భగవద్గీత – అధ్యాయం I-VI
అధ్యాయం 1. అర్జున విషాద యోగము.
అర్జునుడి వైరాగ్యము
తన దుఃఖానికి కారణాలు రెండు అని అర్జునుడు విశ్వసించి, ఇలా ఆలోచించాడు.
- శరీరంతోపాటు మనిషి యొక్క ఆత్మ కూడా నశిస్తుంది. దీనిని ‘దేహాత్మ భ్రాంతి’ అంటారు.
- దేహంతో నశించే ఆత్మను, నశించే దేహంలో కల ఆత్మను కనుగొనట.
- ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అధర్మంతో (దుర్మార్గంతో) పోరాడటము. అధర్మాన్ని అణచివేసి ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రియుల కర్తవ్యమని మరచిపోయి, ధర్మస్థాపన కొరకు తన వాళ్లతో యుద్ధం చేయుట కూడా పాపము అని భావించాడు.
- మొదటిది అజ్ఞానము.ఇది చాలా సాధారణ మైనది.
రెండవది సాధారణమైనది మరియు అసాధారణమైనది. అనగా స్వధర్మం యొక్క పరమతత్వము, ఔన్నత్యాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేకపోవటం. గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో విచక్షణా జ్ఞానమును మరియు నాశరహితమగు ఆత్మ తత్వాన్ని బోధించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మొదటి అజ్ఞానాన్ని పోగొట్టాడు. స్వధర్మం యొక్క ప్రాముఖ్యత మరియు ఔన్నత్యాన్ని గురించి, దాని స్వభావాన్ని గురించి మూడవ అధ్యాయం అయిన కర్మయోగంలో ఉపదేశించటం ద్వారా రెండవ అజ్ఞానాన్ని తొలగించాడు. ఈ బోధన ద్వారా అర్జునుడి మనసులోని సంఘర్షణ పరిష్కరించబడి, అతని దుఃఖం తొలగిపోయింది.
శ్రీకృష్ణుడు బోధించిన ఆత్మతత్వాన్ని ‘బ్రహ్మవిద్య’ అంటారు. అనగా సంపూర్ణమైన జ్ఞానము. ఈ బ్రహ్మవిద్యను బోధించుటకు అర్జునునికి కల నాలుగు అర్హతలు ఏమనగా శరణాగతి, కోరికలను త్యజించుట, వైరాగ్యము మరియు బంధ విముక్తి. “ముల్లోకాలను ఏలే అవకాశం ఉన్నప్పటికీ కూడా నాకు అది వద్దు” అని మొదటి అధ్యాయంలో అర్జునుడు చెప్పాడు. అటువంటి గొప్ప వైరాగ్యం ఉన్నందువలననే భగవంతుని చేత బ్రహ్మవిద్యా బోధనకు అర్హుడయ్యాడు. భగవంతుని పాదాల వద్ద అతను శరణు పొందటమే ఈ బోధనకు అర్హత కలిగించింది.
అధ్యాయము 2. సాంఖ్య యోగము.
విచక్షణా తత్వము.
ఈ అధ్యాయము ఆత్మ తత్వాన్ని బోధిస్తుంది. ఆత్మ అరిషడ్వర్గాలకు అతీతమైనది. శాశ్వతమైనది. ఇది ఏకమైనది. ద్వందము కానిది. సర్వవ్యాప్తమైనది. సాక్షీభూతమైనది. ఇది సచ్చిదానంద స్వరూపమే. ఆత్మ మన శరీరంతో పాటు నశించిపోతుందనే భ్రమ అర్జునుడికి ఈ అధ్యాయంలోని భోధన ద్వారా తొలగిపోతుంది. సహజంగా మరణానికి అందరూ భయపడతారు. కానీ నాశరహితమగు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఈ భయమును వీడుతారు. మరణ భయాన్ని పోగొట్టటానికి ఆత్మ స్వరూప జ్ఞానబోధ ఈ అధ్యాయంలో ఇవ్వబడినది. ఇంకనూ ఆత్మజ్ఞాన స్పృహ, స్థితప్రజ్ఞత్వము, దృఢమైన జ్ఞానము ఇవ్వబడినది.
అధ్యాయము 3 కర్మయోగము
కర్మ మార్గము
ఆత్మ జ్ఞానాన్ని పొందుటకు ప్రధానమైనది చిత్తశుద్ధి. అంతేకాకుండా నిర్మలమైన అంతకరణ (మనసు, బుద్ధి) ఉండాలి. కామ క్రోధాదులచే నిండియున్న హృదయము ఆత్మజ్ఞానాన్ని గ్రహించదు. కామ క్రోధాలు ప్రాపంచికమైనవి. అందువలన కర్మేంద్రియాలను ఏదో ఒక పనిలో నిమగ్నము చేయకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు. కోరికలతో కూడిన కర్మలు చేయుట వలన, జన్మాంతర వాసనల ద్వారా బంధానికి కారకుడై, పునర్జన్మ అనే సముద్రం లోనికి నెట్టబడుతున్నాడు. కానీ అందరూ భగవదారాధనకు స్ఫూర్తి నిచ్చే కర్మలలో నిమగ్నమై ఉండరు. ఫలాపేక్ష లేకుండా చేసే కర్మల వలన చిత్తము శుద్ధి పొందుతుంది. అప్పుడు ప్రవృత్తి కర్మలు కూడా నివృత్తి కర్మలుగా మారి విముక్తిని కలిగిస్తాయి. మరియు కర్మబంధం తొలగిపోతుంది. నిష్కామ కర్మ స్ఫూర్తితో తన విధులకు అనుగుణంగా కర్మలు చేయడం వలన మనసు పరిశుద్ధమవటమే కాక అజ్ఞానం తొలగిపోతుంది. బుద్ధి పరిశుద్ధం అవుతుంది. అప్పుడు మనం చేసే కర్మలు కర్మయోగంగా రూపాంతరం చెందుతాయి. తద్వారా ఆధ్యాత్మిక జ్ఞానం ఏర్పడి మోక్షానికి దారి చూపుతుంది. నిష్కామ కర్మానుష్ఠానము మరియు స్వధర్మానుష్ఠానములే కర్మయోగం యొక్క సారాంశము. ఈ మార్గంలో విజయం సాధించుటకు కోరికలను జయించడమే ముఖ్యమైన మార్గము.
అధ్యాయము 4. జ్ఞాన యోగం
జ్ఞాన మార్గము
చిత్తశుద్ధి ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. పరిశుద్ధమైన హృదయంలో మాత్రమే జ్ఞానము ఉదయిస్తుంది. ఈ అధ్యాయంలో జ్ఞాన వైభవము మరియు ఆ అత్యున్నత జ్ఞానాన్ని పొందే సాధనలు, కర్మయోగ ఫలము, మరియు జ్ఞాన పరిపూర్ణతను తెలుప బడతాయి. జ్ఞానము సమస్త పాపాలను మరియు గత జన్మ వాసనలను నశింప చేస్తుంది. జ్ఞానం అనునది స్వచ్ఛత మరియు పరిపూర్ణత యొక్క స్థితికి సాధనం. దానిని సాధించడానికి ప్రధానంగా ఉండవలసినవి
- ప్రణిపాత (గురువునకు శరణాగతి)
- పరిప్రశ్న (వినయముతో ప్రశ్నించుట లేదా వివరణలు కోరుట)
- సేవ (గురుసేవ)
- శ్రద్ధ (దృఢమైన మరియు అచంచలమైన విశ్వాసము)
- తత్పరత్వ (దైవాను బంధము)
- జితేంద్రియత్వ (పరిపూర్ణ స్వీయ నియంత్రణ) ఇవి ఈ అధ్యాయంలో బోధించబడినవి.
అధ్యాయము 5 కర్మసన్యాస యోగము.
కర్మ యొక్క వివరణ
ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడి యొక్క లక్షణాలు ఈ అధ్యాయంలో వివరించబడినవి. జ్ఞాని ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించినప్పటికీ అతని బాహ్యశరీరం మాత్రమే ఈ ప్రాపంచిక జగత్తులో ఉంటుంది. అతను కేవలం సాక్షిభూతుడుగా ఉండి, కర్మరాహిత్య స్థితిలో ఉంటాడు. అతను నిజంగా శరీర స్పృహను వదిలి, ఆత్మ స్పృహలో వుంటాడు. శరీరం మరియు మనసు యొక్క ఆధీనంలో ఉండడు. శరీరంలో ఉన్నప్పుడు కూడా దానితో బంధన లేకుండా ఉంటాడు. కర్మ సన్యాసం (కర్మ ఫలాలను త్యజించటం) సాక్షీభూత స్థితిని సాధించుటకు సాధనము.
అధ్యాయము 6 ధ్యానయోగం
ధ్యానయోగము మరియు ఆత్మ సంయమన యోగము
నిస్వార్థ కర్మల ద్వారా మనసును నిర్మలంగా చేసుకొని, ప్రాపంచిక కోరికల నుండి విముక్తి పొందిన వ్యక్తి తన బుద్ధినిర్మలత్వం కొరకు ధ్యానము అభ్యసించి, ఆత్మసాక్షాత్కారం చేసుకొనవలెను.ధ్యానం చేయటానికి అవసరమైనవి సంఘరాహిత్యము, ఆహారము స్వీకరించుటలో క్రమశిక్షణ, ప్రాణాయామం అనగా శ్వాస నియంత్రణ, ప్రశాంతత, ఆలోచనా ప్రవాహాన్ని అరికట్టుట వంటివి ఈ అధ్యాయంలో బోధించబడినవి.