యత్కరోషి – వివరణ
యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణం ||
భగవాన్ బాబా వారు ఇలా చెప్పారు :- నిరంతరం భగవంతుడు మీ ఎంత వెంట ఉండాలంటే, సమస్త కర్మలు భగవదర్పిత భావంతో, పరోపకారార్థమై చేయండి. ఏ పని చేసినా ధర్మబద్ధంగా చేయాలనే ఎరుక కలిగి ఉండండి.
ఎటువంటి సేవ భగవంతుడు స్వీకరిస్తాడో శ్రీమతి గీతారాం గారు ఇలా వివరించారు. స్వామి వారు ఇంటర్వ్యూలో ఒక స్త్రీ తో మాట్లాడుతూ “మీ ఊరిలో సేవా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి?” అని అడిగారు. అప్పుడు ఆమె స్వామి తో “చాలా బాగా జరుగుతున్నాయి స్వామి” అని చెప్పారు. వెంటనే స్వామి “మీరు వండుకునే బియ్యం లోనుండి ఒక పిడికెడు బియ్యమును తీసి పక్కన పెడ్తూ ఉండండి. అందరూ దాచి ఉంచిన బియ్యమును సేకరించి, అవసరమైన వారికి అందజేయండి. ఈ విధంగా చేయటం వల్ల ప్రతిరోజు సేవా భాగ్యాన్ని పొందగలుగుతారు” అని చెప్పారు.
ఆ స్త్రీ సేవాదళ్ ఇంచార్జ్ అగుట వలన, వారి ఊరిలో జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నింటినీ చాలా గర్వంగా స్వామికి వివరించారు. అవి విన్న స్వామి ఆమెతో “సంతోషం సంతోషం” అని అన్నారు. తిరిగి స్వామి మీరు నారాయణ సేవ కు వాడే బియ్యం రెండు రూపాయల బియ్యమా? లేక ఐదు రూపాయల బియ్యమా? అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ స్వామి తో “అందరూ ఇచ్చే అన్ని రకముల బియ్యములు కలిసి ఉంటాయి స్వామీ!” అన్నారు.
అప్పుడు స్వామి ఆమెతో “నేను అందరి గురించి అడగలేదు. నీవు ఏ బియ్యం ఇస్తున్నావు?” అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ స్వామి తో “మంచి బియ్యం ఇస్తున్నాను” అన్నారు.
అప్పుడు స్వామి ఆమెతో “నారాయణ సేవకు చక్కచేయని, రాళ్ళు వుండే రెండు రూపాయల బియ్యం, మీ కుటుంబానికి మంచి ఐదు రూపాయల బియ్యమా వాడేది” అన్నారు. అప్పుడు ఆమె బాధతో లేదు స్వామి అన్నారు. అప్పుడు స్వామి ఆమెతో “రెండు సంవత్సరాల కిందట నేను మీ ఇంటికి బిక్షకై వచ్చాను. అప్పుడు నీవు ఒక ఎర్రటి సంచీలో, నారాయణ సేవకు బియ్యం నాకు ఇచ్చావు అని చెబుతూ లోపలి గదిలోకి వెళ్లి ఒక ఎర్రటి సంచీని తీసుకుని వచ్చి అందులో ఉన్న బియ్యాన్ని చూపించి, ఇది నాకు ఇవ్వలేదా? నీవు” అడిగారు. అప్పుడు ఆమె బాధతో ఏడవగా స్వామి ఇలా చెప్పారు “ఏ చిన్న సేవ చేసినా ప్రేమతో చేయండి. అందరిలో భగవంతుణ్ణి దర్శించండి” అని.