భూతదయ- 1
తరతమ భేద రహితంగా సర్వజీవులను సమభావంగా ప్రేమించి ఆదరించు నిన్ను సృష్టించి ప్రేమించిన సర్వేశ్వరుడు సర్వులయందు సమంగా ఉన్నాడని మరువకు. ప్రపంచమునందలి మహనీయులు అందరూ భూతదయ గలవారే! సమస్త జీవులను తమతో సమానంగా భావించి ప్రేమించిన వారే! అటువంటి వారిలో దక్షిణ భారత దేశంలోని భగవాన్ శ్రీ రమణమహర్షి ఒకరు, మరియు బ్రిటిష్ శాస్త్రవేత్తగా పేరుపొందిన సర్ ఐజాక్ న్యూటన్ మరొకరు.
శ్రీ రమణమహర్షి తన దర్శనానికి వచ్చే వేలాదిమంది భక్తులనే కాకుండా జంతువులు, పక్షులు మొదలైన వాటినన్నిటిపై కూడా అమితమైన ప్రేమను చూపేవారు. ఆయన ఆశ్రమంలో కుక్కలు, ఆవులు,కోతులు, ఉడుతలు, నెమళ్లు మరియు ఇంకా ఎన్నో జంతువులుండేవి. ఆయన దర్శనము చేసుకుని ఆశీస్సులందుకోవడానికి వచ్చిన భక్తులతో సమానంగా వాటిని కూడా ఆయన ప్రేమతో ఆదరించేవారు. వాటినెప్పుడు ఆయన అది, ఇది అనేవారు కాదు. వాటిని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు మనుష్యులను పిలచి నట్లుగానే పిలిచేవారు. “పిల్లలకు భోజనము పెట్టారా?” అని ఎంతో ఆప్యాయతతో కుక్కపిల్లల గురించి ఆరా తీసేవారు. అంతే కాకుండా భోజన సమయంలో మొదట కుక్కలకు, తరువాత భిక్షగాళ్ళకు (యాచకులకు) పెట్టిన తరువాతనే భక్తులు భోజనం చేయుటం ఆశ్రమ నియమముగా చేశారు.
ఒక రోజున ఒక కోతి తన పిల్ల నెత్తుకొని మహర్షి దగ్గరకు వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళంతా దానిని తరమడానికి ప్రయత్నించారు. ఆ కోతి ప్రార్థనా మందిరంలోని ప్రశాంతతకు భంగం కలిగిస్తుందని వాళ్ళ ఉద్దేశ్యం. వెంటనే రమణ మహర్షి “రానివ్వండి, ఆమెను ఏమీ ఆపవద్దు” అని అన్నారు. “మీవలెనే ఆమెకూడ తన బిడ్డను నాకు చూపించి ఆశీస్సలు అందుకోవాలని వచ్చింది” అన్నారు.
ఆశ్రమంలో ఒక ఆవు వుండేది. ఆమెకు మహర్షి “లక్ష్మి” అని పేరు పెట్టారు. ఆయన చుట్టూ భక్తులు గుమిగూడివున్న సమయంలో కూడా ఆ ఆవు ఎవ్వరిని గమనించకుండా ఆయన వద్దకు వెళ్ళిపోయేది. అది ఎప్పుడు వచ్చినా సరే దానికి ఒక అరటి పండో లేక మరేదో తినిపించి పంపుతూ ఉండేవారు.
ఆవిధంగా ఆశ్రమంలో ‘లక్ష్మి’ అందరికి కూడా ఎంతో ప్రీతి పాత్రురాలయింది. అందరూ ఆమెను అత్యంత ప్రేమతో చూసేవారు. లక్ష్మికి చాలాదూడలు పుట్టాయి. అందులో మూడింటిని స్వామివారి జన్మదినము రోజు కన్నది.
పాపం లక్ష్మి వృద్ధురాలు అయింది. ఒక రోజున చాలా జబ్బు చేసింది. ఆమెకు అంత్యఘడియలు సమీపించాయి. ఆ సమయంలో శ్రీరమణమహర్షి స్వయంగా నడిచి ఆమె దగ్గరకి వచ్చారు. “లక్ష్మీ” నీ దగ్గర ఉండమని కోరుకుంటున్నావా? అలాగే ఉంటాను” అన్నారు. అవును అన్నట్లు ఆనందంగా ఆయన వంక చూసింది. చూసిందే తడవుగా లక్ష్మికి సమీపంలో కూర్చుని ఆమె తలను తన తొడపై పెట్టుకొని నిమిరారు. రెండు చేతులలోకి ఆ తలను తీసుకొని అలా హృదయానికి హత్తుకున్నారు. ఆమె ముఖము చూస్తూవుంటే ఆనందం ఉప్పొంగిపోయింది ఆయనకు. అర్ధనిమీలిత నేత్రాలతో ఆయన హృదయం మీద తన తల వాల్చింది. అంతే! లక్ష్మి ప్రశాంతంగా ఈ లోకం వీడింది. మానవ శరీరానికి చేయవలసిన అంత్యక్రియలన్నీ ఆమెకు చేయించారు. ఆయనకు అత్యంత ప్రీతికరమైన లేడి, కాకి, కుక్కల సమాధులవద్ద ఆమెకు కూడా సమాధి కట్టించారు. ఆ సమాధిపైన ఒక రాతిపలకమీద లక్ష్మి స్వరూపాన్ని చెక్కించారు.
పశు పక్ష్యాదులయెడల ఆ మహర్షి ప్రదర్శించిన ఆదర, అభిమానాలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు.
ప్రశ్నలు:
- శ్రీరమణమహర్షి తన భక్తులకు ఏమి బోధించేవారు?
- పశుపక్ష్యాదులకు కూడా సమాధులు ఎందుకు నిర్మించారు?
- భూతదయ గురించి నీవు చదివిన, విన్న, చూచిన సంఘటనను గూర్చి వ్రాయుము?