4.జ్ఞాన యోగము-జ్ఞానమార్గము
జ్ఞానయోగము అనగా జ్ఞానపరమైన విచారణా మార్గము. దీనికి బలమైన సంకల్పం అవసరం. ఈసాధన అన్నింటిని త్యజించటంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్వయంగా అనుభవ పూర్వక మైన జ్ఞానాన్ని పొంది తనని అందరిలోనూ, అందరిలో తనని చూస్తాడు. అతనికి అతనే ఆత్మ స్వరూపము అవుతాడు. సమస్త ప్రపంచము, సమస్త జీవులు కేవలం ఆత్మరూపమే కానీ, భగవంతుడు/ఆత్మ స్వరూపం కానిది మరేదియూ లేదు అని తెలుసుకుంటాడు.
ఈ విభిన్న మార్గాలు విభిన్న వ్యక్తుల మానసిక స్థితికి అనుగుణంగా ఉంటాయి. చురుకైన స్వభావం ఉన్నవారికి కర్మయోగం బాగా సరిపోతుంది. భావోద్వేగ మనస్తత్వం కలిగిన వారికి భక్తియోగం బాగా సరిపోతుంది. మరియు అత్యంత హేతుబద్ధమైన స్వభావాన్ని కలిగి ఉన్న వారికి జ్ఞానయోగం బాగా సరిపోతుంది. భావోద్వేగ మరియు మేధో స్వభావాలు ఉన్నవారికి రాజయోగం బాగా సరిపోతుంది. అయితే వారి అంతిమ స్థాయిలో, అన్ని యోగాలు ఒకదానితో ఒకటి కలుస్తాయి. మరియు ఒకే లక్ష్యానికి దారితీస్తాయి. దివ్య చైతన్య స్థితి మరియు స్వీయ అవగాహన స్థితికి మధ్య దశలో అనగా సాధకుడు అంతిమస్థితికి చేరుకోనంత వరకు, ఒక యోగం కంటే మరొకటి గొప్పదని కొన్ని అపోహలు ఉండవచ్చు. కానీ అంతిమ దశలో కర్మయోగి ఎంత భక్తుడో జ్ఞాన యోగి కూడా అంతే.
జ్ఞాన యోగము కథ
ఇది నామ దేవుని కథ. నామదేవుడు పాండురంగ విఠ్ఠలుడికి గొప్ప భక్తుడు. పండరీపురంలోని దేవాలయంలోని విఠలుడి విగ్రహం అతనితో మాట్లాడేది. అతను అందించే ఆహారాన్ని కూడా స్వీకరించేది. అతను శ్రావ్యమైన గాత్రాన్ని కలిగి, ఎన్నో కీర్తనలను స్వరపరచి, తన గానంతో ఆకట్టుకునేవాడు. అతని కాలంలోనే పాండురంగ విఠలునికి అనేకమంది భక్తులు ఉండేవారు. సావ్తామాలి(తోటమాలి), జానా బాయి (పనిమనిషి), నరహరి సోనార్ (కంసాలి), సేనా(క్షురకుడు), తక్కువ కులానికి చెందిన చోఖామేళా, గోరా(కుమ్మరి), మరియు ముగ్గురు సోదరులు నివృత్తినా థ్, జ్ఞానేశ్వర్, సోపాందేవ్ మరియు వారి సోదరి ముక్తాబాయి ఉండేవారు. ఒకసారి వారందరికీ నామదేవుని కలిసే అవకాశం వచ్చింది. నామదేవ్ వారి వద్దకు వస్తుండగా వారంతా అతనిని విఠల భగవానుడికి ప్రీతిపాత్రమైన భక్తుడిగా, అభినందించుటకై గౌరవంతో లేచి నిలబడ్డారు. ముక్తాబాయ్ మాత్రం అతనిని ఒక వ్యక్తిత్వం మనిషిగా భావించి లేవలేదు. ఆమె యొక్క విచక్షణారహిత ప్రవర్తనకు, నామదేవ్ వంటి గొప్ప భక్తున్ని గౌరవించనందుకు జ్ఞానదేవ్ ఎంతో బాధపడి, ఆమెని హెచ్చరించాడు. అప్పుడు ఆమె “నామదేవ్ ఇంకా ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందనటు వంటివాడు.” అని చెప్పింది. విచక్షణా రహితమైన ఆమె మాటలు ఆ సోదరులకు అసహనాన్ని తెప్పించాయి. “నేను చెప్పినది సరియైనది కాకపోతే గోరా మామయ్యను, అతనిని పరీక్షించి తీర్పు చెప్పమనండి” అన్నది. అప్పుడు వారు అక్కడ సమావేశమైన ప్రతి ఒక్కరి యెక్క ఆధ్యాత్మిక స్థాయిపై తీర్పును ఇవ్వమని గోరాను కోరారు. గోరా కుండలు సరిగ్గా కాలాయా? లేదా? అని పరీక్షించే విధంగా, తన వేళ్ళతో ఒక్కొక్కరి తలపై నొక్కుతూనే ఉన్నాడు. అక్కడ నామదేవ్ తప్ప మిగిలిన అందరూ ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందారని గోరా చెప్పాడు. అతను విఠలుడికి అత్యంత ప్రియమైన భక్తుడు అయినప్పటికీ కూడా, ముక్తా చెప్పిన మాటలే నిజమని నిరూపించబడ్డాయి.
ఈ మాటలు విన్న నామదేవ్ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు నిరాశను పొందాడు. గోరా తనలో ఇంకా పరిపక్వత రాలేదని చెప్పటం నిజం అయి ఉండాలి. ఎందుకంటే అతని తీర్పు తిరుగులేనిది. ఈ విధంగా ఆలోచిస్తూ వెంటనే నామదేవ్ విఠలుని మందిరానికి పరుగులు తీశాడు. తనకు దారి చూపమని ఏడుస్తూ ప్రార్థింప సాగాడు. అప్పుడు విఠలుడు “నీవు ఇక్కడికి దూరంగా ఉన్న గ్రామానికి చెందిన, విశోబా ఖేచర్ వద్దకు వెళ్లి అతని వద్ద నుండి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకో” అని చెప్పాడు. నామదేవ్ విశోభాను కలవడానికి బయలుదేరాడు. అతడు గ్రామంలోనికి ప్రవేశించి, అతని గురించి విచారించగా “విశోబా గుడిలో ఎక్కడో పడుకుని ఉంటాడు”. అని చెప్పారు. అతనిని చూసే నిమిత్తమై ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు “ పవిత్రమైన శివలింగంపై పాదాలు చాచుకుని విశ్రమించి నిద్రపోతున్న ఒక ముసలి వ్యక్తిని(విశోబాను) చూచి విస్తుపోయాడు. ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నాడు ఇతను. ముక్తాలాగా ఇతను కూడా అహంకారి. ఇద్దరూ కూడా దేవుడిని మోసం చేస్తున్నారు అనుకుంటూ ఆ వృద్ధుడిని కదిలించాడు. “నీ పాదాలను ఎక్కడ ఉంచావు చూడు. నీ పాదాలకు విశ్రాంతి పొందింపడానికి భగవంతుణ్ణి ఆసనంగా ఎన్నుకున్నావు. నీకు ఇంతకంటే వేరే స్థలం దొరకలేదా?” అంటూ కోపగించాడు. అప్పుడు ఆవృద్ధుడు బలహీనమైన స్వరంతో, నెమ్మదిగా “నన్ను క్షమించండి. నా చూపు సరిగ్గా లేదు. నేను చాలా బలహీనంగా ఉన్నాను. నా కాళ్ళను కూడా కదల్చలేను. దయచేసి మీరు నా కాళ్ళను శివలింగం నుండి దూరంగా పెట్టడానికి సహాయం చేయండి” అని అభ్యర్థించాడు. నామదేవ్ చిరాకు మరియు కోపంతో శివలింగం నుండి వృద్ధుడి కాళ్ళను పక్కకు లాగాడు. శివలింగం విశోభా పాదాలకు అతుక్కుని పోయి, పాదాలతో పాటు శివలింగం కూడా కదులుతోంది.
ఒక్కసారి నామదేవుని యొక్క జ్ఞానము, తెలివి అన్నీ నశించి పోయాయి. విఠలుడు ఒక పండరీపురంలో మాత్రమే లేడు, విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. అన్నింటిలో భగవంతుని చూడడం అనేదే నిజమైన జ్ఞానం అని తెలుసుకున్నాడు.