యుద్ధ ప్రారంభం
రాముడు ప్రధాన నాయకులందరినీ పిలిచి, లంకా నగర నాలుగు ద్వారాలనీ ఎలా ముట్టడి చేసి అదుపులోకి తెచ్చుకోవాలో నిర్ణయించమని నియమించేడు. వానరరాజు సుగ్రీవుడు, భల్లూకరాజు జాంబవంతుడు, రాక్షసరాజు విభీషణుడు కలుసుకున్నారు. వారి సేనను సేనాధిపతులు, మార్గదర్శులు గల నాలుగు విభాగాలుగా విభజించేరు. అప్పుడు రాముని పాదాలపై పడి రాముని ఆశీస్సులతో దాడి చెయ్యడానికి ఆజ్ఞలు ఇచ్చేరు.
గురువులు బాలలకు బోధించవలసినవి: రాముడు ప్రతి బృందనాయకుడూ అనుసరించదగిన ఆదర్శ నాయకుడు. తాను అవతార పురుషుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి సమన్వితుడూ అయినా తన బృందంలో ఎవరినీ తక్కువగా అంచనా వేయలేదు. అదేకాక అతడు అందరినీ గుర్తించి, యుద్ధ ప్రణాళికను వారితో చర్చించి, వారి అభిప్రాయాలని తీసుకున్నాడు.
రాముడు ఓర్పుతో అందరి అభిప్రాయాలు విన్నాడు. భల్లూకాలని, వానరులని చిన్నచూపు చూడకుండా తన బృందంలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను గుర్తించి వారి వారి సామర్థ్యాన్ని అనుసరించి కీలకమైన పనులు ప్రతి ఒక్కరికి అప్పజెప్పాడు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: భూమిపై ప్రతి జీవీ శక్తియుక్తులు కలిగి ఉంటారు. అందుచేత ప్రకృతిలో, సృష్టిలో అన్నింటినీ గౌరవప్రదంగా ఆదరించాలి.
(గురువులు ఈ విషయాన్ని పిల్లలతో చర్చించే ముందు తమ విచక్షణ ఉపయోగించాలి. ఇది అర్థం చేసుకోడానికి పిల్లలు మరీ చిన్నవారైతే వారి వయస్సుకి తగిన ఉదాహరణలు ఉపయోగించుకోవచ్చు ).
వానరులు బండరాళ్ళు, చెట్లు మోసుకొచ్చేరు. వారి హృదయాల్లోనూ, నాలుకపైనా రామనామంతో లంకానగరంలోకి ప్రవేశించేరు. నలుని ఆధిపత్యంలో ఉన్న సేనలు తూర్పు ద్వారంపై తీవ్రంగా దాడి చేశారు. దక్షిణ ద్వారం అంగదుని ఆజ్ఞలో ఉంది. పశ్చిమ ద్వారం హనుమంతుని అధీనంలో ఉన్న సేన దాడికి కూలిపోయింది. లంకలో ఉత్తర నగరం రావణుడే స్వయంగా సంరక్షిస్తున్నాడు. రాముడు అతనితో యుద్ధం చేసేడు. వానరులు అవిశ్రాంతంగా యుద్ధంచేసి ఎప్పుడూ విజయులమే అని ఋజువు చేసుకున్నారు. చీకటి పడేసరికి రాక్షసుల బలము, కోపావేశమూ పెరిగింది. అప్పుడు రాముడు అగ్నేయాస్త్రాన్ని, అగ్ని బాణాన్ని, ఒరలోంచి బయటకు తీశాడు. చీకటిలోకి అస్త్రాన్ని సంధించి వదిలాడు. ఆ ప్రాంతమంతా కాంతితో నిండిపోయింది. వానరులూ, భల్లూకాలూ రెట్టింపు శక్తితో, ఉత్సాహంతో శత్రువుల్ని ముంచివేసి, నాశనం చేశారు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
శక్తివంతులయిన రాక్షసులతో పోలిస్తే వానరులు బలహీనులు. అయినప్పటికీ వారు శత్రువులను నాశనం చేయగలిగేరు. కేవలం ప్రార్థన, నామస్మరణ, శరణాగతి ద్వారా.
మనం కూడా మనపై సంపూర్ణ విశ్వాసమూ, భగవంతుని పై విశ్వాసమూ ఉంటే జీవితంలో ఎటువంటి సవాలునైనా ఎదుర్కొని విజయం సాధించగలం. అయితే విజయం సాధించడానికి మనం అత్యుత్తమ కృషి చెయ్యాలి కూడా.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: గుండెల్లో దేవుడు – హస్తంలో పని.
(భగవన్నామాన్ని స్మరిస్తూ, భూమి మీద మనకు ఆదేశించిన విధులని మనం నిర్వర్తించాలి).
సంపూర్ణ కృషియే సంపూర్ణ విజయం.