భరతుని రాక
భరతుని రాక
రాముడు వనవాసానికి వెళ్లిన వెంటనే దశరధుని హృదయం విలపించింది. ఎప్పుడూ, “రామా!లక్ష్మణా! జానకీ!” అని కలవరిస్తూ, క్రమక్రమంగా ఆయన పరిస్థితి క్షీణించి శాశ్వతంగా కన్నుమూశాడు.
అయోధ్య అంతా దీనంగా శోకించింది. రాముని నిర్గమనం, చక్రవర్తి మరణం జనులను దుఃఖసాగరంలో ముంచాయి. వశిష్టుడు ఎవ్వరిని రోదించవద్దని చెప్పి, మేనమామ నగరంలో ఉన్న భరత శత్రుఘ్నులను వెంటనే అయోధ్యకు పిలిపించాడు.
వారిద్దరూ వెంటనే తిరిగి వచ్చారు.అయోధ్య నగరంలో ప్రవేశించిన భరత శత్రుఘ్నులకు నగరమంతా కళావిహీనంగా కనిపించింది. వారికి ఏమీ అర్థం కాలేదు. వారిని చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ ముఖం తప్పించుకుంటున్నారు. భరతుడు నేరుగా తన మాతృమూర్తి మందిరానికి చేరాడు. కైకేయి అతనికి పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది. కానీ భరతుని మొదటి ప్రశ్న “తండ్రిగారు ఏరి? వారు ఎప్పటివలే నాకు ఎందుకు ఎదురు రాలేదు? అన్న గారు రాముడు కానీ, లక్ష్మణుడు కానీ కనిపించరేమీ?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించసాగాడు.
కైకేయి అతని తీరు చూసి భయపడి విషయం మంథరను చెప్పమన్నది. మంథర ఎంతో మురిపెంగా “నాయనా, ఇదంతా నీ కోసమే. ఇంక నీదారికి ఏ అడ్డు లేకుండా చేసింది మీ తల్లి. అయోధ్యా నగర చక్రవర్తి గా నీవు వెంటనే పట్టాభిషేకానికి సిద్ధం కావాలి. అదృష్టవశాత్తూ మీ తండ్రిగారు హఠాత్తుగా మరణించారు” అన్నది.
భరతునికి ఏమీ అర్థం కాలేదు. తండ్రిగారి మరణవార్త అతనిని కృంగ దీసింది. “తండ్రిగారికి జబ్బు చేస్తే మమ్మల్ని ఎందుకు పిలిపించలేదు. జ్యేష్ఠుడు రామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకం ఎందుకు? నాకు అంతా అయోమయంగా ఉన్నది” అన్నాడు. కైకేయి భరతుణ్ణి దగ్గర తీసి “ఇదంతా నీకోసమే నాయనా! మంథర ఎంతో నేర్పుగా ఇదంతా ఏర్పాటు చేసింది”. మీ తండ్రిగారు తప్పని పరిస్థితుల్లో రాముని వనవాసానికి పంపడం, నీకు పట్టాభిషేకం చేయటం వంటి పరిస్థితి కల్పించింది. భరతుడు క్రమంగా పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఒక్క తోపుతో తల్లిని విదిలించాడు. “నీవుతల్లివా! రాక్షసివా!నాఅన్న రామచంద్రుడు నీకు ఏమి అపకారం చేశాడు? తన తల్లి కన్నా మిన్నగా నిన్ను చూసుకున్నాడే? చీమకైనా అపకారం తలపెట్టని ఆ ఉత్తముడైన శ్రీ రాముణ్ణి అడవికి వెళ్ళమని చెప్పటానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఆ మహాసాధ్వి జానకి దేవికి ఎంతటి దుఃఖం కలిగించావో నీకు తెలియదా? సీతారాములు లేని అయోధ్యను నేను ఏలుకుంటానని నీవు ఎలా అనుకున్నావు? రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు తెలియదా! నీవు నాకు తల్లివి కాదు. ఛీ! నీ ముఖం చూడటానికి నాకు నమస్కరించడం లేదు. అల్పబుద్ధితో నీవు ఇక్ష్వాకు వంశానికే నాశనం తల పెట్టావు. నేను ఇక్కడ ఒక్క క్షణం అయినా ఉండను. నేను రాముని సన్నిధికే, వనవాసానికే వెళ్తాను”అని కోపంతో పలికాడు.
మరొకవైపు శతృఘ్నుడు మంథరను దండించ బోయాడు. అప్పటికి భరతుని ఆగ్రహం కొంత తగ్గి, శతృఘ్నుని కూడా శాంతింపజేశాడు.
సోదరులిద్దరూ కౌసల్యాదేవి మందిరానికి వెళ్లి ఆమె పాదాలపై పడి “అమ్మా! ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు.”అంటూ క్షమించమని ప్రార్థించారు.కౌసల్య వారిని చేరదీసి “నాయనా! నేను ఎవరిని నిందించడం లేదు. మీరు ఎల్లప్పుడూ నాకు ప్రేమ పాతృలే” అన్నది.
ముహూర్తం మించిపోతుందని భావించిన వశిష్ఠులవారు రాజ కుటుంబ సభ్యులను, మంత్రులను సమావేశపరిచి “కుమారా! భరతా! ఈ క్లిష్టతరమైన పరిస్థితి నుండి రాజ్యాన్ని రక్షించటం మన మొదటి కర్తవ్యం. అందుకు నీవు వెంటనే పట్టాభిషిక్తుడవై, దాన్ని పరిపాలించి రామచంద్రుడు తిరిగి వచ్చిన వెంటనే అతనికి ఇవ్వవలసినది” అని సలహా ఇచ్చాడు.
భరతుడు అంతా విని, ఒకసారి అందరి వైపు చూచి “నేను రాజ గురువుల మాటకు ఎదురు చెబుతున్నానని భావించవద్దు. మీరందరూ నాపై చూపిన అభిమానానికి కృతజ్ఞుడను. కానీ నన్ను ఈ విషయంలో ఒత్తిడి చేయవద్దు. నా అన్నగారు, ఉత్తముడైన శ్రీరామచంద్రుడు అడవులలో నారవస్త్రములు ధరించి తిరుగుతూ ఉండగా, నేను రాజుగా అంతఃపుర భోగాలను అనుభవిస్తూ ఉండలేను. నా దృఢమైన కోరిక ఒకటే. వెంటనే అరణ్యానికి వెళ్లి శ్రీరామచంద్రుని పాదాలపై పడి, తిరిగివచ్చి రాజ్యం ఏలుకోమని ప్రార్థించడం. మీరందరూ నాతో వచ్చి శ్రీరాముని ప్రార్థించండి” అన్నాడు.
భరతుడి పల్కిన ఈ మాటలకు అందరూ విస్తుపోయారు. శ్రీరాముని పై అతనికి కల భక్తిని, విధేయతను, త్యాగనిరతిని అందరూ శ్లాఘించారు. శ్రీరాముడిని చూడగలము అని ఆనందం కలిగింది. భరతుడు మంత్రులతో అరణ్య ప్రయాణానికి ఏర్పాట్లను చేయమన్నాడు.
ప్రశ్నలు:
- అయోధ్యకు తిరిగి రాగానే అక్కడి పరిస్థితి చూసి భరతుడికి కలిగిన భావన ఏమి?
- రాజ్యాన్ని పరిపాలించ మని అందరూ కోరినప్పుడు భరతుడు ఎందుకు వద్దన్నాడు?