భీష్మ ప్రతిజ్ఞ

Print Friendly, PDF & Email
భీష్మ ప్రతిజ్ఞ

ఈ కథ జరిగిన కాలంలో ఈ దేశం ‘మహాభారత దేశం’ అని పిలువబడేది. ఆ పేరు రావడానికి కారణము, ఈ దేశం ఎందరో మహావీరులకు పుట్టినిల్లు. మహాభారత కథ కౌరవ పాండవ వంశాలకు సంబంధించినది. ఈ రెండు వంశాలకు మూలపురుషుడు భీష్ముడు. అందుకే ఆయనకు పితామహుడని పేరు వచ్చింది. అందరు ఆయన్ని ప్రేమించేవారు, గౌరవించేవారు కూడా. ఆయన చక్రవర్తిగా స్వయంగా రాజ్య పాలన చేయకపోయినా ఎందరినో రాజులుగా చేశాడు. వారి కోసం యుద్ధాలు చేశాడు. ఆయనకు తండ్రినుండి ఒక గొప్ప సామ్రాజ్యము సంక్రమించింది కాని ఐచ్ఛికంగా దానిని ఒక మాటకోసం వదులుకున్నాడు.

భీష్మునికి పుట్టినపుడు పెట్టిన పేరు దేవవ్రతుడు. శంతనుడనుతను మహారాజునకు ఏకైక పుత్రుడై సకల భోగ భాగ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో శంతనుడు ఒకనాడు గంగానదీ తీరంలో ఒక మత్స్యకన్యను చూచి మోహిం చాడు. ఆమెను తనకు వివాహం చేయమని ఆమె తండ్రిని కోరాడు. కాని ఆ కన్య తండ్రి దాశరాజు ఆలోచించాడు. తన కుమార్తె రాణి కావచ్చు కాని ఆమెకు గుర్తింపులేదు. ఆమె సంతానానికి రాజ్యార్హత వుండదు! అని యోచించి తన కుమార్తెకు కలుగబోయే కుమారుణ్ణి సింహాసనము అధిష్టింప చేసే షరతు మీదే తన కుమార్తెను ఇస్తానన్నాడు. రాజు అంగీకరించాడు. కాని దాశరాజు అన్నాడు. “మహారాజా మీరు ఒప్పుకోవచ్చు. కానీ మీకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడుకదా? ఆయన రాజ్యాధికారం వదులుకుంటాడా?”

దీనికి శంతన మహారాజు నుండి ప్రత్యుత్తరం లేదు. రాజ్యానికి అన్ని విధాల తగినవాడు. తన ప్రియ పుత్రుడు, అందరి ప్రేమాభిమానాలు పొందిన దేవవ్రతుణ్ణి రాజ్యం వదులుకోమని ఎలా అడగడం అని ఆలోచించి మత్స్యగంధి తో వివాహం మాట ఎత్తలేదు. కాని ఆ కన్యమిది మోహంతో కృశించి పోతున్నాడు. తన తండ్రి విచారానికి కారణమేదో తెలుసుకున్నాడు దేవవ్రతుడు. వెంటనే దాశరాజు వద్దకు వెళ్ళి తన రాజ్యాధికారం వదలుకుంటానన్నాడు. కాని దాశరాజు తృప్తిపడలేదు. “యువరాజా ! నీ సంగతి సరే ! మరి నీ పుట్టబోయే సంతానము మాటేమిటి? వారు బదులుకుంటారా ?” అని అడిగాడు.

దేవవ్రతుడు సందేహించలేదు. “నాకు వివాహం అయితేగదా సంతానము? నేను వివాహమే చేసుకోను” అని భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు. తండ్రి కోర్కె తీర్చడం కోసం సుఖాలను రాజ్యాధికారాన్ని వదలుకున్నాడు. శంతన మహారాజు తన కుమారుని త్యాగానికి ఆశ్చర్యపడి దీవిస్తూ ఒక వరము ఇచ్చాడు. “నీవు కోరినంత కాలం జీవించగలవు. నీవు కోరినప్పుడే మృత్యువు వస్తుంది.”

తల్లిదండ్రుల దీవెనలు జీవితంలో రాబోవు సంఘటనలు సూచిస్తాయి కాబోలు. భీష్ముడు వృద్ధుడైన తర్వాత మహాభారత యుద్ధంలో అర్జునుని అస్త్రాలచే ఓడింపబడి అంపశయ్య పై పడి ఉంటాడు కాని ఉత్తరాయణం ప్రవేశించే వరకు ప్రాణాలు నిలుపుకొని స్వచ్ఛంద మరణాన్ని పొందుతాడు.

ఆజన్మ బ్రహ్మచర్యాన్ని వరించిన భీష్ముడు రాజకుమారుడుగా ఉన్న తాను రాజ్యం ఏలలేదు. మహా పరాక్రమశాలి, సకల యుద్ధ విద్యలు ఆరి తేరిన అతడు తన తమ్ములను సింహాసనంమీద నిలపడంకోసం ఎన్నో యుద్ధాలు చేస్తాడు. తాను రాజు కాలేదు. కాని రాజ్యంకోసం అంతా చేస్తాడు. తన సవతి తల్లి సత్యవతికి ఇద్దరు కుమారులు కలిగి, ఒకడు మరణిస్తాడు. అప్పుడు ఆమె భీష్ముని వివాహం చేసుకోమంటుంది. కాని తన భీష్మ ప్రతిజ్ఞను విడనాడలేదు.

ఒక రాజు ప్రకటించిన స్వయంవరానికి తాను వెళ్ళి, అక్కడకు వచ్చిన రాజకుమారుల నందరిని ఓడించి, రాజ పుత్రికలను బలవంతాన తెచ్చి తన తమ్మునికి వివాహం జరిపిస్తాడు. ఆనాటి రాజకుమారులలో యుద్ధ విద్యలో ఇతనికి సాటి మరొకరు లేరు.

కురుక్షేత్ర సంగ్రామం చివరివరకు భీష్ముడు జీవించాడు. కృష్ణునికి మహాభక్తుడై, భగవంతుని ఎల్లప్పుడు స్మరిస్తూ స్వచ్ఛంద మరణం పొందుతాడు. భారతదేశం గర్వించదగ్గ వీరులలో ఒకడు భీష్ముడు. చరిత్రలో ఇతని పేరు చిర స్థాయియై ఉంటుంది. రాజకుమారుడై పుట్టి, సకల విద్యలు నేర్చి, తన కత్తికి ఎదురులేని వీరుడైనాడు. కాని ఆజన్మ బ్రహ్మచారియై తన జీవితమంతా మరొకరికోసం గడుపుతూ కౌరవపాండవులిద్దరిచేత గౌరవింపబడిన మహావ్యక్తి భీష్ముడు.

ప్రశ్నలు:
  1. భీష్ముడు తన తండ్రి కొరకు చేసిన త్యాగమేది?
  2. తండ్రి మాట కోసం త్యాగం చేసిన మరొక పురాణ పురుషుడు ఎవరు ? ఆయన ఏమి చేశాడు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *