భగవదనుగ్రహము
ఫ్రాన్సులో పూర్వం ఫ్రాన్సిసు అనే గారడివాడు ఉండే వాడు. అతను తన గారడితోను, మాంత్రిక చేష్టలతోనూ పసిపిల్లలను పడుచువారిని ఆనందింపచేసి, వారిచ్చిన కానుకలు అందుకొని సంతోషంగా జీవించేవాడు. సాయంకాలం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మేరీమాత గుడికి వెళ్ళి తనకు ఆరోజు సంపాదనను అనుగ్రహించినందుకు కృతజ్ఞత అర్పించుకొనేవాడు.
ఒకరోజు సాయంత్రం ఫ్రాన్సిసు మేరీమాత గుడికి చేరేసరికి చాలామంది సాధువులు ఆలయంలో చేరి, మోకరించి,గొంతెత్తి ప్రార్థనలు చేస్తున్నారు. ఆ దివ్యదృశ్యం అతని పవిత్ర హృదయాన్ని కదిలించివేసింది. ఆ మేరీమాత వంక చూస్తూ, భక్తి ప్రేమలతో పరవశం చెందాడు. ఆ సాధువులు చేసే ప్రార్థనలు విని “నా కిటువంటి పవిత్ర ప్రార్థనలు చెయ్యడం రాదే! మేరీమాతను ఏ విధంగా ప్రసన్నురాలను చేసుకొనగలను” అని విచారించాడు.
మరుక్షణమే పవిత్రమైన అతని అంతరంగంలో ఒక చక్కని భావన మొలకెత్తింది. సాధువులందరూ ప్రార్థన ముగించుకొని గుడి వదలి వెళ్ళేదాకా సావకాశంగా కూర్చున్నాడు. గుడి ఖాళీ కాగానే నెమ్మదిగా లోనికి ప్రవేశించి, తన ఏకాంతము నెవ్వరూ భంగపరచకుండా తలుపులన్నీ భద్రంగా మూసివేశాడు.
ఫ్రాన్సిసు తన సంచి తెరచి అందులో ఉన్న కత్తులు, గాజు సాసర్లు, ఇనుప గుళ్ళు మొదలైన అన్ని వస్తువులు బయటకు తీశాడు. తన గారడి విద్యను మేరీమాత విగ్రహం ముందు ప్రదర్శించడం ప్రారంభించాడు. తన పనితనాన్ని చూపిస్తూ ఒక్కొక్కప్పుడు సంతోషంతో కేరింతలు కొడుతూ, “ఓ మేరీ మాతా యీ ప్రదర్శన నీ కా ఆనందాన్నిస్తుందా?” అని అడిగేవాడు.
ఆ గుడి ప్రాంగణంలో నివసిస్తున్న ఒక సాధువు ఆ అరుపులు విని పరుగు పరుగున వచ్చాడు. తలుపులు మూసి వుండడంచేత తాళం వేయడానికి ఏర్పరచిన పెద్ద కన్నం నుండి తొంగిచూశాడు. ఫ్రాన్సిసు శీర్షాసనం వేసి తలక్రింద, కాళ్ళుపైన పెట్టి రెండు పెద్ద బరువైన ఇనుప గుళ్ళను ఒకదాని తర్వాత మరొక దానిని పాదాలతో గుండ్రంగా త్రిప్పుతూ నేత్రానంద కరంగా పైకెగర వేస్తున్నాడు. ఆనందంతో అప్పుడప్పుడు మేరీమాతా! యీ ప్రదర్శన బాగుందా ” అని అడుగుతున్నాడు. అలా చేస్తూ వుండగా అంత బరువైన ఇనుప గుండ్రాయి పట్టుతప్పి ప్రమాదవశాత్తు అతని నుదుట మీద పడింది. బలమైన గాయం తగిలింది. స్పృహ తప్పిన ఫ్రాన్సిసు నేలమీదకు ఒరిగాడు.
తలుపు రంధ్రంగుండా తొంగి చూస్తున్న సాధువు ఆశ్చర్యముతో నిలబడిపోయాడు. అతనికేమి చెయ్యాలో తోచలేదు. వెంటనే ఆ గుడి లోపల ఒక చైతన్యవంతమైన తేజస్సు చూశాడు. పీఠం నుంచి దిగి దవ్యకాంతితో మెరుస్తున్న మేరిమాత వస్తున్నట్టు కనిపించింది. ఫ్రాన్సిసు చెంతకు చేరి, వంగి, తాను ధరించిన ఆ దివ్య జలతారువస్త్రంతో అతని ముఖంమీద నున్న చెమటను తుడిచి, సేద తీర్చింది. తలుపులు తెరచుకొని సాధువు లోపలకు వచ్చేసరికి మేరీమాత అదృశ్యమైంది. ఆశ్చర్యచకితుడైన ఆ సాధువు “పవిత్ర హృదయులెప్పుడూ ధన్యులే. వారెల్లప్పుడు దేవుని అనుగ్రహానికి పాత్రులే” అని ఎలుగెత్తి పలుకుతూ వెళ్ళాడు.
ప్రశ్నలు
- ఫ్రాన్సిసువద్దనుండి సాధువేమి నేర్చుకొన్నాడు.
- హృదయ పవిత్రతను గూర్చి నీ స్వంత మాటలలో వ్రాయుము.
- నీవు భగవంతుడుని ప్రసన్నుణ్ణి చేసుకోవాలంటే ఏమి చేస్తావు?