భగవద్గీత – అధ్యాయం XIII-XVIII
భగవద్గీత – అధ్యాయం XIII-XVIII
అధ్యాయము 13.క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
ఆత్మ మరియు శరీరము
ఈ అధ్యాయంలో క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఉపాధి, ప్రత్యగాత్మ; జ్ఞానము-జ్ఞేయము
ప్రకృతి-పురుషుడు.. వీటి స్వభావములు శాశ్వతము, అశాశ్వతములని వివరింపబడినవి. ఈ రెండింటి యొక్క విభేదమును గూర్చి తెలుపబడింది.
అధ్యాయము 14. గుణత్రయ విభాగ యోగము
త్రిగుణముల వివరణ
బ్రహ్మం ఒక్కటే సత్యము. అయితే మనం దానిని ఎందుకు గ్రహించలేకపోతున్నాము? మనకు దానికి మధ్య ఉన్న అడ్డంకి ఏమిటి? ప్రకృతి చేత సంభవించబడిన మూడు గుణాలు నశించలేని ఆత్మను దేహం నందు బంధించుచున్నవి. ఈ సత్యం నుండి మనల్ని దూరం చేస్తున్న ప్రకృతిని అధిగమించటానికి, త్రిగుణముల స్వభావం గురించి సరియైన అవగాహనను ఏర్పరచుకోవాలి. ఈ త్రిగుణములు సత్వగుణము రజోగుణము మరియు తమోగుణముగా వర్ణించబడినవి. మరియు వాటి స్వభావము, వాటి శక్తి, అవి జీవుని ఎలా బంధించుచున్నవి? దాని నుండి విముక్తి పొందగలుగు ఉపాయములు.. ఇవన్నీ ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి. చివరగా గుణాలను అధిగమించిన గుణాతీత లక్షణాలు ఇవ్వబడ్డాయి. గుణాతీతుడగుటకు అవసరమైన సాధనలు కూడా ఈ అధ్యాయంలో వివరించబడ్డాయి.
అధ్యాయము 15 పురుషోత్తమ ప్రాప్తి యోగము
పరమాత్మ/దేవుడు
ప్రకృతి వల్లనే జీవుడు సంసారబంధంలో బంధించబడతాడు. ఈ అధ్యాయంలో సంసార వృక్షం యొక్క వర్ణన మరియు వైరాగ్యము ద్వారా పురుషోత్తముణ్ణి పొందు మార్గము చెప్పబడినది.
అధ్యాయము 16 దైవాసుర సంపద్విభాగయోగము
దైవిక గుణములు మరియు రాక్షస గుణములు
వైరాగ్యాన్ని పొందడానికి మనిషి తన అసురీ లక్షణాలను వదిలిపెట్టి దైవీ సంపత్తులు పెంపొందించుకోవాలి. ఈ అధ్యాయంలో అసురీ లక్షణాలు మరియు దైవిక లక్షణాలు వివరించబడ్డాయి. ఇంకా “ఏది చేయటం ఒప్పు? మరియు ఏది తప్పు?” అన్న సందిగ్ధంలో లేఖనాలు, ఉత్తమ మార్గదర్శకాలు, శాస్త్రోక్తమైన విధులను పాటించి, తదనుగుణంగా ఈ లోకంలో ఎలా ప్రవర్తించాలి అన్నది వివరించబడినవి.
అధ్యాయము 17 శ్రద్ధాత్రయ విభాగయోగము
మూడు విధములకు శ్రద్ధ
అందరి జీవితాలలో తప్పనిసరిగా, విజయవంతంగా సాగు చేసుకొన వలసినవి దైవీ సంపద, సత్య గుణము మరియు విశ్వాసము. ఈ అధ్యాయంలో ఆహారపు అలవాట్లు, శ్రద్ధ, యజ్ఞము, దానము మరియు తపస్సులకు సంబంధించిన సాత్విక, రాజసిక మరియు తామసిక అంశాలు వివరంగా వివరించబడ్డాయి. అంతేకాక రజోగుణ, తమోగుణ అలవాట్లను విడిచిపెట్ట వలెనని అధ్యాయం వివరిస్తుంది. సాత్విక గుణంతో ఏది చేసినా అది సాక్షాత్కారానికి సంబంధించిన అంతిమ లక్ష్యానికి దారితీస్తుంది.
అధ్యాయము 18 మోక్ష సన్యాస యోగము.
బంధము నుండి విడుదల
ముందు పదిహేడు అధ్యాయాల బోధనల సారాంశం క్రుప్తంగా సమీక్షించబడినది. మరియు త్యాగము, జ్ఞాన, కర్మ, బుద్ధి, ధృతి, సుఖ వంటి ఆధ్యాత్మిక పదాలు సాత్విక, రాజసిక మరియు తామసిక స్వభావాలకు సంబంధించి వివరించబడ్డాయి.చాతుర్వర్ణాలకు చెందిన వ్యక్తుల విధులు, లక్షణాలు మరియు బాధ్యతలు ఇంకా యజ్ఞము, దానము మరియు తపస్సు, జీవులకు అనివార్యమైన క్రమశిక్షణ మరియు బాధ్యతలు, జీవుని అంతిమ విముక్తికి నిష్కామకర్మ, యోగాభ్యాసం, భక్తి, వైరాగ్యము మరియు సన్యాసము సాధనలుగా ఉద్భోదించబడినవి. ఈసాధనల ద్వారా మనుజుడు అత్యున్నత జ్ఞానాన్ని పొంది, సర్వాత్మ భావనను పొందుతాడు. దుఃఖాన్ని అధిగమించి మోక్షాన్ని పొందుతాడు.
గీతా బోధనల సారాంశము
ప్రధాన బోధనలు
- సమస్త కార్యకలాపాలను భగవదారాధనగా నిర్వర్తించాలి. ఏకాత్మ భావనతో కూడిన భక్తితో అందరికీ సేవ చేయాలి. అప్పుడే జ్ఞానాన్ని మరియు సర్వాత్మ భావాన్ని పొందుతారు. దాని ఫలితంగా కామ, క్రోధాధులను త్యజించగలుగుతారు. దాని ఫలితంగా యజ్ఞము (నిష్కామ సేవ), దానము మరియు తపస్సు చేయగలుగుతాడు.
- ధర్మానికి కట్టుబడి, భగవంతుడే ఏకైక గమ్యంగా భావించి, తాను ఎలా ప్రవర్తించాలి అన్న సూత్రాలను గ్రహించి, మన జీవితాల్లో ఆచరణలో పెడితే ప్రపంచంలో శాంతి మరియు ఆనందం వెళ్లి విరుస్తాయి. అంతేకాక అది ముక్తికి కూడా దారి అవుతుంది.
పైన పేర్కొన్న సంక్షిప్త సారాంశానికి మహాత్మా గాంధీ గారు భగవద్గీత గురించి చెప్పినది ప్రస్తావించడం కంటే సరియైన ముగింపు మరొకటి ఉండదు. “గీత నాది మాత్రమే కాదు.బైబిల్ లేదా ఖురాన్ .అది అంతకంటే ఎక్కువే. నా తల్లి చాలాకాలము క్రిందటనే చనిపోయినది.కానీ గీత యను తల్లి ఆ స్థానమును ఆక్రమించుకొని అప్పటి నుండియు నాప్రక్కనే వుండి నన్ను కాపాడుచున్నది. కష్టములు కలిగినప్పుడు నేను ఆమె ఒడిలో తలదాచుకొందును. నిరాశ నిస్పృహలు నన్ను ఆవరించినప్పుడు, నేను భగవద్గీతను తెరచి చూచుదును. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును. అప్పుడు నా ముఖంపై చిరునవ్వు తాండవించును. నా జీవితము అనేక ఒడిదుడుకులతో కూడి యున్ననూ అవి ఏవియు నా మనసులో అశాంతిని కలగజేయవు. ఎందుకనగా అది అంతయూ గీతా ప్రబోధం యొక్క సత్ఫలితమే. నేను “భగవద్గీత” ఒక్క బోధనలకు ఋణపడి ఉంటాను.
భగవద్గీత కించిదథీతా
తస్య యమః కిం కురుతే చర్చామ్||
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే||
“భగవద్గీతను కొంచెం అయినను చదివిన వాడు యమునితో ఘర్షణ పడడు. అనగా మరణ భయము లేదు. అతడు గోవిందుని పొందుతాడు.