రాముని జననం
ఒకానొకప్పుడు అయోధ్యకు ధైర్యశాలి, న్యాయశీలి అయిన పరిపాలకుడు ఉండేవాడు. అతని పేరు దశరథుడు. అతడు సూర్యవంశంలో జన్మించేడు. కోసలరాజు కుమార్తెను అతడు వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి తనకు సంతానం లేకపోవడంతో దశరథుడు చింతాక్రాంతుడయ్యేడు. అందువల్ల కౌసల్య సలహాతో, దశరథుడు సుమిత్ర తర్వాత కైకను వివాహం చేసుకున్నాడు.
వ్యాకులపడుతున్న దశరథ మహారాజు కులగురువు మహర్షి వశిష్ఠుని ప్రార్ధించాడు. పావనుడైన మహర్షి, భగవదనుగ్రహంతో సంతానం కలగడానికి చేసే, పుత్రకామేష్టి యాగాన్ని చేయమని సలహా ఇచ్చేడు. ఋష్యశృంగుడు యాగం చెయ్యగానే, యాగాగ్ని నుండి ఒక మహనీయమూర్తి ఉద్భవించాడు. అతడు మెరిసే పాత్రను తన చేతులతో పట్టుకున్నాడు. ఆకాశవాణి “మహారాజా! ఈ పాత్రను స్వీకరించు. దానిలో తెచ్చిన పాయసాన్ని ఉచితమైన భాగాలుగా చేసి ముగ్గురు రాణులకు ఇయ్యి” అని ప్రతిధ్వనించింది. రాజు పాయసం అందుకోగానే ఆ దివ్యరూపం అదృశ్యమైంది.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మీకు విచారము, వ్యాకులము కలిగితే దైవ ప్రార్ధన చేయాలి.
జీవితంలో దేనికోసమైనా బలంగా కోరుకుంటే, దేవుని ఆశీస్సుల కోసం ప్రయత్నించాలి.
గ్రహించి అలవరచుకోవలసిన విలువలు:
భగవద్విశ్వాసము, ప్రార్ధన, శరణాగతి యొక్క ప్రాముఖ్యము.
పాయసం ముగ్గురు రాణులకూ పంచబడింది. కాని ఒక గ్రద్ద సుమిత్ర పాయస పాత్రను హఠాత్తుగా ఎత్తుకుని పోయింది. రాణులు కౌసల్య, కైకేయి తమ పాయసాన్ని సుమిత్రతో పంచుకున్నారు. అనుకున్న సమయానికి ముందే కౌసల్య, కుమారుడు రామునికి జన్మనిచ్చింది. భరతుడు కైకేయికి జన్మించేడు. సుమిత్ర కవలలు లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చింది.
గ్రహించి అలవరచుకోవలసిన విలువలు: జాగ్రత్త, పంచుకొనుటలో సంతోషం; పంచుకుంటే సంతోషం ఎన్నో రెట్లు ఎక్కువవుతుంది.
దశరథుడు తన నలుగురు కుమారుల జననాన్ని శోభాయమానంగా, వైభవంగా ఉత్సవంగా జరిపేడు. వారు సాధారణమైన పిల్లలు కారు. వారు దివ్యులు. వారు అన్ని ప్రత్యేకతలూ ఉన్నవారు. తన కుమారుడు లక్ష్మణుడు రాత్రింబగళ్ళు ఏడ్వటం సుమిత్ర గమనించింది. వైద్యులు అతనిని పరీక్షించేరు, ఔషధాలిచ్చేరు. వాటి ప్రభావం లేదు. చివరికి వశిష్టుని సలహాతో రాముని ఉయ్యాలలోనే లక్ష్మణుని కూడా ఉంచేరు. వెంటనే అతడు తన ఏడ్పు ఆపేశాడు. అదే విధంగా శత్రుఘ్నుడు భరతునితో ఉన్నప్పుడే సంతోషంగా ఉండేవారు.
దశరథ మహారాజు, కుమారులు వయస్సులో పెద్దవారవగానే విద్యాభ్యాసం కోసం వశిష్టుని గురుకులానికి పంపేడు. వారు విలువైన దుస్తులు ధరించలేదు. సాధారణమైన దుస్తులు ధరించారు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మీరు మెరసిపోయే దుస్తులు/ఖరీదైన చేతి గడియారాలు ధరించకూడదు. ఖరీదైన పెన్సిలు, పెన్నుల పెట్టెలు పాఠశాలకు తీసుకుపోకూడదు. అక్కడ పిల్లలందరూ సమానులే. మనం పాఠశాలకు విలువైన పాఠాలు నేర్చుకునేందుకు వెళతాము.
గ్రహించి అలవరచుకోవలసిన విలువలు: సామాన్య జీవితము, ఉన్నతమైన ఆలోచనలు, ఆడంబర ప్రదర్శన కంటే ఎక్కువ గౌరవార్హతనిస్తాయి.
తన వద్ద విద్యాభ్యాసం పూర్తికాగానే, తన కుమారులను తిరిగి రాజ భవనానికి తీసుకుపోవడానికి దశరధునికి అనుమతినిచ్చేడు వశిష్టుడు. తన కుమారులకు విలువిద్యలో కూడా శిక్షణ ఇప్పించాలనుకున్నాడు దశరథుడు. శిక్షకులు అడవిలో పక్షులపై బాణం సంధించమంటే, రాముడు తాము మంచిని రక్షించడానికి విలువిద్య నేర్చుకున్నాం గాని అమాయకమైన జంతువులు, పక్షులను చంపడానికి కాదని చెప్పి, నిరాకరించాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
ఎప్పుడూ సహాయం చెయ్యి, ఎన్నడూ గాయపరచకు” అన్న దివ్య సూక్తిని రాముడు ఎలా అనుసరించాడు? గ్రహించి అలవరచుకోవలసినవి: అహింస, ధర్మము