సాగరానికి వారధి
సాగరానికి వారధి
రాముడు తన ఎదురుగా ఉన్న బ్రహ్మాండమైన సముద్రాన్ని చూసి తన విల్లు, బాణాలను తెమ్మని లక్ష్మణునికి చెప్పేడు. రాముడు వింటికి బాణాన్ని సంధిస్తూ ఉంటే దీని పర్యవసానం ఎలా ఉంటుందోనని లక్ష్మణుడు భయపడ్డాడు, ఎందుకంటే సముద్ర కెరటాలు ఒక దాని వెనుక మరొకటి రాముని పాదాల వైపు పడి లేస్తూ, కరుణ చూపించమని ప్రార్థిస్తున్నట్లు కదిలిపోతున్నాయి. ఆ సమయంలో ఆకాశవాణిలా ఒక కంఠం వినిపించింది “ప్రభూ! మీ సైన్యంలో ఇద్దరు సేనాధిపతులున్నారు, మునులచే శపింపబడిన నలుడు, నీలుడు. ఆ శాపాన్ని ఒక ఆశీస్సుగా ఇప్పుడు వాడుకోవచ్చు” అని సముద్రుడు, రామునికి ఆ సంఘటనను ఇలా వివరించాడ.
ఒకానొక సమయంలో నలుడు, నీలుడు పసివారిగా ఉన్నప్పుడు, నదీతీరంలో చాలా మంది మునులు కుటీరాలలో నివసిస్తూ ఉండేవారు. వీరిద్దరూ ఆ కుటీరాలలోకి వెళ్ళి “సాలిగ్రామ”లని పిలువబడే దేవతా శిలల్ని తీసుకుని వెళ్ళి నీటిలో విసిరివేసేవారు. అప్పుడు మునులు “మీరు నీటిలో విసిరివేసినవన్నీ ఎప్పుడూ మునిగిపోక తేలి నీరు వరదలా ప్రవహించినా మీరు ఎక్కడ విసిరితే అక్కడే ఉండుగాక” అని శపించారు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
పిల్లలు అల్లరి వారుగా ఉంటే కొన్ని సమయాలలో పెద్దలు గద్దించవచ్చు, శిక్షించవచ్చు కూడా. ఎందుకంటే పిల్లలు తమ తప్పుల గాంభీర్యాన్ని తెలుసుకోవాలని పెద్దలు కోరుకుంటారు. కాని పిల్లలు వారి ప్రవర్తనకు విచారాన్ని వ్యక్తపరిచి తిరిగి అవి చెయ్యము అని వాగ్దానం చేస్తే, శిక్ష కూడా వారికనుకూలంగానే ఉండవచ్చు. నలుడు, నీలుని విషయంలో అదే జరిగింది.
“రామనామం వ్రాసి విసిరిన ప్రతి రాయి తేలుతుంది. రామా! నీ నామం తేలిక, బరువే ఉండదు. ఆ విధంగా పెద్ద కొండశిఖరాలు కూడా సముద్రంలో విసిరివేసినప్పుడు తేలుతూ వారధి ఏర్పడుతుంది” అని సముద్రుడు చెప్పేడు. రాముడు సముద్రానికి అడ్డంగా వారధి నిర్మించమని వానరులకు చెప్పాడు. నల, నీలుల్ని తమ శాపాన్ని ఉపయోగించుకుని, రాముడిని హృదయాలలో పెట్టుకుని, కొండలను, రాళ్ళను సముద్రంలోకి విసరమని జాంబవంతుడు చెప్పేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
దైవనామం గొప్ప శక్తి గలది కనుక భగవన్నామాన్ని స్మరిస్తూ పని ప్రారంభిస్తే ఏ పనీ కూడ కష్టసాధ్యం కాదు.
గ్రహించి అలవరుచుకోవలసిన మానవతా విలువలు: భగవంతుని రూపము కంటే నామమే ఎక్కువ శక్తి గలది.
నలుడు, నీలుడు నీటిలో విసరడానికి వీలుగా, వానరులు కొండల్ని తెచ్చి వారికందించడానికి వివిధ దిశలకు పరుగెత్తేరు. అయిదు రోజుల్లో శతయోజన విస్తీర్ణమైన వారధి నిర్మాణం జరిగింది. అంకిత భావంతో వారు చేసిన సేవకు రాముడు వానరుల్ని మెచ్చుకున్నాడు. రావణుడు పరమ శివ భక్తుడని విభీషణుడు రామునికి చెప్పేడు. విభీషణుని సలహాతో రాముడు రామలింగేశ్వరుని పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆచార ప్రకారం దానికి అర్చన చేసేడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
ఏ పని మొదలు పెట్టినా ముందు దైవాన్ని ప్రార్థించాలి. తాను అవతార పురుషుడు అయినప్పటికీ కూడా, రామచంద్ర ప్రభువు ప్రార్థన, శరణాగతుల విశిష్టతను సోదాహరణంగా ఆచరించి చూపించేడు.
గ్రహించి అలవరచుకోవలసిన విలువలు:ప్రార్థన లేని పని గుడ్డివానిలా తడుముకున్నట్టే ఉంటుంది.
ప్రార్థనతో అది నిజాయితీగా, ప్రభావశీలంగా మారుతుంది.
మూడు W లు: (WORK, VISION, WORSHIP) పని, విజ్ఞానము, పూజ.
అప్పుడు వానరులు పెదవులతో రామనామాన్ని స్మరిస్తూ వారధి పై సైనిక బృందంలా సాగిపోయారు. వెంటనే రాముడు, లక్ష్మణుడు, విభీషణుడు వారధి దాటి లంక ముఖద్వారాన్ని చేరుకున్నారు.