భారత దర్శనము

Print Friendly, PDF & Email

భారత దర్శనము

వివేకానందుడు రామకృష్ణపరమహంస యొక్క దివ్యసందేశమును మొదట భారత దేశమంతట వ్యాపింపచేయ సంకల్పించెను. దాని కనుగుణ ముగా భారతదేశమంతటను పర్యటించి, మాతృదేశ పరిస్థితులను కన్నార ప్రత్యక్షముగా చూచి, ఉచితమైన విధముగా ఒక బృహత్ ప్రణాళికను సిద్ధము చేయనెంచెను.

రామకృష్ణపరమహంస నిర్యాణానంతరము శారదాదేవి పరివ్రాజిగామారి యువసన్నాస శిష్యులందరిచేత మాతృదేవిగా, ఆధ్యాత్మిక మార్గదర్శినిగా గౌరవింపబడెను. 1890 జులై నెలలో వివేకానందుడు మాతృదేవి అనుమతి తీసుకొని భారతయాత్రకు బయలుదేరెను. దాదాపు అయిదేళ్ళపాటు వివేకానందుడు, చాలవరకు పాదచారియై, భారతదేశమంతయు వర్యటించెను. ఆ యాత్రలో అతడు తరచుగా ఉపవాసములు చేయవలసి వచ్చెను; అడవులలో, ఎడారులలో ఒంటరిగా నడచిపోవలసివచ్చెను; కొన్ని సార్లు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చెను. కాని, ఎన్ని కష్టములు వచ్చినను, ఎన్ని అపాయము ఎదురైనను వివేకానందుడు చలింపక, స్ధిరుడై, నిజమైన సన్న్యాసిగా జీవితమును గడపెను. ఒకరోజు కుగ్రామములో ఇంటింటికి తిరిగి భిక్షను బిచ్చమెత్తుకొనవలసి వచ్చెడిది; మరియొకరోజు ఏ మహారాజు నింటనో, దివానునింటనో ఆతిధిగానుండెడి గౌరవము లభించెడిది. ఒకసారి పూరిగుడిసెలలో నివసించుచు దుర్భరమైన దారిద్ర్యముతో పడరానివంతలు పడుచున్న బీదబడుగు ప్రజలను చూచుచు యాత్రసాగెడిది. మరియొకసారి సిరిసంపదలతో తులతూగుచున్న రాజులను, వారి భవనములను చూచుచు సాగవలసివచ్చెడిది. ఈ యాత్రలో వివేకానందునికి భారతదర్శనమైనది. వివిధ జాతులతో, వర్ణములతో, భాషలతో, ఆచారవ్యవహారములతో, వైవిధ్యమెంతయో వ్యాపించియున్న భారతదేశమునందు వాని అన్నింటిమధ్య పూలలో దారమువలె వెలుగొందుచున్న ఏకత్వము వివేకానందుడు దర్శింపగలిగెను, మనదేశప్రజలలోనున్న బలహీనతలను, శక్తినిగూడ గ్రహింపగలిగెను. విశేషానుభవమును గడించెను. ఆ అనుభవమును తరువాత కాలమున ప్రపంచరంగమున ఒక ప్రవక్తగా, ప్రయోక్తగా ప్రకాశించునపుడు తగిన విధముగా ఉపయోగించుకొనెను. ఈ భారతయాత్రలో వివేకానందుడు చూచిన ప్రజల దుర్భర దారిద్ర్యావస్థ అతని హృదయములో జీవితాంతము వరకును ప్రతిధ్వనించుచుంచెడిది. “ఆ దరిద్రనారాయణుల కెట్లు సహాయము చేయవలెను? ఎట్లు సహాయము చేయవలెను?” ఈ ప్రశ్నయే తరువాత జీవిత కాలమంతయు అతనీ హృదయమున నిండి యున్నది. అతిని ఆధ్యాత్మిక ప్రచారములో అది ప్రాముఖ్యము వహించినది.

దేశాటన సందర్భమున వివేకానందుడు ఆ కాలమున ప్రసిద్దులై వ్యక్తులలో చాలమందిని కలిసికొనెను. సంస్థానాదిపతు లెందరో వివేకనందుని దర్శించి అతనికి మిత్రులుగాను, శిష్యులుగాను మారిరి, వారిలో అతని ముఖ్యశిష్యునిగా మారిన ఖేత్రీ సంస్థానాధిపతి మహారాజు అజిత్ సింగ్ ను పేర్కొనవచ్చును. వివేకానందుడు అల్వాల్ సంస్థానమున సంచారము చేయునప్పుడు ఒక చిన్నయుదంతము జరిగేను. ఉదంతము చిన్నదయ్యును విశిష్ట మైనది. మనకొక సందేశము నిచ్చునది. అల్వాల్ సంస్థానమునకు చెందిన మంత్రి, ప్రభువు పక్షమున వివేకానందుని ఆహ్వానించెను, యువకుడైన ఆ మహారాజు పాశ్చాత్య విద్యనభ్యసించి, అధునిక భావములతోపాటు నాస్తిక ప్రవృత్తిని అలవరచుకొనియుండెను. అందువలన అతడు స్వామిని తిరస్కారభావములో ఇట్లు ప్రశ్నించెను- “స్వామి! మీరు భగ వంతుని గూర్చి ఇంతగా మాట్లాడుచున్నారు. దేవాలయములలోని శిలావిగ్రహములను మీరు నమ్మెదరా?” ఆ ప్రశ్నకు వివేకానందుడు “అవును, నిస్సంశయముగా నమ్మెదను” అని సమాధానము చెప్పెను. “అయితే శిలతో చేయబడిన వస్తువులందు దేవుడెట్లుండును?” అని మహారాజా మరల ప్రశ్నించెను. స్వామి మంత్రివైపు తిరిగి “గోడకు వ్రేలాడదీయబడియున్న ఆ మహారాజాచిత్రమును ఒకస్కా తీసి నాకిచ్చెదరా?” అని అడిగెను. మంత్రి చిత్రమును తీసి స్వామిచేతికిచ్చెను. అప్పుడు “మంత్రిగారూ! ఈ పటము మీద ఉమ్మివేయుడు. పటము మహారాజుకాడుకదా!” అని స్వామి అనెను. మంత్రి తత్తరపడి “కాదు కాదు, ఆపటము మహారాజా కాకుండు ఎట్లు?” అని పలికెను. అప్పుడు వివేకానందుడు మహారాజావైపు తిరిగి అతనితోనిట్లనెను- “నేనన్న అంశము మీకు ఇప్పుడర్థమైనదా? శిలా విగ్రహము చిత్రపటమువలెనే ఒకప్రతీక, నిత్యసత్యస్వరూపుడైన భగవంతుని పవిత్రప్రతిబింబము.” ఆ మాటలలోని తత్త్వమును తెలిసికొని మహారాజు తన అభిప్రాయములను మార్చుకొనెను.

మౌంట్ అబూలో ఒక మహమ్మదీయుడు స్వామిని తనయింటికి ఆహ్వానించెను. హిందువుకానివానియింట స్వామి భుజింపడేమో అని అనుమానించి ఆ మహమ్మదీయుడు భోజన మిడుటకు తటపటాయించుచుండెను. స్వామి అతని భావములను గ్రహించి ఇట్లనెను- “నాదృష్టిలో జాతులు, కులములు అన్నియు సమానమే. అందరు నాకు సోదరులే.”

పూనాలో స్వామి గొప్పదేశనాయకులై న బాలగంగాధర తిలక్ గారింట వసించెను.స్వామి వివేకానంద పాశ్చాత్యదేశములలో పయనించి వేదాంత సిద్ధాంతములలోని విశ్వజనీనతను ప్రచారముచేయుటకొరకు తగిన ఆర్థిక సహాయమును మైసూరు మహారాజా సమకూర్చుటకు ఉన్నత గౌరవభావ ముతో, ఔదార్యముతో ముందుకు వచ్చెను. స్వామి వివేకానంద మైసూరు నుండి త్రివేండ్రమునకును, కన్యాకుమారికిని వెడలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *