రామ, హనుమ, సుగ్రీవుల సమాగమం
రాముడు, లక్ష్మణుడు అడవి మార్గంలో ప్రయాణించి చివరికి సుగ్రీవుడు నివసించే ఋష్యమూక పర్వత పంక్తిని చేరుకున్నారు. సుగ్రీవుడు అతని అన్న వాలికి భయపడి జీవిస్తున్నాడు. ఇద్దరు అన్నదమ్ములు సమీపించడం చూసి, వారు దివ్యులుగా కనిపించడంతో అశ్చర్యపోయేడు. అతడు వారెవరో తెలుసుకుని రమ్మని హనుమంతుణ్ణి సన్యాసిగా మారువేషంలో పంపించాడు. హనుమంతుడు ఆ అన్నదమ్ముల్ని కలిసినప్పుడు, అతని హృదయం ఆనంద భరితమైంది. భూమి పైకి దిగి వచ్చిన దివ్యమైన జంట నరనారాయణులై ఉంటారని ఊహించేడు హనుమ.
[*గురువులు ‘మనోజవం’ అన్న శ్లోకాన్ని బోధించాలి. హనుమంతుని దివ్యలక్షణాల్ని ముఖ్యంగా తెలియజెప్పే శ్లోకార్ధాన్ని వివరించాలి. హనుమంతుని కథను వివరిస్తూ అతని గొప్ప జ్ఞానము, శక్తి, వినయము, భక్తి, నిస్వార్ధ సేవాభావం మొదలైన సద్గుణాల్ని హృదయానికి హత్తుకునేలా చెప్పాలి].
రాముడు తాము దశరధుని కుమారులమని, పంచవటి నుండి రావణుడు అపహరించిన తన భార్య సీతను అన్వేషిస్తూ వచ్చామని చెప్పేడు. అప్పుడు రాముడు హనుమంతుణ్ణి గురించి, తెలుసుకోవాలనుకున్నాడు. హనుమంతుని కళ్ళు కన్నీటితో నిండిపోయేయి.” నేను ఒక ప్రకటన చెయ్యాలని కోరుకుంటున్నాను. దానికి నా ప్రభువే ప్రత్యక్ష సాక్షి, నా ప్రభువును సేవించడం తప్ప ఇతర ఏ కార్యమూ నాకు తెలియదు” అని అతడు చెప్పేడు. రాముడు హనుమను కౌగలించుకుని “నువ్వు లక్ష్మణుని లాగే నాకెంతో ఆత్మీయుడివి” అని చెప్పేడు. “హనుమా! ఎవరైతే నన్ను సేవిస్తారో, సేవయే మోక్ష సాధన గా భావిస్తారో వారిపై నా ప్రేమను కురిపిస్తాను” అన్నాడు రాముడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: మానవాళిని సేవించే నిజమైన సేవకుడిగా చిన్న చిన్న సేవలు చేసి ప్రభువుని దైవాన్ని ఎలా సంతృప్తి పరచవచ్చో చెప్పాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: మానవసేవే మాధవసేవ. దైవాన్ని సంతృప్తి పరచండి, మానవుణ్ణి సంతృప్తి పరచండి.
“సుగ్రీవుడు వానర సమూహానికి పరిపాలకుడని, అతని అన్న వాలి, శత్రువుగా భావించి సుగ్రీవుణ్ణి రాజ్యం నుంచి తరిమివేశాడని, అతని భార్యను అతని నుండి దూరం చేశాడని హనుమంతుడు, రామునికి చెప్పేడు. సుగ్రీవుడు వానరులకు నాయకుడని, వందలాది వానరులను సీతాన్వేషణ కోసం అన్ని దిక్కులకు పంపిస్తాడని హనుమంతుడు చెప్పేడు. అప్పుడు హనుమంతుడు రామ, లక్ష్మణులను సుగ్రీవుని దగ్గరకు తీసుకుని వెళ్ళేడు. సుగ్రీవుడు రాముణ్ణి ఆహ్వానించేడు. అగ్నిసాక్షిగా వారు స్నేహప్రమాణాన్ని చేసుకున్నారు. “తాను పుష్పకరథం ఎగురుతూ వెళ్ళడం, దాని నుండి నగల మూట విసిరి వేయబడడం చూశానని” సుగ్రీవుడు చెప్పేడు. అతడు ఏ సగలనైనా గుర్తించగలడేమోనని రాముడు అడిగినప్పుడు లక్ష్మణుడు “సీతను తల్లిగా భావించి నిత్యం ఆమె పాదాలకు నమస్కరించే వాడినని, అందుచేత తాను సీతమ్మ పాదాలు మాత్రమే చూశానని, ఆమె కాలిమట్టెలు మాత్రమే గుర్తుపట్టగలనని” చెప్పేడు. ఆ విధంగా రావణుడే తన రథంలో సీతను అపహరించుకుపోయాడని నిశ్చయమైపోయింది. అన్ని విధాలా సహాయం చేస్తానని సుగ్రీవుడు రామునికి వాగ్దానం చేసేడు. వాలిని సంహరించి తిరిగి అతని రాజ్యాన్ని పునరుద్ధరిస్తానని రాముడు సుగ్రీవునికి వాగ్దానం చేసేడు.
రాముడు నిర్దేశించినట్లుగా, మరునాడు వాలితో యుద్ధానికి బయలుదేరిన సుగ్రీవుడు వాలిని యుద్ధానికి రమ్మని సవాలు చేసేడు. వాలి అతివేగంగా సుగ్రీవుణ్ణి ఓడించేడు. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో రాముని దగ్గరకు తిరిగి వచ్చేడు. రాముడు కొన్ని అడవి పువ్వులను తీసుకుని మాలగా తయారు చేసి, సుగ్రీవుని మెడలో వేసి, మళ్ళీ యుద్ధానికి రమ్మని వాలిని సవాలు చెయ్యమన్నాడు. రామ, లక్ష్మణులు ఒక చెట్టు వెనక దాగి ఉన్నారు. సుగ్రీవుడు సహాయం చెయ్యమని ప్రార్థించగానే రాముడు తిన్నగా వాలి గుండెల్లోకి బాణాన్ని ప్రయోగించేడు. రాముడు దివ్యదర్శనం ప్రసాదించినందుకు వాలి ఆనందబాష్పాలు కార్చేడు. అతడు చేసినదంతా అతిక్రూరమైనదని రాముడు వారికి వివరించేడు. తాను చేసిన పని తప్పని వాలికి తెలిసింది. అతడు తన కుమారుడు అంగదుణ్ణి పిలిచి, అతనిని జాగ్రత్తగా చూసుకోమని రాముని ప్రార్ధించి భౌతిక శరీరాన్ని విడిచి పెట్టేడు. అంగదుణ్ణి జాగ్రత్తగా ప్రేమతో పెంచి పెద్ద చెయ్యమని రాముడు సుగ్రీవునితో చెప్పేడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజయ్యాడు.
[గురువుల పరిశీలన కోసం, ప్రొఫెసర్ అనిల్ కుమార్ తేది 14-04-2011 న చేసిన ఆదివారం ప్రసంగం నుండి ఎంపిక చేసిన భాగం, ఈ దిగువనివ్వబడింది.
[రాముడు వాలిని సంహరించేడని మీకు తెలుసు. వాలి మరణ సమయంలో, అతడు తన శరీరాన్ని వదలి పెట్టేముందు, రాముడు వాలి దగ్గరకు వెళ్ళేడు. రాముడు, వాలి మధ్య వాదన జరిగింది.]
“రామా! నువ్వు రాజువి. నేను వానరుణ్ణి” ఈ విధంగా నన్ను చంపటం న్యాయమనుకొంటున్నావా?” అని అడిగేడు వాలి.
దానికి రాముడు “ఓ వాలీ! నీవు వానరుడివని తెలుసు. మంచిదే! నేను రాజుని. రాజులు వేటాడతారు. మేం జంతువుల్ని చంపుతాం. నువ్వు వానరుడివి. అందుచేత నిన్ను నేను చంపవచ్చు. అందులో తప్పేం లేదు” అని అన్నాడు. వాలి మొదటి వాదనలో గెలవలేకపోయాడు.
అప్పుడు “రామా! ఇప్పుడు నువ్వు రాజువు కాదు. నీ తమ్ముడు భరతుడు రాజు. నువ్వు ఇక్కడ మాతో అరణ్యంలో ఉన్నావు. నువ్వు నన్నెలా చంపగలవు?” అని తన రెండవ వాదన వినిపించేడు వాలి.
“కాదు వాలీ! ఈ అడవి మా రాజ్య పరిధిలోకి వస్తుంది. అందుచేత నా సోదరుడు రాజు కనుక ధర్మాన్ని నిలబెట్టి, ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయవలసిన విధి నాకుంది. అందుచేత నిన్ను సంహరించేను” అని బదులిచ్చేడు రాముడు.
అప్పుడు మూడవ అంశాన్ని లేవనెత్తేడు వాలి “రామా! రావణుని ఎదుర్కొనేందుకు నా సోదరుడు సుగ్రీవుని సహాయం కోరేవు. రామా నువ్వు అసలు తెలివైన వాడివి కావు. నా సోదరుడు సుగ్రీవుడు బలహీనుడు. అతడిని నేను చాలా సార్లు గాయపరిచేను. సుగ్రీవుడు అలాంటి పిరికివాడు. వాడి సహాయం కోరేవు నువ్వు. నువ్వెంత మూర్ఖుడివి, రామా! నీకు సహాయం చెయ్యమని నన్నడగవలసింది. నేను మరింత శక్తి శాలిని. నిజానికి నీ శత్రువు రావణునికి నేనంటే భయం. నేను అతణ్ణి చాపలాచుట్టి, నా బాహుమూలంలో బంధించి పవిత్రమైన సముద్రంలో ఎన్నోసార్లు స్నానం చేయించేను. నా బలం గురించి రావణుడికి తెలుసు అందుకే అతనికి వేవంటే భయం. సహాయం చెయ్యమని నువ్వు నన్నడగవలసింది” అని రామునితో చెప్పేడు వాలి.
నేను మీ సోదరుడు సుగ్రీవుని సహాయం కోరేవు, ఎందుకంటే సుగ్రీవుడు నేనూ, ఆపత్సమయంలో సహచరులం మేమిద్దరం మా రాజ్యాన్ని కోల్పోయేం. భార్యా వియోగంతో బాధపడుతున్నాం. నువ్వు నీ తమ్ముడి భార్యను బలవంతంగా ఎత్తుకుపోయేవు, రావణుడు నా భార్యను అవహరించాడు. అందుచేత, అతని బాధ నాకు తెలుసు. కనుక నేను అతనికి సహాయం చేస్తున్నాను. అతని సహాయం కోరేను. నువ్వు శక్తిశాలివి అని తెలియక కాదు, మీ సోదరుడికి బాధ అంటే ఏమిటో తెలుసు. ఇదీ స్నేహమంటే” అని బదులిచ్చేరు రాముడు. వాలి చివరి వాదన కూడా వీగి పోయింది.
అప్పుడు మరొక వాదన ముందుంచాడు వాలి. “రామచంద్రా! చెట్టు వెనక నిలబడి బాణాన్ని ప్రయోగించడం నీకు ఉచితంగా అనిపించిందా? నా ఎదురుగా నిలబడి నన్నెందుకు సంహరించలేకపోయావు? నువ్వెందుకు దాక్కున్నావు? దీన్ని శౌర్యం అంటారా? ధైర్యం అంటారా? అని ప్రశ్నించాడు.
“ఇటు చూడు వాలీ! నీ తపస్సుకు మెచ్చి బ్రహ్మ నీకు ప్రసాదించిన ముత్యాల హారం నీ కంఠం చుట్టూ ఉందని నాకు తెలుసు. నువ్వు ఆ ముత్యాలహారం ధరించి ఉన్నంతసేపూ ఎవరూ నీ ఎదుట నిలబడి యుద్ధం చేయలేరని నాకు తెలుసు, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని గౌరవించాలనుకున్నాను. అందుచేత చెట్టు చాటున నిలబడి బాణ ప్రయోగం చెయ్యవలసి వచ్చింది. ఈ మాత్రం యుద్ధ ధర్మాన్ని గురించి నాకు తెలియదా?” అని రాముడు బదులిచ్చేడు.
వెంటనే సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వివిధ దిక్కులకు వానరులను పంపించేడు. చివరికి వారు సముద్ర తీరానికి చేరుకున్నారు. అప్పుడొక పెద్ద పక్షి గతించిన తన సోదరుడికి తర్పణం ఇచ్చేందుకు గెంతుతూ సముద్ర తీరానికి చేరుకుంది. అతడు జటాయువు సోదరుకు సంపాతి. సీత లంకలో అశోకవనంలో ఉందని అతడు సమాచారమిచ్చేరు. అప్పుడు వారికి అతిశక్తివంతమైన సముద్రాన్ని దాటవలసిన సమస్య ఎదురైంది. సముద్రం పై ఎగిరి ఇంకను చేరుకోడానికి. హనుమంతుడు అంగీకరించేడు. దారిలో అసంఖ్యాకమైన అద్దంకుల్ని అతడు ఎదుర్కున్నాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: హనుమంతుడు శారీరకంగా అతి బలవంతుడైనప్పటికీ అతడు తన శారీరక బలం గురించి ఎన్నడూ గర్వించలేదు. అతడు రామచంద్రప్రభువుకు సంపూర్ణ శరణాగతుడై తనకప్పగించిన సేవలో తనకు సహాయం అందించమని ప్రార్ధించేడు. సముద్రం దాటుతున్నప్పుడు ఎదురైన అన్ని అడ్డంకులను అధిగమించడానికి తన తెలివి తేటల్ని ఉపయోగించేడు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు : ప్రార్థన, శరణాగతి యొక్క విశిష్టత. చురుకుగా చేసే పని, కష్టపడి పనిచేయడం కంటే ముఖ్యమైనది. అందుచేత మనం బాగా ఆలోచించాలి. తగిన విధంగా ప్రణాళిక రచించాలి. మన పనులను అమలు చెయ్యాలి. మీ శారీరక శక్తిని దురుపయోగం చేసి ఇతరుల్ని గాయపరచకండి.