అహం వైశ్వా – వివరణ

Print Friendly, PDF & Email
అహం వైశ్వా – వివరణ
అహం వైశ్వా నరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ||

పురుషోత్తమప్రాప్తి యోగము (15-14)

భగవాన్ బాబా ఈ విధంగా చెప్పారు. “వైశ్వానరుడుగా మన శరీరంలో నివసించే భగవంతుడు, ఆహారాన్ని స్వీకరించి, జీర్ణం చేసి, శరీరంలోని వివిధ అవయవాలకు పుష్టిని కలుగజేస్తాడు.”

నాలుగు రకాల ఆహారాలయిన

  1. భక్ష్యములు (ఘనమైనవి)
  2. భోజ్యములు (నాలుకచే చప్పరించిమింగబడునవి )
  3. లేహ్యము (నాలుక రుచి చూడబడు పచ్చళ్ళు వంటివి)
  4. చోష్యము (నోటిచే జుర్రబడునవి. పాలు లేదా పండ్ల రసం, చారు, పాయసం వంటివి.)

పచనము చేయుచూ జీవులకు మహోపకృతి నొనరించుచున్నాడు. కనుక ప్రతి యొక్కరూ భగవానుడే జీర్ణ మొనర్చుచున్నాడు అన్న ఎరుక కలిగి, ఆహార విషయములందు ఎంతో జాగరూకులై ఉండవలెను. జీవులు ఆహారము భుజించుటకు ముందు పరమాత్మకు నైవేద్యము సమర్పించ వలెను. అటు భగవంతునికి నివేదించకుండా, దైవ భావన లేకుండా భుజించుట అపవిత్రము. కనుక ప్రతి ఒక్కరూ తాము భోజనం చేయుటకు ముందుగా, ఆహారము దైవమునకు సమర్పించి భగవద్భావనతో భుజించవలెను. అప్పుడు ఆ భోజనము యజ్ఞము గాను, భుజించు పదార్థం అమృతము గాను మారిపోవును.

స్వామి చిన్మయానంద చెప్పిన కథ:-

లక్షణ రాజ్యాన్ని పరిపాలించు రాజు ఎంతో ధర్మపరుడు మరియు దయామయునిగా పేరుగాంచాడు. అతని ముఖ్యమంత్రి అయిన సత్యవ్రతుడు కూడా భక్తిపరుడు, ధర్మపరుడు రాజనీతిజ్ఞుడు కూడా. వారిరువురు రాజ్యానికి శాంతి, సంతోషాలను శ్రేయస్సును కల్గించుటకై చాలా శ్రమించేవారు. ప్రజలు కూడా వారిని ఎంతో ప్రేమించి గౌరవించేవారు.

రాజభవనంలో నిరంతరం గొప్ప సాధువులు, ఋషులు, కవులు మరియు పండితులచే సత్సంగములు జరుగుతుండేవి. ఈ సత్సంగంలో ఎక్కువగా భగవద్ విషయములు, భగవద్ మహిమలు, మహనీయుల బోధనలు చర్చించబడుతుండేవి.
కాలక్రమేణా మహా రాజు గారి చిన్న కొడుకు ఆధునిక విద్యావంతుడై రాజ్యానికి రాగా, రాజు అతనిని తన రాజ్యానికి యువరాజుగా ప్రకటించి పట్టాభిషేకం చేశాడు. ఈ యువరాజు కూడా మహారాజుగారి వలే సహృదయుడు. కానీ సభలో జరిగే భగవత్ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోలేకపోయే వాడు. అంతేకాక ఇది అర్థరహితమైన మూఢ విశ్వాసమని, అశాస్త్రీయమని అతను భావించాడు. ఈ సత్సంగ సమావేశాలను ఆపాలని తుది నిర్ణయం తీసుకుని, ముందుగా భగవంతుని గురించి నిజం తెలుసుకోవాలని మంత్రి అయిన సత్యవ్రతున్ని పిలిచి, నేను మూడు ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు సమాధానాలు చెప్పమని కోరాడు. అప్పుడు మంత్రి సత్యవ్రతుడు మూడు ప్రశ్నలు అడగమనగా, ఇలా అడిగాడు.

  1. దేవుడు ఎవరు?
  2. దేవుడు ఎక్కడ ఉన్నాడు?
  3. అతను ఏమి చేస్తాడు?

ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మీకు నేను 41 రోజులు సమయం ఇస్తున్నాను. ఈలోగా నాకు మీరు సమాధానాన్ని తెలియజేయండి. అని అన్నాడు.

భగవద్విషయంలో యువరాజును ఒప్పించడం చాలా కష్టమైనపని అని తెలిసిన మంత్రిగారు ముందుగా దేవుని ఈ విధంగా ప్రార్థించాడు.

“ఓ ప్రభూ! ఈ యువరాజుకు నీ యొక్క మహిమావిస్తారాన్ని తెలియజేయుటకు నాకు తగిన శక్తిని ఇవ్వండి అని.

ఆ తర్వాత వృద్ధుడైన మంత్రి అనేకమంది సాధువులు, ఋషులు,మునుల ఆశ్రమాలను, మఠాలను సందర్శించడం ప్రారంభించాడు. కానీ యువరాజుకు తృప్తిని కలిగించే సమాధానం అతనికి ఎక్కడా దొరకలేదు. శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు చదివాడు. సమయం మించిపోతున్నది. మహామంత్రి ఇంట్లో వంట చేయు వంటవాడు తన యజమాని పడుతున్న కష్టాలను చూసి, భగవంతుడిని రోజు, ఆ ప్రశ్నలకు సమాధానం తెలియజేయమని ప్రార్థించేవాడు. ఒక రోజు రాత్రి దేవుడు వంటవాడికి కలలో కనిపించి ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు.

గడువు తీరిపోయింది. సమాధానాలు చెప్పవలసిన రోజు రానే వచ్చింది. మంత్రిగారి వంట మనిషి తాను ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతానని మంత్రికి చెప్పాడు.

మంత్రి అతనిని రాజ దర్బారుకు తీసుకుని వెళ్లి, రాజుతో ఆ మూడు ప్రశ్నలకు సమాధానం మా వంట మనిషి చెప్తాడు అని చెప్పాడు.

యువరాజు అంగీకరించిన వెంటనే ఆ వంట మనిషి “యువరాజా! “మీ ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వాలి అంటే ముందుగా మీరు నాకు శిష్యుడిగా అవ్వాలి” అని అన్నాడు. దర్బారులో అంతా ఆశ్చర్యపోయారు. కానీ యువరాజు వెంటనే అంగీకరించాడు. అప్పుడు రాజుగారి సింహాసనంలో అతను, అతను కూర్చునే ఆసనం పై యువరాజు కూర్చున్నారు. అనగా వారిరువురూ స్థలాలు మార్చుకున్నారు.
ఇప్పుడు మొదటి ప్రశ్న, “దేవుడు ఎవరు?” అడిగాడు యువరాజు. అప్పుడు వంటవాడు ఒక సేవకుడిని పిలిచి, రాజు గారి గోశాలలో వుండే నుండి నల్లని ఆవును తీసుకురావలసిందిగా ఆదేశించాడు. నల్లని ఆవును తీసుకురాగానే సేవకుడిని ఆ ఆవు పాలు అడిగాడు. వెంటనే ఆ సేవకుడు ఒక బంగారు గిన్నెలో పాలు పితికి వంటవాడికి తెచ్చి ఇచ్చాడు.

అతను దానిని రాజుకు అందజేసి, “రాజా, గిన్నెలో పాలు కనిపిస్తున్నాయా?’ అన్నాడు.

“అవును” అన్నాడు రాజు.

“అవి ఏ రంగులో ఉన్నాయి?” అని అడిగాడు.

“అవి స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉన్నాయి.” అన్నాడు రాజు.

అప్పుడు వంటవాడు “ఈ తెల్లటి పాలు ఇచ్చిన ఆవు రంగు ఏమిటి?” అని అడిగాడు.

“నలుపు” అని చెప్పాడు యువరాజు.

“పాలు ఇవ్వడానికి ఆవు ఏమి తింటుంది?” అని మళ్లీ అడిగాడు.

“గడ్డి” అని చెప్పాడు యువరాజు.

“మరి నల్లని ఆవు తిన్న పచ్చని గడ్డిని తెల్లటి పాలుగా మార్చింది ఎవరు? మీ ఆధునిక విద్య, శాస్త్రము ఇలా చేయగలదా?” అని అడిగాడు వంటవాడు.

“ ఓ యువరాజా! నల్ల ఆవు తిన్న పచ్చి గడ్డిని తెల్లటి పాలుగా మార్చే శక్తి, ఆ దేవుడికి మాత్రమే ఉంది” అని చెప్పాడు.

అప్పుడు యువరాజు రెండవ ప్రశ్న అడిగాడు. “దేవుడు ఎక్కడ ఉన్నాడు?

అప్పుడు ఆ వంటవాడు “బంగారుపళ్ళెంలో ఒక కొవ్వొత్తిని, అగ్గిపెట్టెను తీసుకురమ్మని సేవకుడిని కోరాడు. తర్వాత దర్బార్ హాలు తలుపులు మూసేసి చీకటిగా చేసి కొవ్వొత్తిని వెలిగించారు.

అప్పుడు కొవ్వొత్తి జ్వాల చీకటిని పారద్రోలి వెలుగును ప్రసరింపచేసింది. అప్పుడు యువరాజును “ఆ కొవ్వొత్తి వెలుగు ఎక్కడ ఉంది? అని అడిగాడు.

“అన్నిచోట్లా ప్రసరించింది!” అని సమాధానమిచ్చాడు యువరాజు.

“ఈ దర్బార్ హాలులో కొవ్వొత్తి వెలుగు అంతటా ప్రసరించినట్లే దేవుడు సర్వత్ర వ్యాపించి ఉన్నాడు” అని చెప్పాడు.

అప్పుడు చివరి ప్రశ్నకు సమాధానం, “అతను ఏమి చేస్తాడు?” అని.

“ఈ విశ్వంలో జరుగుతున్నదంతా అతని సంకల్పమే. అనేక రూప నామాలతో, అణువణువునా అతను వ్యాపించి ఉన్నాడు. ఆయన లీలలు ఎవరికీ అర్థంకావు.

ఆయన ఏమి చేస్తాడు అని అడిగారు కదా మహారాజా! సేవకుడైన నన్ను రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజైన మిమ్మల్ని సేవకుడిగా మార్చాడు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి” అని అడుగగా, అతని సమాధానాలకు రాజు సంతృప్తి చెందాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *