విశ్వ పర్యటన
విశ్వ పర్యటన
హాయిగా కళ్ళు మూసుకుని కూర్చోవలెను. చేతులను కాళ్లపై ఉంచండి. దీర్ఘంగా మూడుసార్లు శ్వాసను తీసుకోండి. ఉచ్ఛ్వాసనిశ్వాసములు సలుపండి. శ్వాస జరుపుతున్నప్పుడు ఆ గాలిని అనుభవించండి. ఇది సర్వశక్తిమయుడైన భగవంతుడు మనకు ఇస్తున్నటువంటి బహుమానము. దీనిని చిరునవ్వుతో స్వీకరించండి.
ఇప్పుడు గదిలో మన చుట్టూ ఉన్నటువంటి వెచ్చదనాన్ని ఆస్వాదించండి మన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రతని గమనించండి. సూర్యుడు ఇస్తున్నటువంటి ఈ వేడి మనలను వెచ్చగా ఉంచుతోంది. ఈ వేడి లేకపోతే అంతా చల్లగా ఉంటుంది.
ఇప్పుడు మనము విశ్వ పర్యటనకు బయలుదేరుదాము. ఇప్పుడు నువ్వు ఆకాశములో ఎగురుతున్నట్లుగా ఊహించుకో. తరగతి గదిని వదిలి నెమ్మదిగా వెళ్తున్నావు. ఇప్పుడు నువ్వు మేఘాల మధ్యలో ఉన్నావు. పైనుంచి చూస్తే అన్నీ చిన్నగా కనపడేంతవరకు పైపైకి పయనిస్తూ ఉన్నావు. ఓహో! అదిగో భూమి. ఎంత అందంగా ఉందో! భూమి యొక్క సౌందర్యాన్ని మెచ్చుకుంటూ ఆస్వాదిస్తున్నావు. నీతో నీవు చెప్పుకోవాలి ఇది నా భూమి, నేను దీన్ని రక్షించుకోవాలి. ఇప్పుడు నువ్వు భూమి చుట్టూ సంచరిస్తున్నావు. ఖండాలను, అపారమైన, అపరితమైన సముద్రాలను చూస్తున్నావు.
దూరంగా గ్రహాలన్నింటికీ కాంతిని, ఉష్ణమును పంచుతున్న పెద్దగా ఉన్నటువంటి సూర్యున్ని చూస్తున్నావు. మన కళ్ళతో చూడాలి అంటే వెలుతురు ఉండాలి, ఆ వెలుతురుని ప్రసాదించి మన చుట్టూ అందంగా ఉన్నటువంటి వాటిని చూడగలిగేటట్లు చేస్తున్నటువంటి సూర్యునికి కృతజ్ఞతలు తెలుపుము.
సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలన్నింటినీ చూస్తున్నావు. ఇది చూడటానికి ఎంతో ఘనంగా, వైభవోపేతంగా, అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతమైన సౌందర్యములో భాగమైన మనము ఎంతో అదృష్టవంతులు. ఇప్పుడు తరగతికి తిరిగి వెళ్లే సమయము అయినది. ఇప్పుడు నువ్వు భూమి మీదకు తిరిగి వస్తున్నావు. నెమ్మదిగా అన్నీ పెద్దవిగా కనిపిస్తున్నాయి. తరగతి ఎదురుగా నిలబడ్డావు. విశ్వ పర్యటనము చేసి వచ్చినందుకు ఆనందంగా, సంతోషంగా తరగతిలోకి ప్రవేశించావు.
నెమ్మదిగా కళ్ళు తెరువు.
పునః స్వాగతము.
ప్రశ్నలు:
- నీవు ఏమి చూసావు?
- భూమిని చూసావా?
- భూమి ఏ రంగులో ఉంది?
- సూర్యుని చూసావా? ఎలా ఉంది? (ఆకారము & రంగు)
- ఎన్ని గ్రహములు ఉన్నాయి?