2. భక్తి యోగము: భక్తి మార్గం పై కథలు.
భక్తి యోగంలో భక్తుడు భగవంతుని ప్రేమకు ప్రీతి పాత్రుడవుతాడు. భక్తుడు భగవంతునిపై భావోద్వేగ స్వభావాన్ని కలిగి ఉంటాడు. అతని భావాలు మరియు భావోద్వేగాలన్నీ అతని భక్తికి సంబంధించిన అంశములపై కేంద్రీకృతమై ఉంటాయి. భగవంతుని ఆరాధనలో అతడు ఆనందిస్తాడు. కానీ అతని భక్తి అనే ఫలము పండినప్పుడే అతని దృష్టి మారుతుంది. విశ్వమంతా భగవంతునితో వ్యాపించి ఉన్నదని తెలుసుకుంటాడు.
బాబా చెప్పిన భక్తి యోగ కథ:
జ్ఞానదేవ్, నామదేవ్ అను భక్తులిద్దరూ ఒకసారి తీర్థయాత్రలకు వెళ్లారు. జ్ఞాన దేవుని భక్తి జ్ఞానమార్గం వైపు కొనసాగగా, నామదేవుడు భక్తి మార్గాన్ని అనుసరించాడు. రూపంలో అతని భక్తి భగవంతునిపై భావోద్వేగ రూపంలో వెలువడుతుంది. పండరీపురంలోని పాండురంగ విఠ్ఠలుడే అతనికి సర్వస్వం. తల్లి, తండ్రి, సర్వస్వం అంతయూ విఠ్ఠలుడే.
అలా ప్రయాణిస్తూ వారు చాలా అలసిపోయి, దాహం వేయగా నీటి కోసం వెతుకుతూ ఒక బావి వద్దకు వచ్చారు. ఆ బావి చాలా లోతుగా ఉండి, అందులో నీరు చాలా తక్కువ ఉన్నది. సమీపంలో బకెట్, తాడు లాంటివి ఏవీ లేవు. మరి వారు దాహాన్ని తీర్చుకోవటం ఎలా?
జ్ఞాన దేవుడు ధ్యానంలో కూర్చుని, తన యోగ శక్తి ద్వారా పక్షి రూపంలో మారి, బావిలోనికి దిగి నీరు త్రాగి దాహాన్ని తీర్చుకుని, తిరిగి మానవ రూపాన్ని పొందాడు.
నామదేవుడు అంతటి గొప్ప యోగ సిద్దులను పొందలేదు. అతను భక్తి పారవశ్యంతో, పాండురంగ విఠల నామస్మరణలో మునిగిపోయాడు. అప్పుడు బావిలోని నీరు పొంగి బావి అంచు వరకు పెరిగింది. నామదేవుడు తాను ఉన్న ప్రదేశంలోనే కూర్చుని బావిలో నుండి అరచేతుల్లో నీళ్లు తీసుకుని తన దాహాన్ని తీర్చుకున్నాడు. ఇది చూసిన జ్ఞాన దేవుడు నావదేవుని భక్తిని, ఆ భక్తి యొక్క అత్యున్నతమైన శక్తిని గ్రహించాడు. భక్తి యోగము ఇతర యోగాల కంటే తక్కువ కాదు అని తెలుసుకున్నాడు.