భగవద్గీత – అధ్యాయం VII-XII
అధ్యాయము 7. విజ్ఞానయోగము.
జ్ఞాన+విజ్ఞానయోగము. విశేష జ్ఞానము. అనుభవ పూర్వక జ్ఞానము.
ధ్యాన సాధన ద్వారా బుద్ధి పరిశుద్ధం అవుతుంది. అది నిర్గుణ తత్వాన్ని, సగుణ తత్వాన్ని రెండింటిని అర్థం చేసుకుంటుంది. అలాగే విశ్వము పంచభూతములతో కూడి ఉంటుంది. వాస్తవానికి ఇది భగవంతుని యొక్క సృష్టీకరణ. అర్థ భక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసభక్తి, జ్ఞాన భక్తి ద్వారా నిత్యం పరమాత్మతో చేరి యుందురు. ఇవి ముక్తిని పొందే సాధనాలు.
అధ్యాయము 8 అక్షర పరబ్రహ్మ యోగము
నాశరహిత మగు పరబ్రహ్మను గూర్చి బోధన
అంత్యకాలమున జీవుడు శరీరం నుండి బయటకు వచ్చినప్పుడు మనుజులు యే యే భావములను మనసులో చింతించుచూ దేహమును వీడెదరో, ఆ స్మరణనే తదుపరి జన్మను రూపొందిస్తుంది. “యద్భావం తద్భవతి” అని చెప్పబడింది.
ఆఖరి క్షణంలో భగవంతునిపై మనసు నిలిపిన అతడు ఆ పరమాత్మ స్వరూపమునే పొందుతాడు. జీవిత పర్యంతం భగవంతుని ధ్యానం చేస్తూ, మనస్సును నియంత్రించుకుంటే, సహజంగానే ఆ చిత్తము అంత్యకాలంలో భగవంతుని తలంపుపై నిలిచి ఉంటుంది. అటువంటివాడు ఖచ్చితంగా ముక్తిని పొందుతాడు. జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. ఈ విధంగా సాత్వికులు, ఉపాసకులు దేవయాన మార్గానికి చేరుకుంటారు. కర్మలకు బంధింపబడిన వారు పితృ యాన మార్గానికి చేరుకుంటారు.
అధ్యాయము 9. రాజు విద్యా రాజగుహ్య యోగము
సర్వోత్కృష్టమైన శాస్త్రము మరియు సర్వోత్కృష్టమైన రహస్యము. శాస్తాల్లోకెల్లా శ్రేష్టమైనది, రహస్యములన్నింటిలోనూ పరమ రహస్యం అయినది.
ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని మరియు విశ్వము యొక్క బ్రాంతికరమైన స్వభావాన్ని మరియు జ్ఞానాన్ని ఎలా పొందాలో బోధించాడు. దీనికి అనన్య భక్తి ఏకైక సాధనం. అనన్యమైన భక్తి ద్వారా అవ్యక్తుడైన భగవంతుని పొందడం సులభ సాధ్యం అని ఈ అధ్యాయంలో బోధించబడింది. సంత్ జ్ఞానేశ్వర్ జీవ సమాధిలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఈ అధ్యాయాన్ని పఠిస్తూ సమాధి చెందాడని చెప్పబడింది. ఇదే ఈ అధ్యాయం గొప్పతనము మరియు ప్రాముఖ్యత. ఇది భగవంతుని సౌలభ్య స్వభావాన్ని, మానవునికి ఆయన లభించే ప్రాముఖ్యతను తెలుపుతుంది.
అధ్యాయము 10. విభూతి యోగము
భగవద్విభూతి
అనన్య భక్తిని పెంపొందించుకోవటానికి, సృష్టి అంతటా అణువణువునా భగవంతుని దర్శనం చేసుకునే మనసును పెంపొందించుకోవాలి. ఎక్కడ మంచితనము, శోభ, వైభవం ఉంటాయో అంతవరకే ఉంటాయి. కానీ భగవంతుని యొక్క ప్రతిబింబము మరియు భగవదంశము విశ్వమంతా విస్తరించి ఉంది. విశ్వమంతా ఆయన విభూతితో మరియు మహిమతో మాత్రమే నిండి ఉంది. కనుక ఆయన సృష్టి ద్వారానే ఆయన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి.
అధ్యాయము 11. విశ్వరూప సందర్శన యోగము.
అనంత విశ్వరూపం యొక్క దర్శనము
భగవంతుడు సృష్టిలో అంతర్లీనంగా ఉన్నాడు. అయినప్పటికీ సృష్టి అంతా అతనిలోనే ఉంది. పదవ అధ్యాయంలో సృష్టిలో మ తానై ఉన్నానని చెప్పి, విశ్వమంతా భగవద్విభూతియే అని తెలుపుతున్నాడు. భగవంతుడు తానే సృష్టికర్త అయినప్పటికీ, సమస్త సృష్టికి అతీతుడు.
అధ్యాయము 12. భక్తి యోగము
భక్తి మార్గము
ఈ అధ్యాయంలో సగుణ భక్తి మరియు నిర్గుణ భక్తి బోధించబడ్డాయి. ఈ రెండును అత్యున్నతమైనవి. నిజమైన భక్తుని లక్షణాలు కూడా ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి. భక్తుడు ఎవరి పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండడు. అపారమైన దయను కలిగి ఉంటాడు. భగవంతుని పట్ల అతనికి గల ప్రేమ కంటే కూడా ఎక్కువగా భగవంతుని చేత అతను ప్రేమించబడతాడు.
మొదటి ఆరు అధ్యాయాలు జీవిని పవిత్రం చేయడానికి క్రమశిక్షణలు ఇవ్వగా తర్వాతి ఆరు అధ్యాయాలు భగవంతుని యొక్క సర్వవ్యాప్త స్వభావాన్ని, మహిమా విస్తారాన్ని వివరిస్తాయి. భగవంతుని పొందే మార్గాలైన అనన్య భక్తి, ఏకాత్మ భావనతో కూడిన భక్తిని వివరిస్తాయి. చివరి ఆరు అధ్యాయాలు జీవుని పరబ్రహ్మంతో గుర్తింపును బోధిస్తాయి.