తిండినిబట్టి బుద్ధి

Print Friendly, PDF & Email
తిండినిబట్టి బుద్ధి

మహాభారత యుద్ధంలో పదవ రోజు భీష్ముడు పడి పోయాడు. ఆ రోజునుండి 18వ రోజు యుద్ధము ముగిసేవరకు కృష్ణుడు అన్నీ పర్యవేక్షించాడు. భీష్ముడు మాత్రం అర్జునుడు ఏర్పరిచిన అంపశయ్య మీదనే పడుకొని ఉత్తరాయణం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. యుద్ధం ముగిసింది. విజయులైన పాండవులు, ద్రౌపదితో సహా భీష్ముని ఆశీర్వాదం పొందడానికి వచ్చారు. అంపశయ్యమీది నుండే భీష్ముడు పాండవులను చేర బిలిచి ధర్మసూత్రాలు చెప్పసాగాడు. ఇదే భారతంలో శాంతిపర్వంగా పేరు పొందింది.

ఈ విధంగా భీష్ముడు పాండవులకు నీతి విషయాలు బోధిస్తున్న సమయంలో, వింటున్న ద్రౌపది చిన్న నవ్వు నవ్వింది. అది అందరి కంట బడింది. ధర్మరాజుకు ద్రౌపది పెద్దలముందు ఆ విధంగా నవ్వడం అమర్యాదకర ప్రవర్తనగా తోచి మందలించాడు. కాని భీష్ముడు “అమ్మా ! నీవు ఊరకే నవ్వేదానివి కాదు. దగ్గరకు వచ్చి కారణం చెప్పు. సంతోషిస్తాను” అని అనునయంగా పిలిచాడు.
ద్రౌపది “క్షమించండి. నేను మిమ్మల్ని గాని, మరెవ్వరినిగాని, అపహాస్యం చేయలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నా సందేహము తీర్చమని కోరుతున్నాను,”అన్నది

అందుకు భీష్ముడు చాలా సంతోషించి “దీర్ఘ సుమంగళిగా వర్థిల్లుతావు తల్లీ ! నీ సందేహ మేదో సంకోచం లేకుండా చెప్పు” అన్నాడు.

ద్రౌపది సవినయంగా చెప్పింది. “ఆనాడు నన్ను సభా మంటపంలో అందరి ఎదుట అవమాన పరచడానికి కౌరవులు ప్రయత్నించినపుడు, కుటిల నీతితో జూదంలో పాండవులను ఓడించి పన్నెండేళ్ళు వనవాసము, ఒక సంవత్సరము అజ్ఞాత వాసము విధించినపుడు, ఈ నీతి బోధ ఏమయింది? ఈనాడు ధర్మయుద్ధంలో కౌరవులను తమ పరాక్రమంతో ఓడించిన ధర్మమూర్తులని పేరు పొందిన పాండవులకు నీతి బోధ చేస్తున్నారే! ఈ నీతి సూత్రాలు బోధించవలసిన దుర్యోధనాదులకు ఎందుకు బోధించలేదు? దీనిలో ఉండే అంతరార్థము నాకు గోచరించక, వింతగా తోచి నాలో నేను నవ్వుకున్నాను. ఇంతేగాదు. మాయా ద్యూతంలో పాండవులను ఓడించి వారిచేత సర్వస్వము చివరకు కట్టుకొన్న భార్యనైన నన్ను కూడా పణంగా పెట్టించారు. అది చాలక మాకు వనవాసం విధించారు. ఇదేనా ధర్మము? జూదంలో తాను ఓడిన తర్వాత నన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు హక్కు ఉన్నదా? ఈ ధర్మ సందేహము నేను ఆనాడే సభాముఖంగా వెలిబుచ్చాను. కాని పెద్దలైన మీరెవ్వరూ తీర్చలేదు. ఆనాడుఈ ధర్మబోధ అవసరము రాలేదా ? కాని ఈనాడు ధర్మం తప్పి చరించడం తెలియని పాండవులకు వివరంగా ధర్మ బోధ చేస్తున్నారు మీరు. ఇది నిజంగా వింతగా తోచింది, నవ్వాను” ద్రౌపది పలికిన ఈ మాటలు విని అందరు ఆశ్చర్యంగా చూచారు. చావుబ్రతుకుల్లో ఉన్న భీష్ములవారితో ఈ విధంగా ద్రౌపది ఎందుకు మాట్లాడుతున్నదా అని ధర్మరాజుకు అర్థం కాలేదు. కాని భీష్ముడు ద్రౌపదితో “తల్లీ అడగవలసిన మాటలు అడిగావు. ఇందుకు నిన్ను అభినందిస్తున్నాను. ఈ ప్రశ్నలకు జవాబులు రాబోతున్న కలియుగానికి ఎంతో ఉపకరిస్తాయి. అందరు జాగ్రత్తగా వినండి. ద్రౌపది సందేహాలకు సమాధానం చెప్తున్నాను” అని చెప్ప సాగాడు.

“చాలా కాలం నుండి నేను అహంకారయుతులైన చక్రవర్తుల తిండి తింటున్నాను. ఈ కారణంగా నాలో ఉన్న ధర్మ చింతన, ధర్మాచరణ అణగారిపోయాయి. రక్తం అంతా కలుషితమయింది. కాని ఈనాడు అర్జునుని బాణాలు నా శరీరంలో తూట్లు పొడిచి నా చెడు రక్తమంతా కారిపోయింది. అణగారి పోయిన ధర్మం, సద్బుద్ధి బయట పడ్డాయి, కాబట్టే నా నోటిలో నుండి ఈనాడు ఈ ధర్మ సూత్రాలు వస్తున్నాయి. అవే వాళ్ళ శ్రేయస్సు గోరి పాండవులకు చెప్పాను”.

భీష్ముని ఈ మాటల ద్వారా గ్రహించదగిన సత్యము ఒకటుంది. మనము తిను ఆహారము అపవిత్రమయినదయితే, మన భావాలు అపవిత్రం అవుతాయి. ఈ భావాలను బట్టి మాటలు, చేసే కార్యాలుగూడా ఉంటాయి.

ప్రశ్నలు :
  1. ద్రౌపదికి వచ్చిన సందేహము ఏది ?
  2. మనము తిను ఆహారము మన భావాలపై ఎట్టి ప్రభావము కలిగి యుండును?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *