అలగి
రాజరాజచోళుడు దక్షిణ దేశంలో క్రీ. శ. 985-1014 వరకు రాజ్యం ఏలాడు. దక్షిణ దేశం పూర్తిగా, సింహళి దేశం ఆయన అధీనంలో ఉండేవి. ఆయనకు గొప్ప నౌకా బలం కూడా ఉండేది. ఈనాడు మలేషియా అని పిలువబడే దేశము, ఇండోనేషియా, బర్మాలో కొంత భాగము చోళ రాజ పరిపాలన క్రింద ఉండేవి. అంత గొప్పవాడు అయినప్పటికీ అతను భగవంతుని ఎడల వినయంతో ఉండేవాడు.
రాజరాజు ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించాడు. ఈ దేవాలయ నిర్మాణం క్రీ.శ. 1003 లో ప్రారంభమై 1009 లో ముగిసింది. ఇది ఈనాటికి చోళరాజుల వైభవానికి, భక్తి ప్రపత్తులకు చిహ్నంగా నిలిచిఉంది. వేలకొలది దేశ, విదేశ యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శించి ఆనందిస్తునారు. ఈ దేవాలయ నిర్మాణాన్ని గురించి ప్రసిద్ధి కెక్కిన కథ ఒకటుంది.
అలగి (అందమైన యువతి అని అర్ధం) అనే వృద్ధురాలు, ఆ నగరంలో నివసించేది. ఆమె మహా భక్తురాలు. కాని తన భక్తికి మెచ్చి దేవుడు ఏదో ఇవ్వాలని ఆశించేది కాదు. తనకు దేవుని అనుగ్రహాన్ని పొందడానికి అర్హత లేదని భావించేది. ఆమె తోటివారిని ఎంతో ప్రేమించేది. ప్రజలందరూ భగవంతుని బిడ్డలేనని ఏ ఒక్కరికి సేవ చేసినా దేవునికే చెందుతుందని ఆమె దృఢ విశ్వాసము.
రాజరాజచోళుడు ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మాణం నిర్మిస్తున్నాడని ఆమె విన్నది. ప్రతిరోజు నిర్మాణం జరిగే చోటికి వెళ్ళి శ్రద్ధగా అక్కడ జరిగే పనులన్నీ గమనిస్తూ ఉండేది. వడ్రంగులు, తాపీ పనివారు, మేస్త్రీలు, కూలీలు చేసే పని చూస్తూ తనకు కూడా అటువంటి పనులు చేసే భాగ్యం దక్కలేదే అని చింతిస్తూ ఉండేది. ఆమె ముసలిది కావ డంతో ఆమెకు ఎవ్వరూ ఏ పనీ ఇవ్వలేదు. కాని ఆమె మాత్రం ఏ విధంగా ఈ పనిలో సహాయ పడదామా అని తీవ్రంగా ఆలోచించేది.
రోజూ మూడు పూటలా వారి పని గమనిస్తున్నందు వల్ల అలగికి ఒక విషయం తెలిసింది. కూలిపనివారు మధ్యాహ్నం ఎండలో పనిచేసి అలసిపోయేవారు. అటువంటి సమయంలో వారి దాహం తీరిస్తే బాగుంటుంది అనుకుంది. ఆ రోజునుండి ప్రతి దినము కొన్ని కుండలనిండా నీరు, మజ్జిగ తెచ్చి, దానిలో నిమ్మకాయ పిండి, కరేపాకు, అల్లం వేసి అలసిపోయిన కూలీలకు ఇచ్చి దాహం తీర్చేది. వారు ఎంతో ఆప్యాయతతో ఆమె అందించిన మజ్జిగ త్రాగి సేద తీర్చుకునేవారు. ఆ తర్వాత పని మరింత చురుకుగా సాగేది.
ఈ సేవ ఆమె చాలా రోజులు చేసింది. చివరికు నిర్మాణం పూర్తయే సమయం వచ్చింది. విమానము (అనగా గర్భగుడి పై కట్టే శిఖరము) పూర్తి కావస్తూంది. అప్పుడు అలగికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే వెళ్ళి అక్కడి మేస్త్రీలు కూలీలతో ఈ విధంగా చెప్పింది,
“నాదొక చిన్న కోరిక ఉంది. మీరు తీర్చగలరని అనుకుంటాను”.
“అవ్వా! నీవు మాకు చేసినదానికి మేము ఎంతో ఋణపడి ఉన్నాము. నీవు ఏది అడిగినా తీర్చగలము”.
“మా ఇంటి దగ్గర ఒక పెద్ద రాయి ఉంది. అక్కడ దానికి ఉపయోగం లేదు. ఈ ‘విమానం’లో ‘మధ్యరాయి’గా అది ఉపయోగపడ్తుందని నా నమ్మకము. అది మీరు తెచ్చి ఉపయోగిస్తే నా మనస్సుకు హాయిగా ఉంటుంది”.
“వెంటనే తెస్తాము” అని మేస్త్రీ హామీ ఇచ్చాడు. ఆ విధంగానే ఆ శిలను ఆ రోజే తెచ్చి తగిన విధంగా చెక్కి, ‘విమానం’లో బిగించారు.నిర్మాణం పూర్తయింది.
రాజపురోహితులు విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించారు. రాజు ముందు రోజు పూర్తయిన దేవాలయ నిర్మాణాన్ని స్వయంగా పరీక్ష చేశారు. అటువంటి గొప్ప కార్యక్రమము చక్కగా జరిగినందుకు, పని సక్రమంగా పూర్తయినందుకు ఆయన చాలా సంతోషించాడు. అటువంటి కార్యక్రమము తన ద్వారా జరిగినందుకు సహజంగానే కొంత గర్వపడ్డాడు. ఆ దేవాలయానికి అప్పటికే ‘బృహదీశ్వరాలయం’అని పేరు వచ్చింది.
ఆ మరుసటిరోజు ముహూర్తానికి అన్ని ఏర్పాట్లు చేసి రాజుగారు తన భవనానికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆయన పరమేశ్వరుడు కనుపించి, “రాజా ఈ పెద్ద దేవాలయంలో వృద్ధురాలు అలగి ఏర్పాటు చేసిన స్థానంలో మా విగ్రహాలు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది”.
రాజుగారికి తటాలున మెలకువ వచ్చింది, కలలో విన్న మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతున్నాయి. “ఒక వృద్ధురాలు ఏర్పాటు చేసిన విమానమా ఇది? ఈ దేవాలయం కట్టించింది నేను గాదా? స్థలం ఎన్నుకోడం నిర్మాణ వ్యూహం నిర్ణయించడం, ధనం వెచ్చించడం, పని చేయించడం తాను గాదా చేసింది? మరెవ్వరికి ఇందులో స్థానం లేదు. అసలు ఈ ముసలిది ఎవరు? ఆమెకు దీనితో ఎటువంటి ప్రమేయం లేదు. కాని భగవంతుడే స్వయంగా అంటున్నాడు కాబట్టి అందులో సత్యం ఉంటుంది”. ఈ విధంగా ఆలోచనలతో తెల్లవారింది.
ఉదయాన్నే హుటాహుటి దేవాలయం ఉన్న చోటుకు వెళ్ళి వృద్ధురాలు ఎక్కడుందో అని వెతికించాడు. కాని ఎవరికి కనుపించలేదు. ఆమె ఎక్కడున్నా వెతికి తీసుకొని రమ్మని మంత్రులను నియోగించాడు. కొద్దికొద్దిగా అలగి విషయం బయట పడింది. ఒక ముసలిది కూలీలకు మజ్జిగ ఇవ్వడం, వాళ్ళు ఆమె ఇంటినుండి ఒక శిల తేవడం, విమానంలో బిగించడం, ఇవన్నీ తెలిశాయి రాజుకు.
రాజుకు జ్ఞానోదయం అయింది. ఆ వృద్ధురాలు చేసిన నిస్వార్థమైన సేవ చూడడానికి చిన్నదైనా, దేవాలయంలో దేవతా విగ్రహాలకు రక్షణ ఇచ్చే శిలను పెట్టించే అదృష్టం ఆమెకు కలిగింది. అంటే భగవంతుడు ఆ వృద్ధురాలి రక్షణ క్రిందే ఉండడానికి అంగీకరించాడు.
రాజు స్వయంగా అలగి గుడిసెకు వెళ్ళి సగౌరవంగా ఆమెను తీసుకొని వచ్చి దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభించాడు.
ఆ వృద్ధురాలు అలగి కూడా ఎంతో నమ్రతతో భగవంతుడు తన సేవలను గుర్తించినందుకు పొంగిపోయి తన శేష జీవితాన్ని దేవాలయం వద్దనే సామాన్య ప్రజలకు సేవ చేస్తూ గడిపింది. అలగి కథను విన్న ప్రజలందరు ఆమె భక్తికి, నిస్వార్థ ప్రేమకు ఆశ్చర్యపోయారు. తమిళ జానపద గాధల్లో ఆమె చరిత్ర చోటు చేసుకుంది. ఆమె నివసించిన గుడిసె ప్రక్కగా ఒక ఉద్యానవనం ‘అలగి వనం’ అనే పేరుతో
వెలసింది. ఎదురుగా ‘అలగి కొలను’ అని కోనేరు త్రవ్వించారు. ఆనాడు 11 వ శతాబ్దంలో ఆమె గుడిసె వుండిన ఒక స్థలంలో 20 వ శతాబ్దంలో ఆ పట్టణ పురపాలక సంఘ కార్యాలయం కట్టించారు.
ప్రశ్నలు
- అలగి ఎవరు?
- ఆమె దేవాలయ నిర్మాణంలో ఎలా సాయపడింది?
- అలగి ఏమి కోరిక కోరింది?
- రాజుకు శివుడు కలలో కనిపించి ఏమి చెప్పాడు?
- రాజు అలగి కధ నుండి ఏమి పాఠం నేర్చుకున్నాడు?