తస్మాదసక్తః సతతం- వివరణ
ఈ శ్లోకములో ఏ ఆశయము, మమకారము, ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించుము, అప్పుడు పరమాత్మను చేరుకొనగలవు అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. మమకారమును వదిలివేయడం అంటే కోరికలను త్యజించటమే. మమకారాసక్తులు కోరికలకు మూలము. కర్తవ్యమును జాగరూకతతో క్రమ పద్ధతిలో సమర్థవంతముగా ఫలాపేక్షరహితులై నిర్వర్తించినప్పుడు పరమాత్మను పొందవచ్చును/ పరమ శాంతిని పొందవచ్చును.
జనక మహారాజు గొప్ప కర్మయోగి. మహారాజుగా తన కర్తవ్య కర్మలను సమర్ధవంతముగా నిర్వర్తించినవాడు. అదే సమయంలో ఫలాసక్తి వదిలివేసిన యోగి. కర్మాతీతుడు. స్థితప్రజ్ఞత కలిగి నిరంతరము దైవచింతనలో పావనమైన జీవితము గడిపినవాడు.
ప్రేమతో కర్తవ్యభావంతో ఆచరించిన కర్మలు, హృదయ వికాసమునకు తోడ్పడతాయి. మనలో అంతర్గతంగా దాగి ఉన్న స్వార్ధము నెమ్మదిగా కరిగిపోతుంది / తొలగిపోతుంది. అటువంటి వ్యక్తి తనకున్న సంపదను, వివేకవిజ్ఞానములను, నైపుణ్యమును పరుల యొక్క ఉపకారమునకై ఉపయోగించి తరిస్తాడు. పరమ శాంతిని పొంది తన చుట్టూ ఉన్న వారికి కూడా అదే అనుభవమును కలుగచేస్తాడు. మమకార రాహిత్యము నిర్మలమైన, నిశ్చలమైన మనస్సునకు కారణం అవుతుంది. మన శరీరంలో జరిగే ఎన్నో భౌతిక క్రియలు, ఉదాహరణకు గుండె కొట్టుకోవడం అనేవి నిరంతరము అప్రయత్న పూర్వకంగా, అనాసక్తంగా, అనాలోచితంగా జరిగిపోతూ ఉంటాయి.
మన శరీరంలో ఆహారం జీర్ణం అవుతూ ఉంటుంది. కానీ అది ఒక సాధారణ ప్రక్రియలా జరుగుతూ ఉంటుంది. దానిమీద మన ధ్యాస ఉండదు మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. అలాగే మన ప్రాపంచిక కర్మలు అనగా మన యొక్క కర్తవ్యములు కూడా క్రమబద్ధంగా సహజ రీతిలో సలుపుతూ ఉండాలి. అప్పుడే మనస్సు నిశ్చలమై ఆత్మ జ్ఞానమును పొంద వీలవుతుంది. మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, గ్రామంలో స్త్రీలు పెద్దపెద్ద కుండలను / బిందెలను తలమీద, చంకలో, చేతిలో పట్టుకుని ఎంతో బరువు మోస్తున్నప్పటికీ తోటి వారితో మాట్లాడుతూ, నవ్వుతూ, నడుస్తుంటారు. మనస్సులో కొంత ధ్యాస ఆ బిందెల మీద ఉంటుంది, మిగతాది అంతా స్నేహితురాండ్రులతో నిమగ్నమై ఉంటుంది. అదే విధముగా మనము ఎక్కడ ఉన్నప్పటికీ ఇంటిలో ఉన్నా, పాఠశాల యందున్నా, సమాజంలో అనేక కార్యములలో తలమునకలుగా ఉన్నప్పటికీ మనస్సుని మాత్రం పరమాత్మపై కేంద్రీకరించాలి.
ఎవరైతే తన సామాజికపరంగా కుటుంబ వ్యక్తిగా, దేశ పౌరునిగా, సామాజికునిగా ఉన్న బాధ్యతలను నిర్వహించడో అతడు భగవంతుని సాక్షాత్కారానందమును పొందలేడు. మనకు నిర్దేశించబడిన కర్మలను ఆచరించవలసినదే. మన పూర్వకర్మ ఫలితములను అనుభవించవలసినదే. నేటి మన మన స్థితికి కారణము మన ప్రారబ్దకర్మలే.
పూర్వ కర్మ ఫలితముల నుండి విముక్తి ఎలా పొందవచ్చునో భగవానుడు స్వామి చెప్తారు – ఎక్కడో భూమి లోపల లోతులో ఉన్న విత్తనము మొలకెత్తుటకు సాధ్యము కాదు. అలాగే మన పూర్వకర్మ ఫల శేషములనే విత్తనముల నుండి విముక్తి కావాలంటే, వాటిని దీనజనుల పట్ల ప్రేమ పూర్వక సేవ అనే మట్టితో కప్పాలి. అప్పుడు వాటి ప్రభావం నుండి తప్పించుకొనవచ్చు.
సత్కర్మలు, సాధు కర్మలను ఆచరించుట ద్వారా దుష్కర్మల యొక్క ఫలములను /ఫలితములను దుర్బలం చేయవచ్చు / నిర్వీర్యము చేయవచ్చు. బుద్ధి పూర్వకముగా ఫలాసక్తిని వదిలివేసి నీవు చేయవలసిన కర్మలను కర్తవ్యం గా నెంచి ఆచరింపుము. ఈ విధముగా అట్టి యోగబుద్ధిని అలవర్చుకుని కర్మఫలములను వదిలివేసి కర్మబంధములను వదిలించుకో – బాబా.
గీతా వాహిణి