మానవసేవయే – మాధవసేవ
మార్టిన్ అనే చెప్పులు కుట్టేవాడు బైబిలును గుండె మీద ఉంచుకొని, క్రీస్తు చెప్పిన మాటలను ఎప్పుడూ తలచుకుంటూ నిద్రకు ఉపక్రమించేవాడు.
“వినండి! నేను మీ ఇంటి వద్ద నిలిచి తలుపు తట్టుతాను, ఎవరైతే నా గొంతు విని తలుపు తెరుస్తారో వారింట్లోకి వచ్చి వారితో కూడా కలిసి భోజనం చేస్తాను. పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద నా ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాను.”
ఈ మాటలను తలుచుకుంటూ నిద్రపోయిన మార్టిన్ కు కలలో జీససు కనుపించి “నేను రేపు మీ ఇంటికి వస్తాను” అన్నాడు. మార్టిన్ వెంటనే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, ఇద్దరికి సరిపడ రొట్టెలు, తేనీరు తయారు చేసి ఎదురు చూస్తున్నాడు. ఇంకా మంచుకురుస్తూనే ఉంది. బాగా తెల్లవార లేదు. మొట్టమొదట అతనికి కనుపించినవాడు వీధులు ఊడ్చేవాడు. తెల్లవారేలోగా అందరి ఇళ్ళముందు గడ్డ
కట్టిన మంచును తీసివేసి ఆ ఇంటివాళ్ళకు వెచ్చదనం కలిగించే వాడు. మార్టిన్ అనుకున్నాడు “పాపం ఈ ముసలివాడు తాను మంచులో వణుకుతూ, ఇతరులకు వెచ్చదనం కలిగిస్తున్నాడు. కానీ ఇతని సేవలు అందుకుంటున్న వారు ఇళ్ళలో హాయిగా నిప్పు సెగ ప్రక్కన కూర్చొని ఉంటున్నారు. ఇతడేమో బయట మంచులో గడగడ వణుకుతున్నాడు పాపం!”
మార్టిన్ ఆ వృద్ధుణ్ణి పిలిచి తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమన్నాడు. ఒక కప్పు తేనీరు ఇచ్చాడు. ఆ ముసలివాడు తేనీరు త్రాగి కృతజ్ఞత చెప్పుకొని వెళ్ళిపోయాడు.
తర్వాత వచ్చింది ఒక వృద్ధురాలు. ఆమె ముసలితనంతో నడవలేక పడిపోయేటట్లు ఉంది. మార్టిన్ ఆమెను లోనికి పిలిచి తనకోసం ఉంచుకొన్న రొట్టెను ఇచ్చి, కప్పు కోడానికి వెచ్చని ఉన్నిదుప్పటి ఇచ్చాడు. ఆమె అతన్ని దీవించి వెళ్ళిపోయింది.
తర్వాత కొంత సేపటికి ఒక తల్లి పసిపాపతో వచ్చింది. పాప ఆకలితో ఏడుస్తున్నది. మార్టిన్ ఆమెను పిలిచి, ప్రభువు కోసం ఉంచిన పాలను ఆ బిడ్డకు ఇచ్చాడు. ఆ తల్లికి చనిపోయిన తన భార్య దుస్తులు ఇచ్చాడు. ఆమె కృతజ్ఞత తో
వెళ్ళిపోయింది.
ఇప్పుడు దాదాపు చీకటి పడింది. ప్రభువు తన ఇంటికి ఇంత ప్రొద్దుపోయి వస్తాడా! అనుకున్నాడు మార్టిన్. ప్రభువు రాలేదే! ఆని నిరాశగా ఉంది. ఒకవేళ ప్రభువు ఇప్పుడు వస్తే ఆయనకు ఇవ్వడానికి ఏమీలేవే? అని దిగులుగా కూర్చున్నాడు.
రాత్రి ప్రొద్దుపోయిన తర్వాత వీధిలో అలికిడి అయింది. ద్వారం వద్ద ఒక వింత తేజస్సు గోచరించింది. ఆ కాంతిలో మొదట వీధులు ఉడ్చే ముసలివాడు, తర్వాత వృద్ధురాలు, ఆ తర్వాత పసిబిడ్డ తల్లి వరుసగా కనుపించి అతన్ని ఆశీర్వదించి వెళుతున్నారు. మార్టిన్ కు అర్థం అయింది. దేవుడు మరెవరు? వీళ్ళే దేవుని స్వరూపాలు, నేనే వచ్చానని ఈ విధంగా తెలియజేశాడు.
ప్రశ్నలు:
- మార్టిన్ ఎలాంటి వాడు?
- మార్టిన్ కు వచ్చిన కల ఏమిటీ?
- దేవుని అతడు ఏ రూపంలో చూడగలిగాడు.
- మునిసిపల్ కార్మికునికి మార్టిన్ ఏమి సహాయం చేసాడు?
- ఈ కథ నుండి నీవు గ్రహించిన నీతి ఏమి?