యదా యదా హి – వివరణ
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |
అభ్యుద్ధాన మధర్మస్య తదాత్మానం ససృజామ్యహం ||
జ్ఞాన యోగము (4-7)
“ధర్మము” ఎంత శ్రేష్ఠమైనదో మనకు ఈ వాక్యముల ద్వారా భగవానుడు తెలుపుచున్నాడు. అంతే కాదు ధర్మ ప్రతిష్టాపన కొరకై తాను అవతారిస్తున్నాడని చెప్తున్నారు.
ఎప్పుడైతే ధర్మం క్షీణించి, అధర్మం పెరుగుతుందో, అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను అంటూ ధర్మ ప్రతిష్టాపనకై తన బాధ్యతను స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించి, దానిని సజావుగా నడిపించుటకై కొన్ని నియమాలను ఏర్పరచాడు. ప్రతి జీవికి కూడా కొన్ని ప్రవర్తనా నియమాలను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా ప్రపంచంలోని ప్రతి ఒక్క జీవి వాటికి ఆపాదించిన ప్రత్యేక ధర్మాన్ని లేదా విధులను నిర్వర్తించవలసి వుంటుంది.
ఎప్పుడైతే మనుషులు వారి ధర్మాన్ని విడిచిపెట్టి, సరైన మార్గాన్ని అనుసరించకపోతే, వారు అధర్మపరులవుతారు. కలుపు మొక్కలు పంటను ఆక్రమించినట్లయితే పంటంతా నాశనమవుతుంది. పంట బాగా పండాలంటే కలుపు మొక్కలను తొలగించాలి.
ధర్మాచరణ క్షీణించినప్పుడు, మనుషులు జీవిత లక్ష్యాన్ని మరచిపోయినపుడు ప్రపంచంలో అధర్మం తలెత్తుతుంది. అధర్మ నివృత్తికై భగవంతుడు భూమిపై అవతరిస్తాడు. లోకోద్ధరణకై భగవంతుడు అనేక రూపాలతో, అనేక నామాలతో అవతరిస్తుంటాడు అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పారు.
హిరణ్యకశిపుని సంహరించుటకై నరసింహావతారాన్ని, దుష్టుడైన రావణుని సంహరించడానికి శ్రీరామునిగాను, కంసుడిని మరియు కౌరవులను నాశనం చేయడానికి శ్రీకృష్ణుడిగాను అవతరించాడు.
మానవులు పూర్వ జన్మల పాపపుణ్యాల ఫలితంగా జన్మిస్తున్నారు. వారిది కర్మ జన్మ (పుట్టుక). భగవంతునిది ఒక లీలా జన్మ. భగవంతుడు తన స్వీయ సంకల్పంతో అవతరిస్తాడు. సత్పురుషుల ప్రార్థనలే భగవంతుని అవతరణకు కారణం అవుతాయి.అంతేకాక దుర్మార్గుల అకృత్యాలు కూడా ఆయన అవతరణకు కారణం అవుతాయి.