భగవంతుని సర్వవ్యాపకత్వము
ఒకప్పుడు ఉద్దాలక అరుణిమహర్షి తన పుత్రుడు శ్వేతకేతునికి బ్రహ్మజ్ఞానము బోధించ దలిచాడు. ఎదురుగా ఉన్న ఒక మఱ్ఱి చెట్టును చూపించి ఆ చెట్టునుండి ఒక పండును తెమ్మన్నాడు. శ్వేతకేతు పండు తెచ్చాడు.
తండ్రి: “ఆ పండును రెండుగా చేయి.”
“ఇదిగో చేశాను”
“ఇప్పుడు నీవేమి చూస్తున్నావు?”
“ఇందులో లెక్కలేనన్ని విత్తనాలు ఉన్నాయి.”
“ఆ విత్తనం ఒకటి తీసుకొని దాన్ని విరిచి చూడు.”
“ఇదుగో ఒక విత్తనం విరిచాను.”
“అందులో ఏమి చూస్తున్నావు?’
“నాకేమి కనపడడం లేదు.”
“నాయనా ఏమీ కనపడటం లేదా? ఈ చెట్టు ఎక్కడి నుండో వూడిపడదు అని తెలుసుకదా? ఏదో ఒక విత్తనం నుండి వస్తుంది. విత్తనాలలో స్థూలదృష్టికి ఏమీ కనపడదు. కాని ఇంత చిన్న విత్తనంలో కూడా ఒక అతి సూక్ష్మ పదార్థం ఉంది. అదే ప్రతి వృక్షానికి మూలం. ఇదే భగవత్ శక్తి. అది లేనిచోటు ఉండదు. కంటికి కనుపించదు. విశ్వాసంతో గ్రహించడానికి ప్రయత్నించు. అదే సకల సృష్టికి మూలము. అదే నీవు, నీవే అది. తత్వమసి”
“తండ్రిగారూ! ఇదంతా నాకు అయోమయంగా ఉంది. నాకు తెలుస్తున్నది కాని అవగాహన కావడం లేదు.”
“సరే! మరొక రకంగా చెప్తాను. రాత్రి నిద్రపోయే ముందు ఒక పాత్రలో నీరు పోసి అందులో కొన్ని ఉప్పు రాళ్ళు వేసి ఉంచు. ఉదయాన్నే ఆ పాత్ర నా దగ్గరికి తీసుకొని రా.”
తండ్రి ఆదేశం ప్రకారం శ్వేతకేతు ఉదయాన్నే ఉప్పు నీటి పాత్రను తండ్రివద్దకు తీసుకొని వెళ్ళాడు.
తండ్రి “నాయనా, ఆ నీటిలో ఉండే ఉప్పును తీసి చూపించు.”
శ్వేతకేతుకు అర్థం కాలేదు. “తండ్రిగారూ! మీరు అనేది ఏమిటి? ఆ నీటిలో కరిగిన ఉప్పును ఎలా తీయడం?”
“సరే! ఆ నీటిని కొంచెం రుచి చూడు.”
“ఆ! రుచి చూచాను, ఉప్పగా ఉంది.”
“ఇంకా పాత్ర అడుగునున్న నీటినిగూడా రుచిచూడు.”
“రుచి చూచాను, అదీ ఉప్పగానే ఉంది.”
“నాయనా! చూచావా! ఇదీ రహస్యము. ప్రతిచోటా వ్యాపించి ఉండే ఆ భగవతత్త్వమంటే ఇదే. ఈ నీటిలో ప్రతి అణువులో ఉప్పు ఏవిధంగా అంతర్లీనంగా ఉందో అదే విధంగా భగవంతుడు స్థూలంగా కనుపించక సూక్ష్మంగా ఉన్నాడు.
“తండ్రిగారూ ! అర్ధమయినట్లే ఉంది. కాని ఇది గ్రహించడం అంత సులభం కాదు.”
ఉద్దాలకుడు “అయితే ఈ బ్రహ్మతత్త్వాన్ని అవగాహన చేసుకునే మార్గం చెప్తాను విను. ఒక వ్యక్తికి కళ్ళకు గంతలు కట్టి అరణ్యం మధ్యకు తీసుకొని వెళ్ళి అక్కడ విడిచాము అనుకో. మొదట అతడు ఏమి చేస్తాడు? తన ఇంటికి తిరిగి ఎలా వస్తాడు? మొదట తన కళ్ళకు కట్టిన గంతను విప్పుకుంటాడు. ఇక్కడా అక్కడా తన ఇల్లు ఉండే ప్రాంతానికి ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్తాడు. చివరకు తన గ్రామానికి దారి చూపే ఎవరి నైనా కలుసుకుంటాడు. ఆ విధంగా తన ఇంటికి చేరుకుంటాడు. ఈ విధంగానే మనము ఆధ్యాత్మిక మార్గాన్ని వెతుక్కుంటూ, ఎక్కడినుంచి మనమందరము వచ్చామో ఆ బ్రహ్మతత్త్వాన్ని చేరుకోడానికి ప్రయత్నిస్తాము. శ్వేతకేతూ! “తత్త్వమసి!”
ఈ కథ ఛాందోగ్యోపనిషత్తు లోనిది.
ప్రశ్నలు:
- ఉద్దాలకుడు శ్వేతకేతునికి దేనిని బోధించుటకు ప్రయత్నించెను?
- ఉప్పు నీటి ఉదాహరణ ద్వారా బ్రహ్మతత్త్వాన్ని ఎట్లు నిరూపించెను?
- భగవంతుని మార్గము ఎటువంటిది?
- శ్వేతకేతుకు భగవంతుడు సర్వ వ్యాపి అని ఉద్దాలకుడు ఎలా బోధించాడు?