1. కర్మయోగము: కర్మను అనుసరించు మార్గము.
ఫలాసక్తి లేకుండా కర్మలను అత్యంత సామర్థ్యంతో మరియు పరిపూర్ణతతో నిర్వర్తిస్తూ తనకు నిర్దేశించిన విధులలో నిమగ్నమై ఉండాలి. “యోగః కర్మసు కౌశలం” అని చెప్పబడింది. కర్మయోగి తన కర్తవ్యాలను అహంకార మమకారాలు లేకుండా చేస్తాడు. అంతేకాకుండా కర్మను, కర్మ ఫలితాన్ని రెండింటిని భగవంతుడికే సమర్పిస్తాడు. అతను ఎప్పుడూ చాలా ఉత్సాహంగా, సమాజం కొరకు, పరోపకారముకై పని చేస్తాడు.
కర్మయోగి కథ
ఇది మహాభారతంలోని కథ. ఒక బ్రాహ్మణ యువకుడు ఆధ్యాత్మిక జీవితం పట్ల ఉన్న ఆసక్తితో తన తల్లిదండ్రులను మరియు ఇంటిని విడిచిపెట్టి సన్యాసిగా మారి, సమీపంలో ఉన్న అరణ్యానికి వెళ్లి తపస్సు చేయ ప్రారంభించాడు. రోజు ఉదయం పూట ధ్యానం చేసుకుంటూ, మధ్యాహ్నం గ్రామానికి భిక్షకై వెళ్లేవాడు.
ఒకరోజు ఎప్పటిలాగే అడవిలో చెట్టు కింద ధ్యానం చేస్తూ మధ్యాహ్నం అవడంతో బిక్ష కొరకై గ్రామంలోనికి వెళ్ళుటకు సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ సమయంలో చెట్టు కొమ్మల నుండి పక్షుల అపవిత్ర పదార్థం అతని తలపై పడింది. కోపంతో అతను పైకి చూడగా కొమ్మలలో కూర్చుని ఉన్న కొంగ కనిపించింది. ఆ కొంగని తీక్షణంగా చూడగా వెంటనే అది కాలి భస్మం అయిపోయింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తాను పొందిన శక్తులకు ఆశ్చర్యపోయాడు. అంతేకాక కొద్దిగా గర్వపడ్డారు కూడా. తన శరీరాన్ని అపవిత్రం చేసినందుకు ఆ కొంగకు అలాగే జరగాలి అని అనుకున్నాడు.
ఈ విధంగా వచ్చిన గర్వాహంకారాలతో ఆ బ్రాహ్మణుడు గ్రామంలోనికి వెళ్లి ఒక ఇంటిముందు బిక్ష అడిగాడు. ఆ ఇంటిలో ఉన్న గృహిణి “దయచేసి కొద్దిసేపు ఆగండి” అని బదులిచ్చింది. కొంత సమయం గడిచినా కూడా ఆ స్త్రీ బయటకి వచ్చి బిక్ష ఇస్తున్న సూచనలు కనిపించలేదు. వెంటనే అతను అశాంతికి, అసహనానికి గురి అయ్యాడు. “అజ్ఞాని అయిన ఈ స్త్రీకి నాలాంటి గొప్ప తపస్విని ఏ విధంగా గౌరవించాలో తెలియదు” అని ఆలోచించడం ప్రారంభించారు. అతనిలోని అసహనం ఆవేశంగా మారింది. తన దగ్గర గొప్ప శక్తులు ఉన్నాయి కదా అని అనుకొని, వెంటనే ఆ స్త్రీకి శాపం ఇవ్వబోయాడు. అప్పుడు లోపలి నుంచి “స్పష్టమైన ప్రశాంతమైన స్వరంతో ఆ మహిళ ఇలా అన్నది. అయ్యో! బ్రాహ్మణోత్తమా! నీ కోపానికి కాలి బూడిద అగుటకు కొంగను కాదు నేను. దయచేసి కాసేపు వేచి ఉండండి. నేను నా భర్తకు సేవ చేయడం పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు బిక్ష ఇవ్వగలుగుతాను” అని. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ స్త్రీ ఇంకనూ తనని చూడలేదు. అయినప్పటికీ నా ఆలోచనలు ఎలా తెలుసుకుంది. దూరంగా ఉన్న అడవిలో కొంగ భస్మం అయిన విషయం ఎలా తెలిసింది? అని ఆలోచించసాగాడు. చివరగా ఆ స్త్రీ బిక్షతో బయటకు వచ్చి, “తన భర్తకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నందువలన అతనిని వేచి ఉండేలా చేశానని,తనని క్షమించమని” కోరింది. ఇది స్త్రీలకు ప్రధాన కర్తవ్యం కదా అని అనగా ఆ బ్రాహ్మణుని గర్వం అణిగిపోయింది. అపరాధ భావంతో ఆ స్త్రీని “ఇంతటి ఉన్నతమైన జ్ఞానాన్ని ఎలా పొందారో చెప్పమని, తనకు నేర్పించమని ప్రార్థించాడు”. దానికి ఆమె “నేను సాధారణ స్త్రీ ని మరియు అక్షర జ్ఞానం లేని దాన్ని. నా భర్త పట్ల నేను చేయవలసిన కర్తవ్యాన్ని ప్రధానమైనదిగా భావిస్తాను. నేను ఈ పనులన్నీ హృదయపూర్వకంగా నిర్వర్తిస్తాను. ఇదియే నా సాధన. ఇంతకుమించి మీకు నేను చెప్పగలిగినది ఏమీ లేదు. కానీ మీకు ఉన్నతమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే, మిధిలా పురమునకు వెళ్లి అక్కడ మాంస దుకాణం నడుపుతున్న కసాయి వృత్తికి చెందినవాడైన ధర్మవ్యాధుడి వద్దకు వెళ్లి నేర్చుకోమని సలహా ఇచ్చింది.
బ్రాహ్మణుడు మిథిలా పురమునకు వెళ్లి, ధర్మ వ్యాధుడి మాంస దుకాణం వద్దకు చేరుకుంటాడు. ఆ ప్రదేశం అతనికి చాలా అఇష్టతను కలిగించింది. అక్కడ ధర్మవ్యాధుడు మాంసాన్ని కోయటము, అమ్మటము, కొనుగోలుదారులతో మాట్లాడటం మొదలగు పనులలో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఆ స్త్రీ ఆధ్యాత్మిక సత్యాలను అతని దగ్గరేనేర్చుకోమని నిర్దేశించినది కనుక అతని దగ్గరికి వెళ్లగా ధర్మవ్యాధుడు అతనితో “మహాశయా! మీరు ఇక్కడ ఆసీనులు కండి. త్వరగా నా పని పూర్తి చేసుకుని వస్తాను. ఆ స్త్రీ “నన్ను చూడమని పంపి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. నేను నా పనిని పూర్తి చేసుకుని వచ్చి, మిమ్మల్ని మా ఇంటికి తీసుకుని వెళ్తాను” అన్నాడు. అది విన్న ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి “ఈ కసాయి వాడు సర్వజ్ఞుడిగా కనిపిస్తున్నాడు. అతనికి నా గురించి అంతా తెలుసు” అని అనుకున్నాడు.
ధర్మవ్యాధుడు బ్రాహ్మణుడిని ఇంటికి తీసుకుని వెళ్లి కూర్చోమని చెప్పి, వృద్ధులైన తన తల్లిదండ్రుల సేవపై శ్రద్ధ వహించాడు.వారికి భోజనం పెట్టి వారు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, అతనికి పండ్లు, పాలు మధురమైన పదార్థాలు ఇచ్చాడు. తర్వాత ఆ బ్రాహ్మణునితో ఆధ్యాత్మిక సత్యాలను గురించి మాట్లాడడం ప్రారంభించాడు. ధర్మవ్యాధుని యొక్క ప్రగాఢ జ్ఞానానికి అతను ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఈ విధంగా ఆలోచించ సాగాడు.
సన్యాసం తీసుకున్న తర్వాత తాను ఎలాంటి ఉన్నతిని పొందాడు? కోపానికి బానిసయై కొంగను భస్మం చేశాడు. భిక్షను అందించడంలో ఆలస్యం అగుటవలన గర్వంతో సహించలేక పోయాడు. తనకంటే నిరక్షరాస్యరాలైన స్త్రీ మరియు కసాయి వృత్తి చేసుకునే ధర్మ వ్యాధుడు ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారు జీవన్ముక్తులు.వారు కర్మయోగం ద్వారా అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నారు. వారి చేతుల ద్వారా కర్మను ఆచరిస్తూ మనస్సును ఆత్మతో ఐక్యం చేశారు. తాను ఇంటి నుండి పారిపోయి, తన తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించి, సన్యాస జీవితాన్ని కోరుకున్నాడు. మరి దాని ఫలితం ఏమిటి? కోపానికి మరియు గర్వానికి బానిస అయ్యాడు.
ఆ గృహిణికి ఆమె భర్తనే దైవం. ధర్మవ్యాధునికి తల్లిదండ్రులే దైవం. వారి ఇల్లు వారికి దేవాలయం. వారు కర్మయోగం ద్వారా వారి జీవితాలను పవిత్రం చేసుకున్నారని బ్రాహ్మణుడు గ్రహించాడు.