రాముడు భరతుడు సమాగమం
చివరికి వారు చిత్రకూటం చేరుకున్నారు. భరతుడు రాముని పాదాలపై వాలిపోయాడు. రాముడిని చూడగానే రాణులు, ఇతరులు తీవ్రమైన దు:ఖంతో వివశులైపోయేరు. పరమపదించిన తండ్రి గారికి ఉత్తరక్రియలు నిర్వహించాలని వశిష్టుడు రామునికి చెప్పేడు. రెండు రోజుల తర్వాత అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి, అందరినీ అయోధ్యకు తిరిగి వెళ్ళమని చెప్పమని రాముడు వశిష్ఠునికి విన్నపం చేశాడు. రాముని క్షమాపణ అడిగేందుకు అవకాశం ఇవ్వమని కైకేయి కోరింది. తాను ఏది కోరుకున్నాడో అదే జరిగిందని రాముడు ఆమెకు చెప్పేడు. సీతారాముల దర్శనంతో ఆనందం అనుభవించేరు కనుక, వారిని వదలిపెట్టడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఆరవ రోజున రాముడు లేకుండా అయోధ్యకు తిరిగి వెళ్ళాలనే ఆలోచనతో తాను సంతోషంగా లేనని, మరొక్కసారి రాముడికి తన మనసులో మాట చెప్పేడు భరతుడు. తండ్రి ఆజ్ఞ పాటిస్తేనే తాము ధర్మమార్గంలో పయనించగలం అని రాముడు అతనికి చెప్పేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
దైవం దయామయుడు. మన తప్పులకు పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ తప్పులు చేయమని వాగ్దానం చేస్తే, మనని క్షమించి ప్రేమతో ఆదరిస్తాడు. మనం కూడా మన స్నేహితులను ప్రేమిస్తూ, క్షమిస్తూ ఉండగలగాలి.
ఎంతో గౌరవం పొందిన తన తండ్రి కీర్తిని వారి మరణం తర్వాత కూడా సంరక్షించడానికి వారికిచ్చిన మాటను, వారి మరణం తర్వాత కూడా నిలబెట్టాలని రాముడు ఎలా పట్టుబట్టేడో, తండ్రి పై తన ప్రేమనీ, అభిమానాన్ని ఎలా అజరామరం చేయగలిగాడో చెప్పాలి. ధర్మాన్ని ఉన్నతంగా నిలపవలసిన అవసరాన్ని ఆచరణాత్మకంగా చూపించడానికి రాముడు తన రాజ్యాధికార హక్కును త్యాగం చేశాడు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: తల్లిదండ్రుల పట్ల విధేయత, వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. అన్ని లౌకిక వైభవాల కంటే ధర్మమే ముఖ్యము.
అతడు తనపాదుకులను భరుతునికిచ్చేడు. మనస్సు లగ్నంచేసి పదునాలుగు సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించమని చెప్పేడు. పాదుకలు రాముని ప్రతీకగా ఉంటాయనీ, రాముని ప్రతినిధిగానే రాజ్యపరిపాలనా విధుల్ని తాను నిర్వహిస్తానని భరతుడు చెప్పేడు. భరతుడు రాముని పాదాల పై పడి తిరిగి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
భరతుడు అయోధ్యను పరిపాలించే గౌరవాన్ని అంగీకరించి ఉండవచ్చు. దానిలో ఉన్న రాజభోగాలను అనుభవించి ఉండవచ్చు. అయినా దురాశ వంటి అల్పభావాల కంటే ఉన్నతంగా ఎదిగి, అంతస్థు, పదవీ, అధికారమూ నిరాకరించేడు. ఆ పరిస్థితిలో ఏది యుక్తమో దాన్ని మాత్రమే ఎంచుకున్నాడు. అది రాముడిని అయోధ్యకు తిరిగి తీసుకురావడం, అతనికి న్యాయంగా రావలసిన అధికారాన్ని అప్పచెప్పడం.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: నిర్ణయానికి ముందు విచక్షణ. ఎల్లప్పుడూ ధర్మమార్గాన్ని ఎంచుకోండి.
అయోధ్యకు తిరిగి రాగానే రామపాదుకల్ని సింహాసం పై ప్రతిష్ఠించి, రాముడు వనవాసం నుండి తిరిగి వచ్చే వరకు వాటిని పూజించడానికి ఏర్పాటు చేశారు. ఆ రోజున భరతుడు పాదుకల్ని తన శిరస్సు పై మోసుకుని, ఎంతో గౌరవ ప్రపత్తులతో సింహాసనంపై ఉంచేడు. అప్పుడు భరతుడు సన్యాసిలా వస్త్రధారణతో, నందిగ్రామమనే గ్రామంలో పర్ణశాలలో అతి సామాన్యునిలా జీవితం గడిపేడు. కందమూలాలు తిని జీవిస్తూ, నైతిక నిష్టతో జీవితం గడిపాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
భరతుని సోదర భక్తి, దృఢమైన న్యాయవివేకము. అది ఎలాగంటే పధ్నాలుగు సంవత్సరాలు పూర్తి కాకుండా అయోధ్యకు తిరిగి రావడానికి రాముడు తిరస్కరించినప్పుడు, రాముడు తిరిగివచ్చేవరకు రాముని రాజ ప్రతినిధిగానే అయోధ్యను పరిపాలించడానికి అంగీకరించేడు.
గురువులు ముఖ్యంగా, భరతుడు రాముని వనవాస దీక్షను తలపించే విధంగా, సన్యాసిలా జీవించే నిర్ణయాన్ని తీసుకోవడంలో ప్రదర్శించిన నిస్పక్షపాత బుద్ధిని గూరించి చెప్పాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు సర్వసాధారణమైపోయిన నేటి లౌకిక ప్రపంచంలో, అయోధ్యా రాజసోదరుల మధ్య ఈ అసాధారణ బాంధవ్యం మెచ్చుకుని తీరాలి.
గ్రహించి ఆలవరుచుకోవలసిన విలువలు:
కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ మధ్య బాంధవ్యాలు, ప్రేమ, త్యాగం పునాదిగా ఉండాలి. న్యాయసమ్మతంగా నీది కాని దానికోసం ఆశపడకు. నీదైనా సరే, నువ్వు ప్రేమించే వారి కోసం త్యాగం చెయ్యడంలో తప్పులేదు.
నీ కార్యక్రమాల్లో నిస్పక్షపాత బుద్ధి అలవరుచుకో. అది నీ ఆటలు, విద్య, పోటీలు మొదలైనవి కావచ్చు. ఏ విజయమైనా అన్యాయంగా సాధించినా, లేక నీ చుట్టూ ఉన్నవారితో సామరస్య భావం నాశనం చేసినా, ఆ విజయం విలువలేనిది. మీ మాట, చేష్ట, ఆలోచన, శీలము, హృదయము పట్ల జాగరూకుడివై ఉండు. హీరోలుగా ఉండండి, జీరోలుగా కాదు. (జీవితంలో న్యాయంగా, ధర్మంగా ఉన్నవాడే నిజమైన హీరో).