పశ్యమే పార్థ – వివరణ
పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః |
నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీనిచ ||
విశ్వరూప సందర్శన యోగము (11-5)
అర్జునుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కృష్ణ పరమాత్మను తన విశ్వ రూపాన్ని చూపమని ప్రార్థించగా, అతని ఆర్తిని తెలుసుకున్న శ్రీకృష్ణుడు, “అర్జునా! నా విశ్వరూపము నీ భౌతిక నేత్రాలతో దర్శించజాలవు. కాన నేను దివ్య దృష్టిని నీకు ప్రసాదించుచున్నాను అంటూ అర్జునకు దివ్య దృష్టి నొసంగెను”.
ఆ దివ్యదృష్టి చేత అర్జునుడు పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని (విశ్వరూపాన్ని) సందర్శించ గలిగాడు.
అర్జునుడు ఆ పరమాత్మ లో సమస్త విశ్వాన్ని చూశాడు. సూర్య చంద్రాదులను, దిక్కులను, పంచభూతములను (భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం) చూశాడు. ఇంకనూ సమస్త దేవతలను, ఋషులను, సాధువులను మరియు చరాచర ప్రాణి కోట్ల సమూహములను చూసాడు.
ఈ విశ్వమంతా పరమాత్మ ద్వారా వ్యాపించి ఉంది. ప్రతి వస్తువు పరమాత్మలో భాగమే. ఈ అసంఖ్యాక రూపాలతో,వర్ణాలతో కూడిన ఈ విశ్వమంతా ఆ ‘విశ్వ విరాట్ మూర్తి’ యందు లీనమై యున్నవి. భగవంతుడు ఈ విశ్వంలో అణువణువు విస్తరించి ఉన్నాడు.
హోవార్డ్ మర్ఫెట్ రచించిన “మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్” అను గ్రంథములో భగవంతుడు అణువణువూ వ్యాపించి ఉన్నాడు అన్న ఉదంతాన్ని వివరించారు. అది ఏమనగా…
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన భూగర్భ శాఖాధిపతి డాక్టర్ వై. జనార్దన్ రావుగారు పుట్టపర్తి వెళ్ళినప్పుడు బాబా ఒక నల్లటి రాయిని తీసి ‘ఇందులో ఏముందో చెప్పు’ అన్నారు. ఆ రాయి లో ఉన్న ఖనిజాలను గురించి పేర్కొన్నారు. బాబా అవి కాదు అంటూ ‘ఇంకా ముఖ్యమైనవి ఏమైనా వున్నాయా’ అని అడిగారు.
అప్పుడు ఆయన స్వామితో ‘అణువులు, పరమాణువులు’ ఉన్నాయి అన్నారు.
కాదు కాదు, ‘ఇంకా ముఖ్యమైనవి ఏమైనా ఉన్నాయా?’అని అడిగారు.
డాక్టర్ రావు గారు ‘నాకు తెలియదు స్వామి’ అన్నారు. అప్పుడు స్వామి ఆ రాతి ముక్కను చేతిలోనికి తీసుకొని ‘ఉఫ్’ అంటూ వూది ఆ రాతిని తను రావుగారి చేతికి అందించారు. ఆ రాతికి వేణువు ఊదుతున్న శ్రీకృష్ణ పరమాత్మ రూపం వచ్చింది. దాని రంగులో, నిర్మాణంలో మార్పు కనబడింది. “మీ శాస్త్రజ్ఞులకు తెలిసిన అణువులు పరమాణువుల కంటే ప్రధానమైన దివ్యత్వం అందులో ఉంది. దివ్యత్వం అత్యంత మధురమైనది”.
“ఈ బొమ్మ కాలు త్రుంచి నోట్లో వేసుకుని చూడు” అన్నారు బాబా. వెంటనే ఆ రాయి చక్కెర బొమ్మగా మారిపోయింది. చాలా సులువుగా తునిగింది. రుచి చూస్తే పటిక బెల్లం లాగా తియ్యగా ఉంది.
ఈ సన్నివేశము ద్వారా విజ్ఞాన శాస్త్రానికి అతీతమైనటువంటి మరియు మాటలకు అందనటువంటి పరమార్థం పదార్థంలో ఉంది అన్న సత్యాన్ని భూగర్భ శాస్త్రవేత్త డాక్టర్. వై. జనార్దన్ రావు గారు గ్రహించారు.