అయిపోయాక కర్రకు అంటించుకోవడానికి వారి దగ్గరికి రావలసిందిగా చెప్పాలి. అలా చేసినప్పుడు
ఈ క్రింది ప్రశ్నలు అడగవచ్చు:
- పని పూర్తి చేయడానికి గ్లూ అవసరమా లేదా?
- గురువు కేవలం గ్లూని మాత్రం ఉపయోగించి జెండాను తయారు చేయగలరా?
స్వామి చెప్పినట్లు ఇంద్రియాలకు మరియు భావోద్వేగాలకు శిక్షణ ఇచ్చే ప్రక్రియలో గురువు మరియు శిష్యుని ఆలోచనలు సహకరించాలి. ఈ విధంగా సరైన అభ్యాసం కోసం గురువులు మరియు పిల్లలు కలిసి పనిచేయాలని గురువులు బోధించాలి.