అహమాత్మా – వివరణ
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యంచ భూతానామన్త ఏవచ ||
విభూతి యోగము (10-20)
శ్రీకృష్ణుడు అర్జునునితో ఇంకా ఇలా చెప్తున్నాడు.
ఓ అర్జునా! “సమస్త ప్రాణుల హృదయాలలో వెలసిన ఆత్మను నేనే.
నేనే సృష్టికర్తను, మరియు సమస్త జీవరాశుల పోషకుడిని, జీవుల లయమును కూడా నేనే. అనగా సమస్త జీవులు నాచే పుట్టి, నాచేతనే పోషించబడి చివరకు నాలో కలిసిపోతున్నాయి. నేను సమస్త ప్రాణుల హృదయాలలో వెలసి యున్నాను. అది కేవలం భౌతిక హృదయం కాదు, జీవులలోని దివ్య హృదయ మందిరము అని అర్థము” అని వివరించాడు.
కృష్ణుడు అర్జునుడిని ‘గుడాకేశ’ అని సంబోధించాడు. గుడక + ఈశ అనగా “నిద్రను జయించినవాడు, ఇంద్రియములను జయించిన వాడు” అని అర్థం. అనగా అర్జునుడు ‘అజ్ఞానము’ అనే నిద్రను అధిగమించాడని, భగవంతుని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని అర్థము.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా చెప్పారు :-
భగవంతుడు సమస్త ప్రాణుల హృదయాలలోని ఆత్మస్వరూపము . భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం అనే పంచభూతాలు కూడా ఆయన స్వరూపాలే. సూక్ష్మమైన అణువు నుంచి స్థూలము వరకు అన్నీ ఆయనే. సృష్టిలో భగవంతుడు లేని వస్తువు లేదు. అయన పేరు కానిది ఏదీ లేదు. అందరికీ తల్లి మరియు తండ్రి ఆయనే. సమస్తము ఆయన నుండి ఉద్భవించి, ఆయనలోనే వుండి చివరికి ఆయనలోనే లయమవుతున్నవి.
భగవంతుడు ప్రతి ఒక్కరిలో అంతర్యామిగా వున్నందువలననే కళ్ళు చూడగల్గుతున్నాయి. చెవులు వినగలుగుతున్నాయి, ముక్కు వాసన చూడటం, నాలుకకు రుచి చూడటం మరియు చర్మానికి అనుభూతి కలగటం జరుగుతున్నది.
కాళ్ళకు, చేతులకు, కదిలే శక్తిని ఇచ్చినది ఆయనే. మాట్లాడటం, అనుభూతి చెందటం, ఆలోచించి అర్థం చేసుకునే శక్తిని కల్గి యుండటం అంతా ఆయన ప్రసాదించినదే. మానవ శరీరంలోని శ్వాసక్రియ, రక్తప్రసరణ, జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థలను పనిచేసేలా చేసేది ఆయనే.
దేవుని నిజమైన చిరునామా ఏమిటి? అన్న ప్రశ్నకు బాబా వారు ఇలా చెప్పారు:-
“మానవులు నిర్మించిన దేవాలయములు భగవంతుని శాశ్వత నివాసములు కావు. అవి ఆయన సంరక్షణాలయములు మాత్రమే”. భగవంతుడు సృష్టిలో అణువణువూ తానే అయివున్నాడు.
భగవంతుడు సమస్త జీవురాశులలో నివసిస్తున్నాడని తెలియజేయు కథ:-
ఒకరోజు షిరిడీలో తర్ఖడ్ ఇంట్లో మధ్యాహ్నం అందరూ భోజన చేస్తుండగా, ఒక కుక్క వచ్చి ఆకలితో అరవసాగింది. అది చూచి శ్రీమతి తర్ఖడ్ లేచి దానికి చపాతీ ఇవ్వగా, దానిని ఆ కుక్క చాలా ఇష్టంగా తిన్నది.
మధ్యాహ్నం ఆమె ద్వారకామాయి వెళ్లగా బాబా ఆమెతో “అమ్మా! ఈరోజు నీవు నాకు ఎంతో ప్రేమతో ఆహారాన్ని ఇచ్చి సంతృప్తి పరిచావు. ఇలాగే ఎల్లప్పుడు ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇవ్వు అన్నారు. బాబా ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు బాబా, “నువ్వు రొట్టె ముక్కను ఇచ్చిన కుక్క ఎవరోకాదు నేనే. నేను అన్ని ప్రాణులలో వున్నాను. ఈ జీవులన్నింటిలో నన్ను చూసేవాడే నాకు ప్రియమైనవాడు. కాబట్టి ద్వంద్వ భావాన్ని విడిచిపెట్టి, ఈ రోజులాగే అన్ని ప్రాణులను సేవించు. అప్పుడు నన్ను సేవించినట్లే అన్నారు.