అనన్యాశ్చింతయంతో మాం- వివరణ
అనన్యాశ్చింతయంతో మాం- వివరణ
ఎవరైతే సదా నన్నే స్మరిస్తూ ఉంటారో, నా యందే తదేక దృష్టి నిలిపి, అనన్య భక్తితో, సంపూర్ణ శరణాగతితో పూజిస్తారో, నన్నే సతతము చింతిస్తారో వారి యొక్క యోగక్షేమములను సంరక్షిస్తాను అని ఈ శ్లోకం ద్వారా భగవానుడు వాగ్దానం చేస్తున్నాడు.
అటువంటి భక్తులకు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధము ఉండదు. భగవంతునితో ఒక్క క్షణం వియోగం కూడా భరింపలేనిదిగా ఉంటుంది. గోపికలది అటువంటి అనన్య భక్తి. ఒక ఉదాహరణ- ఒకసారి గోపికలు బ్రహ్మ దేవుని ఇలా ప్రార్థించారు. బ్రహ్మదేవా మీరు మాకు కనురెప్పలు ఎందుకు ప్రసాదించారు? ఆ కనురెప్పలు మూసుకుంటూ తెరుచుకుంటూ ఉంటాయి. ఆ కనురెప్పలు మూతపడిన సమయంలో మేము కృష్ణుని దర్శించలేకుండా ఉన్నాము, అంటే ఆ కనురెప్పపాటు వియోగము కూడా మేము సహించలేము అని ప్రార్థించారు/ మొరలిడారు.
ఒకసారి నారదుడు హనుమంతుని మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతారు అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు బదులిచ్చాడు రామ నామం జపించడానికి నాకు సమయమే సరిపోవటం లేదు అని. భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు అనేక కష్టములకు, బాధలకు లోబడ్డను, పరిపరి విధములుగా అనేక హింసలకు గురి అయినప్పటికీ హరితప్ప వేరే చింత లేక, పూవుటచేత, శరణాగతితో, అనన్య భక్తితో విశ్వాసంతో ప్రార్థించడం చేత, ఆ హరి అతనిని అన్ని విధములుగా సంరక్షకుడై కాపాడినాడు. నిజమైన భక్తులకు భగవంతుడే స్నేహితుడు, మార్గదర్శకుడు మరియు తత్వబోధకుడు. భగవంతుడు తన భక్తుని అన్నివేళలా అన్ని విధముల సంరక్షిస్తూ ఉంటాడు.
సత్య, ధర్మ, శాంతి, ప్రేమ మార్గములను అనుసరిస్తూ/ ఆచరిస్తూ నిరంతరము భగవంతుని నామము స్మరిస్తూ, పరమాత్మ ని శరణు జొచ్చి, అన్య చింతలకు చోటు ఇవ్వక ఉండిన, తన అపార కృపతో సర్వస్వము తానే అయి మన పాత్రత ఎరింగి తదనుగుణంగా సర్వము తానే చూచుకొనును/ సమకూర్చును. ఈ అనుగ్రహ ప్రాప్తికి, కృపకు ప్రధానంగా కావలసినది “అనన్య చింతన” – అనన్య చిత్తముతో భగవంతుని స్మరించుట, చిత్తమును భగవంతుని మీద పెట్టుట, అర్పితము చేయుట మరియు “ఉపాసన” – నిచ్చల భక్తితో అర్చించుట. లేని వస్తువును పొందుటను ‘యోగము’ అంటారు. పొందిన వస్తువును రక్షించుకొనుటను ‘క్షేమము’ అని అంటారు. కావలసినది సంరక్షించుకొనుటకు సాధనా మార్గము అనన్య చింతన – అనన్య చిత్తముతో సదా సర్వదా భగవంతుని చింతించుచుండుట.
ఈ శ్లోకము భగవంతుని అనుగ్రహ ప్రాప్తికి ఒక డిక్లరేషన్ వంటిది.
[గీతా స్వరూపమునకు ఈ పరమ పవిత్ర పదము (యోగక్షేమము) పరమ నాభి వంటిది. సృష్టికర్త అయిన బ్రహ్మకు విష్ణు నాభి ఎట్లు జన్మస్థానమో, బ్రహ్మ జ్ఞానమును పొందగోరు గీతా పారాయణ ప్రచార సాధకులకు ఈ యోగక్షేమం వహామ్యహం అట్టి స్థానము వంటిది. దీనిని అనుసరించిన గీత పూర్తిగా అర్థము కాగలదు (గీతా వాహిని – 18)]
ఆధ్యాత్మిక స్థాయిలో జీవిత పరమావధిని తెలిపే ఉత్కృష్టమైన శ్లోకము.
ఏ పరమ భక్తులు ఇతర చింతనలను చేరనివ్వక, సర్వకర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో, సలుపుదురో, నిరంతరము నన్నే ధ్యానించి, సేవించి, పూజించి, స్మరింతురో, అట్టి సర్వకాలమునందు సమాహిత చిత్తులైన వారి యోగక్షేమములను నేను స్వయముగా చూచుకొందునని కృష్ణ పరమాత్ముడు అభయమిస్తున్నాడు. ప్రాపంచిక దృష్టితో చూసిన అటువంటి భక్తుల మౌలిక అవసరాలను (తిండి, వస్త్రము,ఆవాసము) భగవంతుడే చూసుకుంటాడు/ సమకూర్చుతాడు అని అర్థము. భగవత్ సాక్షాత్కారము పొందగోరు ప్రతి ఒక్క నిజమైన సాధకునకు కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి అభయమిది.
భగవద్ అనుగ్రహ ప్రాప్తికై ప్రాకులాడు నిజమైన సాధకుడు విషయాసక్తుడు కాకుండా తన లక్ష్యసాధన లో మరింత ఉన్నత స్థాయికి చేరటానికి కృషి చేస్తూ ఉన్నప్పుడు పరమాత్ముడు ఆ సాధకునకు అవసరమైన ప్రాపంచిక అవసరములను సమకూర్చి, పరమాత్మ తన ప్రేమామృత రసములో ఓలలాడిస్తాడు. ప్రతిక్షణం పరమాత్ముడు తన భక్తులను కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటాడో అన్నది అనేక మహనీయుల చరిత్రల నుండి మనకు విశిదమే. తన జీవితమును శ్రీరాముని సంకల్పమునకు వదిలివేసి, సమర్థ రామదాసు గృహము వీడినప్పుడు రామదాసు యొక్క యోగక్షేమములన్ని ఆ పరమాత్ముడే చూసుకున్నాడు.
దీనికి మరొక అర్థము భక్తుల యొక్క మౌలిక అవసరములే కాక వారి ఆధ్యాత్మిక పురోగతికి కూడా తోడ్పడుతూ బ్రహ్మ జ్ఞానమును ఆత్మకు సాక్షాత్కారమును ప్రసాదిస్తాడు. కనుక మొదటిది యోగము – అంటే తన భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదని తానే ప్రసాదిస్తాడు – భౌతిక అవసరములు
రెండవది క్షేమము – తన భక్తులకు ఉన్న ఆధ్యాత్మిక సంపదలని సంరక్షిస్తాడు.
ఆ విధంగా తన భక్తులకు ఏ ఆపద కలుగకుండా చూచుకుంటాడు. అలాగే భక్తుడు కూడా అన్య చింతన లేక తన లక్ష్యమైన భగవంతుని యందే తన చిత్తమును నిలిపి ఉంటాడు . నర్సి మెహతా, నామదేవ్, సక్కుబాయి, జానాబాయి, గురునానక్ మొదలైన భక్తుల యొక్క జీవిత చరిత్రలు చూసిన భగవంతుడు అడుగడుగునా వారిని కంటికి రెప్పలా ఎలా కాపాడుతూ , సంరక్షిస్తూ వచ్చాడో మనకు అవగతం అవుతుంది/ తెలుస్తున్నది.
అనన్య భక్తిని కలిగిన భక్తుని యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అంటే- నిరంతరము భగవంతుని గురించి సంభాషిస్తూ, పరమాత్మని లీలలు గానము చేస్తూ, దర్శిస్తూ తను చేసే ప్రతి పని, గడిపే ప్రతి నిమిషము భగవదర్పితం కావిస్తాడు.