భూతదయ – II
సర్ ఐజాక్ న్యూటన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త. గణితశాస్త్రంలోను, విజ్ఞాన శాస్త్రములోను ఎల్లప్పుడు పరిశోధనలు చేస్తూవుండేవాడు. అతనికి తన స్నేహితుని కన్నా మిన్నగా చూచుకొనే ఒక కుక్క వుండేది. దానిని “డై మండ్” అని పిలిచేవాడు. దానికి మాటలు రాకపోయినా ఆ కుటుంబ సభ్యులలో ఒకడుగా చూడబడేది.
ఒకరోజు రాత్రి అతడు ఒంటరిగా కూర్చొని పరిశోధనలో నిమగ్నుడై వున్నాడు. అతడు పరిశోధన జరిపే నమస్యకు పరిష్కారం లభించింది. ఎంతో ఆనందంతో ఉప్పొంగి పోయాడు. బయటకు వెళ్ళి కొంతసేపు చల్లగాలి పీల్చుకొని రావాలి అనుకొన్నాడు. కాగితాలన్నీ ఒక కట్టగా కట్టేసి బయటకు బయలుదేరాడు. అది చూసి, టేబుల్ క్రింద పడుకున్న డైమండ్ కూడా న్యూటన్ని అనుసరించాలనుకుంది. లేచి గుమ్మం వైపు గెంతింది. ఆ ప్రయత్నంలో తెలియకుండానే దాని కాలు తగిలి బల్ల కదిలింది. బల్ల కదిలీ కదలగానే దానిమీద వెలుగుతున్న క్రొవ్వొత్తి, కాగితాల కట్టల మీద పడింది. వెంటనే పెద్దమంటతో కాగితాలు అంటుకొన్నాయి. న్యూటన్ వెనక్కి తిరిగి చూసేసరికి సంవత్సరాల తరబడి తాను పరిశోధించి సాధించిన ఫలితాలు ఉన్న కాగితాలు మొత్తం కాలి, బూడిద అయి పోయాయి.
అది చూచిన న్యూటన్ ఎంతో వ్యాకులత చెందాడు. కాలిపోయిన కాగితాలను వాసన చూస్తూ, తోక ఆడిస్తూ, గిరగిర తిరుగుతున్న డైమండ్ వంక కాస్సేపు తీవ్రంగా తదేకముగా చూచాడు. కానీ అతనికి దాని మీద వున్న అమితమైన ప్రేమచేత, ఏమీ అనలేకపోయాడు. డైమండ్ పై తన మనసులోని ప్రేమతో కోపం అంతా దిగమ్రింగి, చిరునవ్వుతో దాన్ని సమీపించి “ఓ నా ప్రియమైన డైమండ్, నీవెంతపని చేశావో చూశావా? నీవు చేసిన తప్పు ఏమిటో నీవు ఎప్పటికీ తెలుసుకోలేవు” అని ప్రేమగా దాన్ని తట్టాడు. ఈ సందర్భంలో అతడు ప్రదర్శించిన క్షమ, సహనము ఆదర్శవంతము మరియు ప్రశంసనీయము, ప్రతివారు అనుసరించదగినవి. న్యూటన్ తెలివైన శాస్త్రవేత్త గా మాత్రమే గొప్పవాడు కాదు ఇంకా ఆయనలోని ప్రేమ, సహనము మరియు క్షమ అనే మంచి గుణములు ఆయనను చాలా గొప్పవానిగా చేశాయి.
ప్రశ్నలు:
- భూతదయవల్ల మానవునకు ప్రాప్తించునదేమి?
- డైమండ్ చేసిన తప్పుకి, దానిని శిక్షించకుండా న్యూటన్ ఎందుకు క్షమించాడు?
- న్యూటన్ కి జరిగినట్లు నీకు జరిగితే నీవేమి చేసి ఉండేవాడివి?
- న్యూటన్ ఏ విధాముగ గొప్పవాడు?
[*భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు Diamond = Die + Mind అంటారు. డైమండ్ అంటే ‘డై మైండ్’ అని అర్థం. వజ్రం వలె అమూల్యమైన మరియు ప్రకాశవంతమైనదిగా మారడానికి మనము మనస్సును వదిలించుకోవాలి లేదా జయించాలి అన్నారు స్వామి. వజ్రం వెలుగులో మెరిసినట్లే, మీరు మీ మనస్సును కత్తిరించినట్లయితే, అంతరంగం మెరుస్తుంది.*]