కోపము పాపమునకు హేతువు
కోపము పాపమునకు హేతువు
బాబూ రాజేంద్రప్రసాద్ మన దేశానికి రాష్ట్రపతిగా ఉండగా ఆయనకు “రత్నా” అను పేరుగల అంతరంగిక పరిచారకుడు ఉండేవాడు. రత్నా చాలా నిజాయితీపరుడు. తన యజమాని యెడల అత్యంత విశ్వాస పాత్రుడై ఉండేవాడు. అతను తన యజమానికి ఎప్పుడెప్పుడు ఏది అవసరమో దానిని సిద్ధంగా తయారుచేసి వుంచేవాడు.
ప్రతి రోజులానే ఒక రోజున రత్నా బల్లను తుడిచి, శుభ్రపరుస్తున్నాడు. బల్ల మీద ఉన్న కాగితాలను సర్దుతుండగా ఒక కలం జారి క్రింద పడింది. అతను వెంటనే పైకి ఎత్తి చూసే సరికి దాని పాళీ మొన విరిగిపోయింది. అది చూచి భయంతో కంపించి పోయాడు. అదే సమయానికి రాజేంద్రప్రసాద్ గదిలో ప్రవేశించి జరిగింది చూచాడు. ఆ కలం ఆయనకు ఒక ఆప్త మిత్రుడు బహుకరించినది. చాలా ఖరీదైనది కూడా. ఆ మిత్రుడంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. రత్నాని చెడామడా తిట్టి బయటకు పొమ్మన్నాడు. “ఇక నా దగ్గర నీవు పనిచేయవద్దు” అన్నాడు.
తన యజమాని అంటే రత్నాకి ఎంతో ప్రేమ. ఆయన్ని విడిచి ఉండలేడు. వెంటనే బాబూ కాళ్ళమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ క్షమించమని బ్రతిమాలుకున్నాడు. కాని రాజేంద్ర ప్రసాద్ కరగలేదు. పగలు గడిచిపోయింది. కార్యక్రమాలన్నీ పూర్తి అయిన తరువాత పడుకొనే ముందు రాజేంద్రప్రసాద్ గారికి ఈ సంఘటన జ్ఞాపకం వచ్చింది. జరిగింది అంతా ప్రశాంతమైన మనసుతో ఆలోచించుకున్నాడు. రత్నా చేసిన పొరపాటేమిటి? కలం పాళీ పాడై పోయింది. అసలు తానే కదా ఆ కలాన్ని బల్ల మీద తెరిచిపెట్టింది. తను ఆ కాయితాల మధ్యలో పెట్టడంచేత రత్నాకు కనిపించలేదు. రత్నా చేసిన తప్పేముంది! అవును,”అతను నిర్దోషి”.
వినయం కలవాడు! దానికితోడు చాలా నిజాయితీపరుడు. అన్నిటికన్నా మించి అతను నా శ్రేయస్సు కోరేవాడు. ఈనాడు అతన్ని చాలా బాధపెట్టాను. క్రూరంగా ప్రవర్తించాను అని పరిపరివిధాల పశ్చాత్తాపపడుతూ రాత్రంతా నిద్రపోలేదు.
అలాగే తెల్లవారి పోయింది. మంచం మీద నుంచి లేస్తూనే రత్నాని రమ్మనమని కబురు పెట్టాడు. రత్నా గదిలోనికి వచ్చాడో లేదో వెంటనే అతని చేతులు తన చేతులలోనికి తీసుకొని స్వంత మిత్రుడిలా కరచాలనం చేశాడు. “రత్నా నన్ను క్షమించవూ” అని ఎంతో పశ్చాత్తాపంతో అడిగాడు. “నేను నిన్ను అనవసరంగా కోప్పడ్డాను. మామూలుగా నీ పని నీవు చేసుకో. నేను నిన్ను విడిచి పెట్టను” అంటున్న యజమానిని చూస్తూ నివ్వెరపోయాడు రత్నా.
అతని ముఖంలో ఆనందము వెల్లివిరిసింది. ఏమి మాట్లాడాలో తెలియక బాబూ పాదాల మీదపడి వెక్కివెక్కి ఏడ్చాడు. ఆ మహనీయునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రాజేంద్రప్రసాద్ చాలాసార్లు ఈ సంఘటన గూర్చి చెపుతూ ఉండేవాడు. ఇతరులను కోపగించుకొని, శిక్షించే ముందు బాగా ఆలోచించు అనేవాడాయన. కోపము కాట్లకుక్క వంటిది. దాని నెప్పుడూ గొలుసువేసి లోపల కట్టివెయ్యాలి. ఎదుటివాడు దొంగో, దుర్మార్గుడో అని ధృఢపడితే తప్ప దానిని ఉపయోగించ
కూడదు. లేకపోతే అది ప్రతి ఒక్కరి మీదపడి కరిచే ప్రమాదం వుంది. ఒక్కొక్కప్పుడు నిరపరాధికి కూడా దానివల్ల అపరాధం జరుగుతుంది. తప్పులుచేయుట మానవునికి సహజము. క్షమ దైవలక్షణము. అనవరతము (ఎల్లవేళల) దాన్ని అణిచి పెట్టాలి అని ఎప్పుడు అందరికీ వివరిస్తూ ఉండేవాడు.
ప్రశ్నలు:
- కోపము ఒక కుక్కవంటిది – ప్రేమయే భగవంతుడు? వివరింపుము.
- “కోపము వల్ల తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరికి పడే ప్రమాదం ఉంది” అని ఎవరన్నారు? నీవేమంటావు?
- కారణాలు వివరిస్తూ వ్రాయుము ఎ. నీవు అనవసరంగా కోపగించిన సంఘటన;