అయోధ్యకు పునరాగమనం
రాముడు, సీత మళ్ళీ కలుసుకున్నారు. వారి వనవాస సమయం చివరకు రావడంతో, అయోధ్యకు పునరాగమనానికి సమయం ఆసన్నమయింది. రాముడు వస్తాడని విని భరతుడు మహదానందంలో మునిగిపోయేడు. రాముని పునరాగమనానికి అన్ని ఏర్పాట్లూ చేయడానికి భరతుడు నందిగ్రామం నుండి అయోధ్యకు వచ్చేడు. జ్ఞానులు, గురువులు, ప్రముఖులైన పౌరులనూ సమీకరించి, ముగ్గురు రాణులు, శత్రుఘ్నని ప్రక్కనుంచుకుని భరతుడు రామునికి ఎదురు వెళ్ళేడు. తమ గౌరవపూర్వక విధేయతను తెలియజేస్తూ భరత, శత్రుఘ్నులు రామునికి సాష్టాంగ ప్రణామం చేసేరు. అయోధ్య నగరము అంతా ఆనందోత్సాహాలతో ఉప్పొంగిపోతోంది. వారు రాజభవనంలో ప్రవేశించగానే రాముని మహారాజ పట్టాభిషేకానికి తిధి, వార, నక్షత్ర, సమయాలను వశిష్టుడు ప్రకటించేడు. ఆ రోజున వశిష్ఠునికి, మిగిలిన జ్ఞానులకీ సాష్టాంగ ప్రణామాలు చేసి, తల్లులైన మహారాణులు ముగ్గురికీ పాదాభివందన చేసి మహారాణి సీత అనుసరించగా రాముడు సింహాసనాన్ని అలంకరించేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: రాముడు అయోధ్యలో ప్రవేశించే సరికి ఉత్సవం జరుగుతోంది. పండగ చైతన్యం, అలంకరణలు, అన్ని వైపులా ఆనందం. అలాగే మనం భగవంతుడిని మన హృదయాలలోనికి ఆహ్వానించినప్పుడు మనం మన హృదయాలని నిర్మలంగా, పరిశుద్ధంగా ఉంచి సంతోష పెట్టే విలువలతో, సద్గుణాలతో దాన్ని అలంకరించాలి.
గురువులు దీపావళి పండుగను ఈ సంఘటనతో జతపరచి “రాజ్యమంతటా దీపాలు వెలిగించి, అయోధ్యకు రాముని పునరాగమనాన్ని అయోధ్యనగర ప్రజలు ఎలా ఉత్సవంగా జరుపుకున్నారో చెప్పాలి. దీపాలు వెలిగించడంలో అంతరార్ధం, అది చెడు మీద మంచి విజయం /అజ్ఞానం మీద విజ్ఞానం విజయం. ఇది విద్యార్థుల వయస్సు మీద, గ్రహణ శక్తి మీద ఆధారపడి వివరించాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: మనలో ఉన్న మానవతా విలువలపట్ల ఎఱుక కలిగి ఉండాలి. ఆ విలువలని నిత్యజీవితంలో ఆచరణలో పెట్టడమే ఎడ్యుకేర్ యొక్క సారాంశము.
ఆ విధంగా సత్యనిరతి, ధర్మాచరణ గుర్తుగా రామరాజ్య కాలం ప్రారంభమయింది. ప్రజలకు శాంతి, సంతోషాలు ఫలితంగా లభించాయి.