హనుమంతుడు సంజీవని తెచ్చుట
మేఘనాధుడు, రావణుని కుమారుడు, వానరులు లంకానగరంలోకి ముందుకు రావడంతో తీవ్ర కోపోద్రిక్తుడయ్యేడు. మహాయోధుడిగా కీర్తి గడించినవాడు. శక్తివంతమైన తన ధనస్సును సారించగా చూసిన వానరులు యుద్ధం చెయ్యాలనే ప్రేరణ కోల్పోయేరు. లక్ష్మణుడు, మేఘనాధుడు ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు మేఘనాధుడు సర్వోత్కృష్టమూ, అతిశక్తివంతమయిన, తనకు బ్రహ్మ ప్రసాదించిన ఆయుధం ‘శక్తి’ని లక్ష్మణుని గుండెకు గురి చూసి ప్రయోగించేడు. ఆ ఆయుధం లక్ష్మణునికి తగలగానే అతడు అచేతనుడై భూమిమీద పడిపోయేడు. అయితే హనుమంతుడు అతడిని ఎత్తుకుని రాముని ముందుకు తీసుకువచ్చేడు. అప్పుడు హనుమంతుడు లంకలోని సుషేణుడనే వైద్యుడిని ఇంటితో సహా ఎత్తుకుని వచ్చి రాముని ముందు ఉంచేడు. లక్ష్మణునికి చికిత్స చెయ్యడానికి కావలసిన ప్రత్యేకమైన ఔషధం హిమాలయాల్లో సంజీవని పర్వతం మీద ఉంది అని సుషేణుడు చెప్పాడు. వెంటనే హనుమంతుడు ద్రోణపర్వత పంక్తులకి ప్రయాణమయ్యేడు, సంజీవని పర్వతాన్ని చేరుకుని కావలసిన మూలిక కోసం వెతికేడు. ఆ పర్వతం మీద ఉన్న లెక్కలేనన్ని మొక్కల మధ్య ఆ ఔషధ మొక్కను గుర్తించ లేకపోయేడు. దాంతో ఆ మొత్తం పర్వతాన్ని ఎత్తి అరచేతిలో పెట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
హనుమంతుడు శారీరిక శౌర్య పరాక్రమాలు కలిగి ఉండడమే కాదు. మేధస్సుకీ, వివేకానికీ ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోదగినవాడు. సంజీవనిపర్వతం మీద తనకు కావలసిన మూలికను గుర్తించలేనప్పుడు కూర్చొని ఏం చెయ్యాలని ఆలోచించలేదు. అతడు సమయాన్ని వృధా చెయ్యలేదు. వేగంగా మరొక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఆలోచించేడు. సమయం చాలా కీలకమైన అంశం. కాబట్టి మొత్తం పర్వతాన్ని లంకకు తీసుకుని వెళ్ళిపోయేడు. సత్వరంగా చేసిన ఈ ఆలోచన లక్ష్మణుని ప్రాణాలను రక్షించింది, రాముని ఆశీస్సులు లభించేలా చేసింది. మనం కూడా ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు నిర్ణయం తీసుకోలేని స్థితిలో సమయాన్ని వృధా చేయకూడదు. మనం భగవంతుడిని తప్పకుండా ప్రార్థించాలి. త్వరగా సమస్య పరిష్కారానికి వేరే మార్గాలు వెతకాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: సమయం వృధా, జీవితమే వృధా.
హనుమంతుడు లంక చేరుకోగానే సుషేణుడు కావలసిన ఔషధాన్ని సేకరించి, లక్ష్మణునికి ఇచ్చేడు. లక్ష్మణునిలో తిరిగి చైతన్యం వచ్చింది. రాముడు లక్ష్మణుని గుండెలకు హత్తుకున్నాడ, ఎంతో సంతోషించేడు. రాముడు సషేణుడిని ఆశీర్వదించేడు. అతనికి ఎదురయ్యే ఏ ఆపదనుండైనా రక్షిస్తానని వాగ్దానం చేశాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: మంచి పనులకెప్పుడూ ప్రతిఫలం ఉంటుంది. మనం చేసే ప్రతి మంచి పనీ స్వామిని సంతోషపెడుతుంది.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: మానవ సేవే మాధవ సేవ. దైవాన్ని తృప్తి పరచండి, మానవుని తృప్తి పరచండి.