భగవదనుగ్రహానికి సత్యమే మార్గము
ఈనాడు సేవ అంటే ప్రతివారు మాటల్లో గొప్పగా వర్ణిస్తారు, పొగుడుతారు. కానీ ఆచరణలో శూన్యం. శుష్క వచనాలతో భగవంతుని మభ్య పెట్టలేము. ఆయనకు అంతా తెలుసు.
ఒక శివరాత్రి పర్వదినం నాడు పార్వతీపరమేశ్వరులు వారణాసి కాశీ నగరం మీదుగా ఆకాశంలో విహరిస్తున్నారు. కాశీ నగరమంతా భక్తులతో కోలాహలంగా ఉంది. నదీ స్నాన ఘట్టాలవద్ద, ఇరుకు వీధుల్లో, ఎక్కడ చూచినా భక్తులే. విశ్వేశ్వరుని మందిర ప్రాంగణమంతా “శివా! మహా దేవా! శంకరా!” అని అరిచే భక్తులతో కిటకిటలాడుతూంది.
పార్వతీ దేవి, శంకరునితో “నాధా చూస్తున్నావుగదా! ఈ భక్తులకంతా తప్పక స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. చూచారా ఎటువంటి భక్తితో పరవశమయిపోతున్నారో! వీరందరికి స్వర్గంలో చోటు చాలుతుందా? అని నాకు అనిపిస్తుంది” అనింది.
శంకరుడు చిరునవ్వు నవ్వి, “దేవీ! శివరాత్రినాడు కాశీకి వచ్చి ‘శివ శివా!’ అన్న ప్రతివాడు స్వర్గం పొందగలిగితే కాశీయే స్వర్గం అవుతుందిగదా? వీరంతా బాహ్యంగా భక్తిని ప్రకటిస్తున్నారు. అంతరంగంలో వీరిలో ఎంతమంది నిజమైన భక్తులో చెప్పలేము. పరులధనం దొంగిలించి ఆ డబ్బుతో కాశీకి వచ్చిన దొంగ కూడా భక్తుడేనా? పవిత్రత, ప్రేమ, సత్యము ఇవే స్వర్గ ద్వారాలను తెరిపిస్తాయి. వారిలో నిజమైన భక్తులు ఎవరో నీకు నిరూపిస్తాను. ఒక చిన్న నాటకం ఆడుదాము”.
విశ్వేశ్వరుని మందిరానికి వెళ్ళే ఒక ఇరుకు సందులో ఒక వృద్ధుడు, తన ఇల్లా లైన ఒక వృద్ధ వనిత ఒళ్ళో తల పెట్టి పడుకొని మూలుగుతున్నాడు. నాలికను ‘దాహం’ అని తెలిసేటట్లుగా చప్పరిస్తున్నాడు. ముసలి స్త్రీ “అమ్మా! అయ్యా! ముసలి ఆయన గొంతు దాహంతో ఎండి పోతూంది. ఎవరైనా గ్రుక్కెడు నీళ్ళు పోయండి” అని ఆక్రోశిస్తూంది. కొన్ని వేలమంది గంగాజలం నిండిన పాత్రలతో హడావిడిగా మందిరంలోకి వెళుతున్నారు, వస్తున్నారు. ఏ ఒక్కడూ ముసలి వారి గోడు వినిపించుకోలేదు. పైగా కొందరు ముసలిదాన్ని విసుక్కుంటున్నారు. అక్కడనుండి వెళ్ళిపొమ్మని అదలిస్తున్నారు. కొంతమంది ముందు ఈశ్వరునికి అభిషేకం చేసి తర్వాత మీ సంగతి చూస్తాం అంటున్నారు. ఇంకా కొందరు
ఇటువంటి భిక్షగాళ్ళను పవిత్రమయిన దేవాలయాల వద్దకు రానీయకూడదు అని అంటున్నారు. ఒకరిద్దరు “ఆహా ముసలామె బ్రహ్మాండంగా నాటకం ఆడుతూంది నాలుగు డబ్బుల కోసం” అన్నారు.
చివరకు ఒక వ్యక్తి ఆ ముసలి దంపతుల వద్ద నిలిచి తనవద్ద నున్న నీళ్ళ సంచితీసి వృద్ధుడి నోట్లో నీళ్ళు పోయడానికి ఉపక్రమించాడు. కాని వృద్ధ స్త్రీ అతన్ని వారించింది. “ఆగు నాయనా? నీ వెవరు? నీవు నీ జీవితంలో ఏదయినా ఒక మంచి పని చేసి ఉంటే నీవిచ్చే ఆ నీరు నా భర్త స్వీకరిస్తాడు, లేకపోతే త్రాగడు. నీవు చేసిన మంచి పనితో వచ్చిన పుణ్యం ఇతనికి నీ నీటితో అర్పించు” అన్నది.
ఆ వ్యక్తి ఒక దొంగ. “అమ్మా! నేను ఒక కఱకు దొంగను. ఇప్పటివరకు ఏనాడు ఒక మంచి పని చేయలేదు. కాని ఈ వృద్ధుడి స్థితి నా హృదయాన్ని కదిలించింది. ఆ విశ్వేశ్వరుడే సాక్షి, మనస్ఫూర్తిగా ఈనాడైనా ఒక మంచి పని చేయదలుచుకున్నాను” అని అంటూ వృద్ధుడి నొట్లో నీరు పోశాడు. వెంటనే ఆ వృద్ధ దంపతులు పార్వతీ పరమేశ్వరులుగా తమ నిజరూపంలో కనుపించి ఆ వ్యక్తిని దీవించారు.
ఆనాడు కాశీ నగరంలో చేరిన లక్షల జనంలో ఆ దొంగ మాత్రమే స్వర్గానికి అర్హుడని పరమేశ్వరుడు నిరూపించాడు. అతని సత్యము, ప్రేమ భగవదనుగ్రహ ప్రాప్తిని చేకూర్చాయి.
ప్రశ్నలు
- పార్వతీ దేవికి కలిగిన సందేహమేమి?
- పార్వతీ పరమేశ్వరులు మానవుల భక్తిని ఎట్లు పరీక్షించారు?
- ఆ దొంగ మాత్రమే భగవదనుగ్రహానికి ఎట్లు పాత్రుడు?
- దొంగ ఏమి చేసాడు?